Burning Topic: యుద్దానికి ముగింపు.. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ?


Burning Topic: యుద్దానికి ముగింపు.. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ?
Burning Topic: ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధం ముగియనుందా? 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై పాకిస్థాన్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం! డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కొత్త డెడ్ లైన్ ఏంటి?
Burning Topic: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు పుల్‌స్టాప్ పడనుందా? ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం త్వరలో ముగియనుందా? ఏమో.. తాజా పరిణామాలు ఆ విధమైన సంకేతాలే ఇస్తున్నాయి. కానీ అమెరికా షరతులను ఇరాన్ ససేమిరా అంటోంది. తాజా యుద్ధాన్ని ముగించేందుకు రీజనల్ మీడియేటర్లు ప్రతిపాదించిన45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఫలించి యుద్ధానికి తెరపడనుందోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడుల నేపథ్యంలో తాజా వార్త ఒకటి ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే రెండు దేశాల మధ్య 45 రోజుల కాల్పుల విరమణ అంశం. ఈ సమయంలో హర్ముజ్ జలసంధి సహా ఇతర కీలక అంశాలను చర్చించే దిశగా పలు ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించడం కోసం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు పాక్, తుర్కియే, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ముసాయిదా ప్లాన్‌ను రెండు దేశాలకు అందించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఆ ప్లాన్‌లో 45 రోజుల కాల్పుల విరమణ, హర్మూజ్‌ను తెరవడం వంటి అంశాలను ప్రతిపాదించారు. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృత చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముసాయిదాను అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియనున్న వేళ యుద్ధానికి శాశ్వత ముగింపు పలికే అవకాశం ఉన్న 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా, ఇరాన్, ప్రాంతీయ మధ్యవర్తులు చర్చిస్తున్నారని ఆక్సియోస్ నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్, ప్రాంతీయ వర్గాలను ఉటంకిస్తూ రాబోయే 48 గంటల్లో పాక్షిక ఒప్పందానికి కూడా చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. సమయం మించిపోతోందని, భారీ విధ్వంసాన్ని నివారించడానికి ఇదే చివరి అవకాశం అని మధ్యవర్తులు ఇరాన్ అధికారులను హెచ్చరించారు. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్ దేశాల్లోని ఇంధన, నీటి సౌకర్యాలపై ప్రతీకార దాడులు వంటి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తుతాయనే భయాల మధ్య ఈ అత్యవసర చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్‌కు ఇచ్చిన అసలు 10 రోజుల గడువు సోమవారం సాయంత్రంతో ముగియాల్సి ఉండగా, దానిని 20 గంటలు పొడిగించారు. ట్రూత్ సోషల్‌లో ట్రంప్, మంగళవారం రాత్రి 8 గంటల వరకు కొత్త గడువును ప్రకటించారు. ఇరాన్ ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని భారీస్థాయి బాంబు దాడులకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ మధ్యవర్తిత్వానికి చివరి అవకాశం కల్పించడానికే ఈ గడువును పొడిగించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ దేశాల మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుగుతున్నాయన్న విషయం అదిరికీ తెలిసిందే. అయితే ఈ దేశాలతోపాటు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీల మధ్య ప్రత్యక్ష సందేశాల మార్పిడి కూడా జరుగుతోందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలలో దేనినీ ఇరాన్ అంగీకరించలేదని సమాచారం. ప్రతిపాదిత ఒప్పందంలో రెండు దశలు ఉన్నాయి. మొదటిది 45 రోజుల కాల్పుల విరమణ. ఈ సమయంలో శాశ్వత పరిష్కారం కోసం తదుపరి చర్చలు జరుగుతాయి. అవసరమైతే ఈ కాల్పుల విరమణను పొడిగించవచ్చు. గాజా లేదా లెబనాన్ వంటి పరిస్థితిని తాము కోరుకోవడం లేదని ఇరాన్ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఆ దేశాలలో కాల్పుల విరమణ ఒప్పందాలు కాగితాల మీద మాత్రమే ఉన్నప్పటికీ, అవి తరచుగా ఉల్లంఘించబడుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇరాన్ ఆందోళనలను పరిష్కరించడానికి, వాషింగ్టన్ నుంచి మధ్యవర్తులు కూడా కృషి చేస్తున్నారు. అయితే ఈ చర్చలపై కామెంట్ చేయడానికి వైట్ హౌస్ ప్రతినిధులు నిరాకరించారు.
మంగళవారం తన గడువు ముగిసేలోపు వాషింగ్టన్‌తో శాంతి ఒప్పందానికి టెహ్రాన్ రాకపోతే ‘మొత్తం ఇరాన్‌ను పేల్చేస్తానని’ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరానీయులకు అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తాననీ ఇదివరకే ఆయన బెదిరించారు. అమెరికన్ మీడియా సంస్థలకు ఇచ్చిన వరుస ఇంటర్వ్యూలలో ట్రంప్ మాట్లాడుతూ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ఇదివరకే పూర్తిగా నాశనమైపోయిందన్నారు. ప్రతీరోజు పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు. మా దాడులు ఇలాగే కొనసాగితే ప్రతీరోజు ఇరాన్ మరిన్ని వంతెనలు, విద్యుత్ కేంద్రాలు నిర్మించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ దెబ్బతిన్నంతగా మరో దేశం ఏదీ దెబ్బతినలేదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని డొనాల్డ్ ట్రంప్.. బూతు పురాణాలకు కూడా దిగారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడి చేస్తామని, ఆ దేశం నరకంలో జీవిస్తుందన్నారు.
అయితే ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ ఎదురుతిరిగింది. పొరుగున ఉన్న గల్ఫ్ అరబ్ దేశాలలోని మౌలిక సదుపాయాల లక్ష్యాలపై దాడి చేసింది. అరేబియా ద్వీపకల్పం వద్ద రద్దీగా ఉండే మరో జలమార్గం, బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని కూడా మూసివేస్తామని బెదిరించింది. మరోవైపు ట్రంప్ ఉడుత ఊపులకు తగ్గేదే లే అని ఇరాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ట్రంప్ ఇటువంటి గడువులు ప్రపంచ దేశాలకు కొత్తేమీ కాదని ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ రెజా సాలిహి అమీరి అన్నారు. ట్రంప్ మానసిక పరిపక్వత స్థిరంగా ఉండటం లేదని సెటైర్లు వేశారు. నిరంతరం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ సయ్యద్ రెజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలా ఉండగా.. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ చర్చలు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఫలించే అవకాశాలు ఏమేరకు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్, ఈజిప్ట్ మరియు టర్కీ దేశాలు ఈ చర్చల్లో ప్రధాన మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. అమెరికా మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పరోక్ష మార్గాల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇకవేళ చర్చలు విజయవంతమైతే, మొదటి దశలో 45 రోజుల కాల్పుల విరమణ ఉంటుంది. ఈ సమయంలో శాశ్వత శాంతి ఒప్పందం కోసం రెండో దశ చర్చలు సాగుతాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్ విధించారు. ఒకవేళ ఇరాన్ చర్చలకు అంగీకరించకపోయినా.. హర్ముజ్ జలసంధిని తెరవకపోయినా.. ఇరాన్ ఇంధన వనరులతోపాటు మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఫలించే అవకాశాలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చర్చలపై ఇరాన్ ఇప్పటివరకు ఆశాజనకంగా స్పందించలేదు. తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రయోజనాలకు భంగం కలిగితే చర్చలకు తావులేదని ఇరాన్ రాయబారి ఒకరు స్పష్టం చేశారు. అయితే అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ ఇప్పటికే తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఫలించాలంటే ఆంక్షల తొలగింపు వంటి ఇరాన్ విధించిన షరతులు.. అమెరికా కోరుతున్న భద్రతా హామీల మధ్య సమతుల్యత కుదరాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు మాత్రం ఆగలేదు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

