Burning Topic: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు టైమ్ వచ్చేసినట్టే!

Burning Topic: నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అబుదాబిలో శాంతి చర్చలు. ప్రధాని మోదీతో సంభాషించిన జెలెన్‌స్కీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2026 7:36 AM IST
Burning Topic
X

Burning Topic: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు టైమ్ వచ్చేసినట్టే!

Burning Topic: గత నాలుగేళ్లుగా ఎడతెగకుండా కొనసాగుతూ, తీవ్ర మానవ ప్రాణనష్టాన్ని మరియు ఊహించని ఆర్థిక, భౌగోళిక విధ్వంసాన్ని మిగిల్చింది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రారంభించిన పూర్తిస్థాయి దండయాత్ర నాటి నుండి నేటివరకు యూరప్ ఖండంలో అత్యంత రక్తపాతాన్ని సృష్టించిన సంఘటనగా నిలిచింది. తాజాగా ఈ సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికేందుకు ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై కీలకమైన శాంతి చర్చల ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి వేదికగా రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాల ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి శాంతి చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల్లో అమెరికా తరఫున స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే రష్యా తరఫున అధ్యక్షుడి సలహాదారు వ్లాదిమిర్ మెడిన్స్కీ నేతృత్వంలోని 11 మంది ప్రతినిధుల బృందం పాల్గొంటోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు సమయం ఆసన్నమైందని అమెరికా పేర్కొంది. నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ భీకర పోరాటంలో కాల్పుల విరమణను సాధించి, ఒక కొలిక్కి తీసుకురావడమే ఈ అత్యున్నత స్థాయి త్రైపాక్షిక దౌత్య చర్చల ప్రాథమిక లక్ష్యమని అమెరికా చెబుతోంది.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు చైనా, రష్యా నేతలతో త్రైపాక్షిక చర్చలకు సిద్ధమని ప్రకటించారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా ప్రతినిధులు నేరుగా సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దశాబ్దాల నాటి రష్యా అభద్రతాభావాలు, ప్రాంతీయ వివాదాలు, ఇరుపక్షాల మధ్య పెరిగిన పరస్పర దూరం దృష్ట్యా శాంతి ఒప్పందం రాత్రికి రాత్రే సాధ్యం కాకపోవచ్చని, ఓపికగా చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుందని అమెరికా ఉన్నతాధికారులు, అంతర్జాతీయ వ్యూహకర్తలు అంటున్నారు.

అబిదాబీలో మూడు దేశాల త్రైపాక్షిక చర్చలు రెండు దశల్లో జరుగుతామని అమెరికా ప్రతినిధులు చెబుతున్నారు. మొదటి దశలో అత్యంత సవాలుతో కూడుకున్న కాల్పుల విరమణ అమలు తీరుతెన్నులపై దృష్టి పెడగారు. తాత్కాలికంగా యుద్ధం ఆపిన సమయంలో ఏ వైపు తిరిగి సైనిక బలగాలను మోహరించుకోవడానికి కాని, ఆయుధాలు సమకూర్చుకోకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇరు దేశాల మధ్య పరస్పరం ఉన్న అనుమానాలే శాంతికి ప్రధాన అవరోధమని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక రెండో దశ చర్చల్లో ప్రధాన అంశం భూభాగం. రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న డోనెట్స్క్ ప్రాంతం మొత్తాన్ని తమకే ఇవ్వాలని పట్టుబడుతుండగా, ప్రస్తుత సరిహద్దుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ఉక్రెయిన్ ప్రతిపాదిస్తోంది. అయితే, ఉక్రెయిన్ భవిష్యత్ భద్రతా వ్యవహారం కొలిక్కి వచ్చేవరకు సరిహద్దుల అంశం తేలదని అమెరికా భావిస్తోంది.

ఒకవైపు అమెరికా చర్చలు జరుపుతుండగా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు మాత్రం భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను పూర్తిగా నిలిపివేసిన తర్వాతే సరిహద్దుల భద్రతపై రష్యాతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీతో పాటు నాటో, ఈయూ ప్రతినిధులతో ఉక్రెయిన్ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. రష్యాకు యూరోప్ దేశాల పట్ల విశ్వాసం లేకపోయినా, ఈ బహుపాక్షిక చర్చల్లో రష్యా భాగస్వామ్యాన్ని అమెరికా ప్రతిపాదిస్తోంది. ముఖ్యంగా నాటో 'ఆర్టికల్ 4, 5' ఆధారిత భద్రతా హామీలను ఉక్రెయిన్‌కు ఇచ్చేలా రష్యాను ఒప్పించే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. అలాగే రష్యాపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను విడతలవారీగా ఎత్తివేయడం, ఒప్పందం ఉల్లంఘిస్తే తిరిగి ఆ అంక్షలను అమల్లోకి తేవడం వంటి సున్నితమైన ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తోంది. శాంతి చర్చలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలన్న వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారు. అదేవిధంగా భారత్- ఉక్రెయిన్‌ మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జెలెన్‌స్కీ, ప్రధాని మోదీ చర్చించుకున్నారు. మరోవైపు.. యుద్ధాన్ని ముగించేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు చెప్పారని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా నేరుగా ఈ మాట అన్నారని జెలెన్‌స్కీ గుర్తుచేశారు. మోదీతో ఫోన్‌ సంభాషణపై ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు.

2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ప్రారంభమైన ఈ పోరాటం 4 ఏళ్ల 8 నెలల సుదీర్ఘ కాలంగా సాగుతోంది. కొద్దిరోజుల్లోనే ముగుస్తుందనుకున్న ఈ ఘర్షణ, మొదటి ప్రపంచ యుద్ధం కాలవ్యవధి 1,568 రోజులను కూడా దాటేసి యూరోప్‌లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భీకరమైన అంతర్-రాష్ట్ర యుద్ధంగా రికార్డులకు కెక్కింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఘర్షణల అసలు మూలాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ యుద్ధం 2014లో ప్రారంభమై 12 సంవత్సరాలు దాటింది. 2014 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ప్రాంతాన్ని రష్యా బలవంతంగా ఆక్రమించుకోవడంతో ఈ వివాదం మొదలైంది. 2022 సెప్టెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌కు చెందిన లుహాన్‌స్క్, డొనెట్‌స్క్, జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాలను తమ దేశంలో కలుపుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ యుద్ధంలో అధికారిక పత్రాల ప్రకారం ఇప్పటివరకు 4.5 లక్షల మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు.

గాయపడిన, గల్లంతైన వారితో కలిపి రష్యా సైన్యానికి జరిగిన మొత్తం నష్టం దాదాపు 14 లక్షలకు పైగా ఉంటుందని అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ అంచనా వేసింది. ఉక్రెయిన్ సైన్యంలో ఇప్పటివరకు 1.25 లక్షల నుండి 1.50 లక్షల మంది సైనికులు మరణించినట్లు అంచనా. క్షతగాత్రుల సంఖ్య 5 లక్షలకు పైగా ఉంది.

ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల ఉక్రెయిన్‌కు చెందిన 16,800 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, 42,000 మందికి పైగా గాయపడ్డారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభాలో నాలుగో వంతు అనగా దాదాపు 1.1 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లడం లేదా దేశంలోనే అంతర్గతంగా వలసపోవడం జరిగింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్