Burning Topic: అల్లర్లతో అట్టుడుకుతున్న నోయిడా.. నలుగురు ఉగ్ర అనుమానితుల అరెస్టు

Burning Topic: నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకంగా మారింది. వాహనాల దగ్ధం, పోలీసులపై రాళ్ల దాడుల నేపథ్యంలో పోలీసులు 350 మందిని అదుపులోకి తీసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 April 2026 7:50 AM IST
Burning Topic
X

Burning Topic: అల్లర్లతో అట్టుడుకుతున్న నోయిడా.. నలుగురు ఉగ్ర అనుమానితుల అరెస్టు

Burning Topic: దేశ రాజధానికి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన నోయిడాలో జరిగిన హింసాత్మక ఆందోళనలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. సోమవారం నాడుకార్మికులు ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో పరిస్థితులు అదపు తప్పాయి. జీతాల పెంపు కోరుతూ అహుజా ఫ్యాక్టరీ కార్మికులు ప్రారంభించిన నిరసనలు క్రమంగా ఇతర కంపెనీలకు వ్యాపించాయి. 42 వేల మంది కార్మికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి. కార్మికులతో పాటు అల్లరి మూకలు చేరి రాళ్లతో దాడులకు పాల్పడుతూ 80 కి పైగా ప్రదేశాలలో విధ్వంసం సృష్టించారు. 50 పైగా వాహనాలను నిప్పుపెట్టారు. పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వారి వాహానాలు కూడా ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి ఆర్‌ఏఎఫ్‌ దళాలు కూడా మోహరించాయి. సున్నితమైన ప్రాంతంలో అదనపు బలగాలు పెంచారు. పోలీసులు దాదాపు 350 మందిని అరెస్టు చేశారు

ఇటీవల హర్యానా ప్రభుత్వం అసంఘటిత రంగంలో కార్మికులకు కనీస వేతనాన్ని 35 శాతం పెంచుతూ ప్రకటనలు విడుదల చేసింది. ఈ క్రమంలో యూపీలోనూ వేతనాలు పెంచాలనే డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో నోయిడాలో కార్మికులు ఆందోళనలకు దిగారు. వేతన పెంపుతో పాటు పని ప్రదేశంలో మెరుగైన పరిస్థితుల కోసం నిరసనలు చేపట్టారు. ‘‘పని ప్రదేశాల్లో మాకు భద్రత కల్పించాలి. యంత్రాంగాల కొరత, వారాంతాల సెలవుల సమస్యలను పరిష్కరించాలి’’ అంటూ ఆందోళన మొదలైంది. అహుజా ఫ్యాక్టరీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు ఇతర కంపెనీలకు కూడా ప్రారంభమయ్యాయి. నైపుణ్యం లేని కార్మికులకు ఒక విధమైన అలవెన్సులు ఇస్తున్నారు. నైపుణ్యం ఉన్న కార్మికులను పట్టించుకోవడంలేదని వారు పెద్ద ఎత్తున నిరసన చేశారు. గంటకు 90 అలవెన్స్ ఇస్తారు. కానీ ఆ తర్వాత 50కి తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నోయిడాలోని ఫేజ్-2, సెక్టార్ 60, సెక్టార్ 62, సెక్టార్ 84 సహా పలు ప్రాంతాల్లో కార్మికులు ఆందోళనకు దిగారు.

కాగా నోయిడాలో చోటుచేసుకున్న కార్మికుల ఆందోళనల్లో పాకిస్థాన్‌ పాత్ర ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ సర్కార్ అనుమానిస్తోంది. నోయిడా, మీరట్‌ నగరాల్లో ఇటీవల నలుగురు ఉగ్ర అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ అల్లర్లకు కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు బాహ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. .మొత్తం వాట్సాప్ గ్రూపుల ద్వారా వదంతులు సృష్టిస్తున్నట్లు సమాచారం. రెచ్చగొట్టే కంటెంట్ ను వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియాకు ఖాతాలో హల్‌చల్ చేస్తున్నారు. దీంతో వాటిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కేసులో నమోదు చేశారు. ఉద్రిక్త వాతావరణం సృష్టించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా కూడా ఈ నిరసనలకు కారణమైన వారిని పోలీసులు చెక్ చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. కుట్ర కోణం ఉందన్న అనుమానంతో నోయిడాలో పోలీసుల భద్రతను మరింతగా పెంచారు

నోయిడా అల్లర్లు పక్కా ప్రణాళిక ప్రకారం జరిగాయని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అనుమానిస్తోంది. ముజఫర్‌నగర్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యక్రమానికి అంతరాయం కలిగించే కుట్రలో భాగంగానే ఈ అల్లర్లు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్. దాడులకు పాకిస్థాన్‌తో సంబంధం ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. అస్థిరతను సృష్టించే ఉద్దేశంతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి రాజ్‌భర్ చెప్పారు. రాష్ట్రంలో అస్థిరతను సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. కార్మికులు ప్రశాంతంగా ఉండాలని, రెచ్చగొట్టే చర్యలకు, తప్పుడు సమాచారానికి ప్రభావితం కాకూడదని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు వినేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.

నోయిడా హింసపై ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ ‘‘కార్మికులకు వారి హక్కులు దక్కి తీరాలి. పరిశ్రమలు వాటి చట్టాలను కచ్చితంగా పాటించాలి. కానీ కొంతమంది కార్మికులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు. అలాంటి సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షిస్తాం’’ అని హెచ్చరించారు. ఈ ఆందోళనలపై పారిశ్రామిక యూనిట్లతో తక్షణమే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నోయిడా హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను రూ.3వేలు వరకు పెంచుతూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నోయిడా, గజియాబాద్‌లలోని నైపుణ్యం లేని కార్మికుల నెలవారీ వేతనాలు రూ.11,313 నుంచి రూ.13,690కి పెంచింది. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇతర రంగాల కార్మికులకు కూడా వేతనాలు పెంచుతున్నట్లు పేర్కొంది. అయితే, మున్సిపల్‌ కార్పొరేషన్లు, జిల్లాల్లో ఈ వేతన పెంపు వేరువేరుగా ఉంటుందని స్పష్టంచేసింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story