Burning Topic: అమెరికాలో భారతీయం!
Burning Topic: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికాలోని డెలావేర్, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి పలు రాష్ట్రాలు ఆగస్టు 15ను 'ఇండియా డే'గా ప్రకటించాయి.
Burning Topic: అమెరికాలో భారతీయం!
Burning Topic: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆగస్టు 15ను 'ఇండియా డే'గా ప్రకటించాయి. అమెరికాలో స్థిరపడిన భారత సంతతి ప్రజల సేవలు, విజయాలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా డెలావేర్ రాష్ట్రం కూడా ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటించింది. అంతకుముందు న్యూయార్క్, న్యూజెర్సీ, మాసాచుసెట్స్ కూడా పంద్రాగస్టునాడు భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాలు అధికారికంగా జరిపేందుకు సిద్ధమయ్యాయి.
ఈ సందర్భంగా భారతీయ అమెరికన్ల సేవలను డెలావేర్ గవర్నర్ మ్యాథ్యూ ప్రత్యేకంగా ప్రస్తావించడం ఓ మంచి పరిణామం. డెలావేర్‌లో అనేక సంస్కృతులు, సంప్రదాయాలను అనుసరించే ప్రజలు నివసిస్తున్నారని, వారి భాగస్వామ్యంతో రాష్ట్రం మరింత బలోపేతమవుతోందని మ్యాథ్యూ చెప్పుకొచ్చారు. డెలావేర్‌లో భారతీయ అమెరికన్ సమాజం క్రమంగా విస్తరిస్తోందని, ఆ వర్గానికి చెందిన ప్రజలు తమ పని, నాయకత్వం, సేవల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారని కూడా ప్రశంసించారు.
భారతీయ సంతతికి చెందిన ప్రజలు డోలావేర్‌లోని వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆ రాష్ట్ర గవర్నర్ కొనియాడారు. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. భారతీయ భాషలు, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతుల వైవిధ్యం ఎంతో ప్రత్యేకమైనదని అభిప్రాయపడ్డారు. తరతరాలుగా భారతీయ అమెరికన్లు వాటిని అమెరికాలో కొనసాగిస్తూ తమకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారన్నారు. పంద్రాగస్టునాడు ఇండియా డేగా జరుపుకోవడంవల్ల భారత స్వాతంత్ర్యాన్ని గౌరవించడంతోపాటు డెలావేర్‌లోని భారతీయ అమెరికన్ సమాజం సాధించిన విజయాలను గుర్తించే అవకాశం లభిస్తుందని చెప్పుకొచ్చారు. వీటితోపాటు భారత్, అమెరికా ప్రజల మధ్య ఉన్న బలమైన, దీర్ఘకాలిక సత్సంబంధాలను కూడా ఆ సందర్భంగా గుర్తుచేసుకునే ఓ గొప్ప అవకాశం లభిస్తుందని తెలిపారు.
అగ్రరాజ్యంలోని న్యూయార్క్, న్యూజెర్సీ, మాసాచుసెట్స్ రాష్ట్రాలు కూడా భారత పంద్రాగస్టు వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చాయి. ఆగస్టు 15ను ఇండియన్ ఇండిపెండెన్స్ డేగా గుర్తిస్తూ న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్, న్యూజెర్సీ గవర్నర్ మికీ షెరిల్ విడివిడిగా ప్రకటనలు జారీ చేశారు. ఇలా భారత స్వాతంత్ర్య దినోత్సవానికి అమెరికాలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించడంపై ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉండగా ప్రతి ఏడాది ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దిన వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంతోపాటు అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న భారత కాన్సులేట్లలో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా ప్రత్యేక పరేడ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
అమెరికాలోని ప్రముఖ కట్టడాలపై భాతర త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. ఇందుకోసం ఆయా ప్రాంగణాలు ప్రత్యేకంగా ముస్తాబవుతాయి. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సహా పలు ప్రముఖ భవనాలు భారత జాతీయ పతాకంలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో వెలుగులు విరజిమ్ముతాయి. సియాటెల్‌లోని స్పేస్ నీడిల్ వంటి ప్రముఖ కట్టడాల వద్ద ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా అమెరికాలోని నగర వీధులు భారత మాతాకీ జై అనే నినాదాలు మార్మోగనున్నాయి.




