Big Story: పంజాబ్లో మోగిన ఎన్నికల నగారా.. AAP తొలి జాబితా అవుట్!
Big Story: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
Big Story: పంజాబ్లో మోగిన ఎన్నికల నగారా.. AAP తొలి జాబితా అవుట్!
Big Story: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. వచ్చే ఏడాది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ 40 మంది అభ్యర్థులతో కూడిన తమ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో పాటు పలువురు మంత్రులు అలాగే స్పీకర్ కుల్తార్సింగ్ సంద్వాన్ పేర్లు ఉండటం విశేషం.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన ప్రస్తుత నియోజకవర్గమైన ధూరి నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. అలాగే శాసనసభ స్పీకర్ కుల్తార్సింగ్ సంద్వాన్ కోట్కపురా స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ కుమార్ గుప్తా ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ కీలక సమావేశానికి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పంజాబ్ ఇన్ఛార్జ్ మనీశ్ సిసోడియా, ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా ఇతర పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ప్రకటన అనంతరం అభ్యర్థులకు కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన అనంతరం, మనీశ్ సిసోడియా కూడా ఎక్స్ వేదికగా ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం మన బాధ్యత అన్నారాయన. అంతేకాదు ప్రతి గడపగడపకి వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా వినాలని అభ్యర్థులను ఆయన కోరారు.అంతిమంగా పంజాబ్ పురోగతికి మీ పూర్తి శక్తిని వెచ్చించండి అని ఎక్స్ పోస్టులో సిసోడియా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఇటీవల భారత ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం జిల్లా వారీగా సమీక్ష నిర్వహించింది. ఈ బృందంలో పలువురు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్రంలోని 23 మంది జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొని, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. వీరంతా తమ జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ గురించి పరిస్థితిని వివరించారు. ఎన్నికల నియమావళిని పారదర్శకతను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
పంజాబ్ శాసనసభా గడువు 2027 మార్చి 16నాటికి ముగియనుంది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో శాసనసభా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశాలున్నాయి.
అయితే శిరోమణి అకాళీదళ్, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, చివరిసారిగా 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 92 స్థానాలను గెలుచుకుంది. కాగా కాంగ్రెస్ 18 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.
ఇదిలా ఉంటే, ఈసారి పంజాబ్ ఎన్నికల్లో మాదకద్రవ్యాల సమస్య కీలకాంశంగా మారింది.పంజాబ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల అంశం చాలా కాలంగా ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో డ్రగ్స్ సమస్య రాజకీయ రంగు పులుముకుంది.
ఇక్కడ మాదకద్రవ్యాల సమస్య తీవ్రతరం కావడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ సరిహద్దులకు పంజాబ్ సమీపాన ఉండటం ప్రధాన కారణంగా మారింది. సరిహద్దుల నుంచి పంజాబ్ లోకి మాదకద్రవ్యాల సరఫరా చాలా సులభంగా జరుగుతోంది.
ఇదే విషయమై ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. భగవంత్ మాన్ ప్రభుత్వ చేతగానితనం వల్లనే పంజాబ్ లో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోయిందని కేంద్ర మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. అయితే సరిహద్దుల్లో కేంద్ర బలగాల నిఘా సరిగా లేకపోవడం వల్లనే చాలా సులభంగా డ్రగ్స్ ..పంజాబ్ లోకి ప్రవేశిస్తున్నాయని భగవంత్ మాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కాగా వచ్చే ఏదాడి జరిగే పంజాబ్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబే. దాదాపు ఏడాది కిందట జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం పంజాబ్ ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, గత నాలుగేళ్లుగా పంజాబ్ లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది.అలాగే అంతర్గత విభేదాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి తలనొప్పిగామారాయి. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి గత ఎన్నికల్లో అండగా నిలిచిన కొన్ని సామాజిక వర్గాలు..ఈసారి యూ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి సవాళ్లు విసురుతున్నాయి.ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధాన సవాల్ గా మారింది.




