Burning Topic: వణికిస్తున్న ఏఐ.. గతి తప్పితే అంతే!

Burning Topic: కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో మానవాళికి ముప్పు తప్పదంటున్న టెక్ దిగ్గజాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Sept 2026 7:46 AM IST
Burning Topic
X

Burning Topic: వణికిస్తున్న ఏఐ.. గతి తప్పితే అంతే!

Burning Topic: పెరుగుట విరుగుట కొరకే అన్నారు మన పెద్దలు. ఏదైనా అతిగా పెరిగితే లేదా విర్రవీగితే, అది చివరికి పతనానికి దారితీస్తుంది. ఈ మాటలు కృత్రిమ మేథకు కూడా వర్తిస్తాయి. 21వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాలు రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతూ విస్తరిస్తున్నాయి.

చాలా కాలంగా కృత్రిమ మేధ మీద జరుగుతున్న పరిశోధనలు ఫలించి గత కొన్నేళ్లుగా వాటి సేవలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. మనుషులు చేసే పనులను యంత్రాలు స్వతంత్రంగా చేసేలా తీర్చిదిద్దడమే ఆర్టిఫిషియల్ ఇంటలిజెక్స్.. ఇప్పుడు కంప్యూటర్లే మానవుల్లా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని పొందాయి.

యంత్రాలే అన్ని పనులూ చేయడంతో మానవ వనరులకు ముప్పు వచ్చిపడింది. ఏఐ కారణంగా ఇప్పటికే ఐటీ, కస్టమర్ సర్వీస్, కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ వంటి రంగాలలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఎన్నో ఐటీ కంపనీలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించడం కలకలం రేపుతోంది.

కొంత కాలంగా అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేథ వినియోగం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. శర వేగంగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ దూసుకొస్తున్న ఈ సాంకేతికత ఇప్పుడు తనను తానే స్వయంగా అప్‌గ్రేడ్ చేసుకుంటూ మనుషుల కంటే తెలివిగా ఆలోచిస్తోంది.

దీంతో ఇంతకాలం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను అభివృద్ధి చేస్తూ వచ్చిన పరిశోధకులే ఆందోళనలో పడ్డారు. కృత్రిమ మేధ మనుషుల కంటే తెలివైనదిగా శరవేగంగా మారుతోంది. అది మనుషులకు హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవచ్చు ఒకసారి అది మానవ నియంత్రణ దాటిపోతే, టర్మినేటర్ సినిమాలోలాగా యంత్రాలు మనుషులపై అధికారం చెలాయించే చీకటి రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

యుద్ధాల్లో మనుషుల ప్రమేయం లేకుండా లక్ష్యాలను ఎంచుకుని దాడి చేసే డ్రోన్లు, రోబోలను అభివృద్ధి చేయడం వల్ల భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. క్షిపణుల తయారీ, జీవ ఆయుధాలు, సైబర్‌ దాడులు వంటి రహస్యాలన్నీ ఉగ్రసంస్థలు, హ్యాకర్‌ల చేతికొచ్చే ప్రమాదముంది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇదే వేగంతో దూసుకుపోతే పూర్తిగా వ్యవస్థలను తన అధీనంలోకి తెచ్చుకునే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తవుతున్నాయి. భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఏఐ వ్యవస్థలు సిస్టమ్‌లను హ్యాక్‌ చేసే స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రముఖ ఏఐ పరిశోధకుడు జాకబ్ కోక్సన్ హెచ్చరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ పరిశోధనా సంస్థలైన ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐలలో మోడల్స్ శిక్షణపై పనిచేసిన ఆయన, ఇటీవల మానవాళికి పొంచి ఉన్న ముప్పులపై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రముఖ ఏఐ సంస్థలు అత్యంత అధునాతన ఏఐ మోడల్‌ను రూపొందించే క్రమంలో భద్రతా నియమాలను పక్కనబెట్టి తీవ్రమైన పోటీ పడుతున్నాయని, ఈ రేసు మానవాళి జీవితాలతో జూదం ఆడటమేనని కోక్సన్ ఆరోపించారు.

ఇవి మనుషుల నియంత్రణ దాటిపోతే ఆపడం ఎవరితరం కాదని హెచ్చరించారు. ఏఐను నియంత్రించపోతే అది మనందర్నీ చంపేస్తుందని భయపెట్టేశారు జాకబ్ కోక్సన్.

కృత్రిమ మేథతో పొంచి ఉన్న ప్రమాదాలపై తాజాగా ప్రముఖ ఏఐ దిగ్గజ సంస్థ ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో ఆమోడెయ్‌ హెచ్చరికలు చేశారు. ఏఐ మోడల్స్ సామర్థ్యాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని, ఇదే సమయంలో వాటిని నియంత్రించే భద్రతా వ్యవస్థలు మాత్రం అభివృద్ధి చెందట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అమితమైన వేగంతో శక్తిసామర్థ్యాలను పెంచుకుంటున్న ఏఐని ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలోగా మానవాళిని హరించేస్తుందదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఏఐ నిపుణులు, ప్రభుత్వాలు, పౌరసమాజం మేల్కొని ఏఐకు బ్రేక్స్ వేయాలి. భద్రతా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు కృషిచేయాలి అని అప్రమత్తం చేశారు.

ఇది ఏమాత్రం నియంత్రణ లేకుండా కొనసాగితే వాటిని అర్థం చేసుకోవడం, నియంత్రించడం మానవులకు కష్టంగా మారొచ్చని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించి 'వి మస్ట్ పేస్ ది ఫ్రంటియర్' పేరుతో రాసిన బ్లాగ్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

డారియో అభిప్రాయంతో ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దిగ్గజ సంస్థల అధినేతలు కూడా ఏకీభవిస్తున్నాయి. ఏఐ మన చేతి దాటిపోతే అదుపుచేయడం చాలా కష్టం కష్టమన్నారు ఓపెన్‌ ఏఐ చీఫ్‌ శామ్‌ ఆల్ట్‌మన్. ఏఐ వ్యవస్థలపై మనుషులు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వాటిని అదుపులో ఉంచే భద్రతా చర్యలు అంతే వేగంగా పెరగకపోతే భవిష్యత్తు చేజారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మానవ నాగరికత మనుగడకే అత్యంత ప్రాథమిక ముప్పు ఉందని హెచ్చరించారు స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్ మస్క్. ఇది కార్లు, రాకెట్లు, అణుబాంబుల కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన సాంకేతికతగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏఐతో మానవాళి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం సుమారు 20 శాతం వరకు ఉందని మస్క్ అంచనా వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపాయి.

కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పొంచి ఉన్న ముప్పును చాలా తేలికగా తీసుకుంటున్నారు. మరిన్ని ప్రభుత్వ నియంత్రణలు అవసరమన్న డిమాండ్‌ను పెద్దగా పట్టించుకోలేదు.

పైగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వేగాన్ని తగ్గించాలని కోరుతున్న నిపుణులను, టెక్ కంపెనీల సీఈఓలను ప్రతికూల శక్తులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు ఎప్పటికీ జరగని విషయాలను ఊహించుకుంటూ ఏఐ వృద్ధినే అడ్డుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. నా దృష్టిలో సమాజంలో కొన్ని ప్రతికూల శక్తులు ఉన్నాయి. తీసుకురాకూడని అంశాలను వారు అనవసరంగా తెరపైకి తీసుకొస్తున్నారు.

ఎప్పటికీ సంభవించని ఊహాజనిత ప్రమాదాల గురించి మాట్లాడటం సరికాదు' అని స్పష్టం చేశారు. ఏఐ పురోగతికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఐ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలను కొట్టిపారేస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు.

కాగా అమెరికా అధ్యక్షుని ఆలోచనలో ఉన్న కోణం వేరని చెప్పవచ్చు. చైనా ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో శక్తిమంతమైన మోడళ్లను రూపొందించే సామర్థ్యాన్ని చైనా కంపెనీలు చూపిస్తున్నాయి. చైనాను ఏఐ రంగంలో వెనక్కి నెట్టడం అమెరికాకు ఎంతో ముఖ్యమని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు.

ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైబర్‌ భద్రత, పరిశ్రమలు, అంతర్జాతీయ ప్రభావం.. ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అమెరికా కంపెనీలు వేగం తగ్గిస్తే.. చైనా సంస్థలు అదే సమయంలో వేగంగా ముందుకు సాగితే భవిష్యత్తులో వ్యూహాత్మక ఆధిపత్యం మారే అవకాశం ఉందన్నది ఆయన భయం.

అందుకే ఏఐపై కఠినమైన నియంత్రణలు విధించే ఆలోచనను ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆగితే చైనా ఆగదు అన్నదే ఆయన వాదన. అయితే, ఏఐ వ్యవస్థలు అదుపు తప్పకుండా ఉండేందుకు తన పర్యవేక్షణ సరిపోతుందని ట్రంప్‌ చెబుతున్నారు.

కాగా అమెరికాకు ప్రపంచస్థాయి సంస్థలు, భారీ ప్రైవేట్‌ పెట్టుబడులు, అధునాతన చిప్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కొంత నెమ్మదిస్తే చైనా వెంటనే అమెరికాను దాటేస్తుంది అనడం సరికాదు. కానీ ఏఐ రేసులో వేగం పూర్తిగా కోల్పోతే.. ప్రత్యర్థి దేశాలకు ఆ అవకాశాన్ని ఇవ్వొచ్చన్న ట్రంప్‌ ఆందోళన మాత్రం పూర్తిగా కొట్టి పారేయలేం. కాగా డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై వైట్‌హౌస్‌లోని కొందరు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మాత్రం ఏఐ సంస్థలే ప్రభుత్వాన్ని నియంత్రణలు విధించాలని కోరడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కొత్త నిబంధనల పేరుతో కంపెనీలు తమకు అనుకూలమైన ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయా అనే సందేహం ఉందన్నారు. అయితే ఏఐలో ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా ఉన్నాయని అంగీకరించిన వాన్స్‌ వాటిని దృష్టిలో పెట్టుకుని తగిన భద్రతా చర్యలపై ప్రభుత్వం, కాంగ్రెస్‌ కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్