Burning Topic: అమెరికా టెర్రర్ దాడికి 25 యేళ్ళు!
Burning Topic: అమెరికాలో 9/11 దాడులకు 25 ఏళ్లు. అల్‌ఖైదా భీకర దాడి, లాడెన్ హతం నుంచి ఉగ్రవాదంపై అమెరికా ద్వంద్వ వైఖరి, భారత్ హెచ్చరికల వరకు పూర్తి విశ్లేషణ.
Burning Topic: అమెరికా టెర్రర్ దాడికి 25 యేళ్ళు!
Burning Topic: 2001 సెప్టెంబరు 11 ఆనాడు జరిగిన ఘటనతో అమెరికా నిలువెళ్లా వణికిపోతే, యావత్ ప్రపంచం విస్తుపోయింది. అప్పటికే ప్రపంచాన్ని భయపెడుతున్న ఉగ్రవాద పంజాకు అగ్రరాజ్యానికి ఇంత బలంగా తగులుతుందని ఎవరూ ఊహించలేదు. ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంలోని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా తన ఉనికి చాటుకునేందుకు ఏకంగా అమెరికాను ఎంచుకుంది. శిక్షణలో రాటుతేలిన ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి పక్కా ప్రణాళికతో దాడులకు దిగారు. ఆ రోజు ఉదయం బోస్టన్ నుంచి రెండు విమానాలు గాలిలోకి ఎగిశాయి. ఉదయం 8.46 గంటలకు మొదటి విమానం న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టింది. అక్కడి జనాలు, భద్రతా సిబ్బంది ఏం జరిగిందో తెలియక ఆహాకారాలు చేస్తున్నారు. వారు తేరుకోక ముందే 11 నిమిషాల వ్యవధిలో రెండో విమానం సౌత్ టవర్‌లోకి దూసుకెళ్లింది. రెండు టవర్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని రెండు టవర్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చేశారు. కొందరు ప్రాణాలు దక్కించుకొనే క్రమంలో టవర్ల నుంచి కిందికి దూకేశారు. నిమిషాల వ్యవధిలోనే రెండు టవర్లు నేలమట్టమయ్యాయి. అప్పటిదాకా అందరూ ఇది విమాన ప్రమాదంగానే భావించారు. మరోవైపు వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లెస్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన మూడో విమానం ఉదయం 9.37 గంటలకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ నైరుతి వైపు భాగాన్ని ఢీకొట్టింది. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మూడుచోట్ల విమాన ప్రమాదాలు జరగడంలో ఇది ఉగ్రవాద దాడికి అనుమానించిన ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అప్రమత్తమైంది. న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి వస్తున్న నాలుగో విమానం మాత్రం పెన్సిల్వేనియా గ్రామీణ ప్రాంతంలోని షాంక్స్‌విల్ సమీపంలో కూలిపోయింది. విమానంలోని ప్రయాణీకలు ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే విమానం కుప్పకూలింది.
అల్‌ఖైదా జరిపిన భీకర ఉగ్రదాడితో అగ్రరాజ్యంతో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించారు. మృతి చెందిన వారిలో 90 దేశాల పౌరులు ఉన్నారు.
ఇందులో 35 నుంచి 41 మంది భారతీయులు మరణించినట్లు అంచనా. ఆనాటి ఉగ్ర దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది. అమెరికా నిఘా సంస్థల వద్ద ఈ దాడులకు సంబంధించిన కీలక సమాచారం ముందే ఉన్నప్పటికీ, సకాలంలో అంచనా వేయలేకపోయారని తేలసింది
2001 సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రదాడుల తర్వాత, అమెరికా తన అంతర్గత భద్రతను, విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేస్తూ అత్యంత కఠినమైన చర్యలను తీసుకుంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారికి ఆశ్రయం కల్పించిన వారిని శిక్షించి తీరుతామని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రతిజ్ఞ చేశారు. సెప్టెంబర్ 11 దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ‘గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్’ప్రారంభించింది. దాడులకు సూత్రధారి అయిన అల్-ఖైదా నెట్‌వర్క్‌ను, దానికి ఆశ్రయమిచ్చిన తాలిబాన్ పాలనను అంతం చేయడానికి 2001 అక్టోబర్‌లో అమెరికా ఆఫ్ఘనిస్థాన్‌పై సైనిక దాడులు చేపట్టింది. అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాద ఒసామా బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్తాన్ భూభాగంలోని అబోటాబాద్‌లో అమెరికా సైన్యం చేతిలో దారుణంగా హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌ను నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా లైవ్ ద్వారా తిలకించి ప్రకటించారు.
అంతర్జాతీయ ఉగ్రవాదంపై అమెరికా ప్రారంభించిన యుద్ధం సఫలమైందా? అనే ప్రశ్న తలెత్తక మారదు. ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతూనే ఉంది.సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉగ్రవాదులు దాడులకు దిగారు. వేలాది మంది చనిపోయారు. కానీ ఉగ్రవాద భూతంఅంతమయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతూనే ఉంది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లపై అమెరికా యుద్ధానికి దిగింది. అయితే, 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం తర్వాత భారీగా ప్రాణ, ధన నష్టం సంభవించి, చివరకు ఆఫ్ఘనిస్తాన్‌లో తిరిగి తాలిబన్లే అధికారంలోకి రావడం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. కేవలం సైనిక బలంతో ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని అమెరికా ఆలస్యంగా గ్రహించింది. కాగా అమెరికాలో మాత్రం గత 25 ఏళ్లలో చెప్పుకోదగ్గ ఉగ్రవాద దాడులేవీ జరగలేదు.
మరోవైపు ఉగ్రవాదంపై అమెరికా ద్వంద్వ వైఖరి పాటిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెబుతూనే, మరోవైపు తన భౌగోళిక-రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ఉగ్రవాద గ్రూపులను లేదా వాటిని ప్రోత్సహించే దేశాలను వెనకేసుకువస్తోందని భారత్, చైనా, రష్యాతో పాటు పలువురు అంతర్జాతీయ నిపుణులు నిలదీస్తున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు భారత్‌పై దాడులు చేస్తున్నప్పటికీ, అమెరికా దశాబ్దాలుగా ఆ దేశానికి ఆర్థిక, సైనిక సహాయాన్ని అందింస్తూనే ఉంది. 2008 ముంబై దాడులు, ఇటీవలి కశ్మీర్ పహల్గామ్ దాడులు జరిగినప్పుడు, అమెరికా వాటిని ఖండిస్తూనే, భారత్ సైనిక చర్యలు తీసుకోకుండా సంయమనం పాటించాలి అని కోరడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా తన భూభాగంపై దాడి చేసిన ఉగ్రవాదులను ఏరేయడానికి ఇతర దేశాలపై యుద్దం చేసింది. కానీ భారత్ విషయంలో మాత్రం అంతర్జాతీయ నిబంధనలు, సార్వభౌమత్వం గురించి మాట్లాడుతోంది
భారత వ్యతిరేక శక్తులు మరియు ఖలిస్తానీ ఉగ్రవాద మద్దతుదారులు తమ దేశాల్లో బహిరంగంగా తిరుగుతున్నా, భారత్‌కు వ్యతిరేకంగా బెదిరింపులకు దిగుతున్నా అమెరికా, పాశ్చాత్య దేశాలు "వ్యక్తీకరణ స్వేచ్ఛ" నెపంతో వారిపై చర్యలు తీసుకోకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఐక్యరాజ్య సమితి, షాంగై, బ్రిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఉగ్రవాదంపై ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ సాధనంగా చూడటం మానవాళికి ద్రోహం చేయడమేనని భారత్ గట్టిగా వాదిస్తోంది. అమెరికా అధికారికంగా "ఉగ్రవాదంపై గ్లోబల్ వార్" ప్రకటిస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం తన జాతీయ ప్రయోజనాలు, మిత్రదేశాల సంబంధాలు, వ్యూహాత్మక రాజకీయాల ఆధారంగానే స్పందించడం చేస్తోందనే విమర్శలున్నాయి.




