Off The Record: ఆలూరు టీడీపీలో తారాస్థాయికి వర్గపోరు

Off The Record: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు ఎందుకు పెరుగుతోంది? వైకుంఠం జ్యోతి ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2026 6:37 AM IST
Off The Record
X

Off The Record: ఆలూరు టీడీపీలో తారాస్థాయికి వర్గపోరు

Off The Record: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో మొదటి నియోజకవర్గం. ఆలూరు అనగానే గుమ్మనూరు కుటుంబం, కోట్ల, గౌడ్, వైకుంఠం ఈ కుటుంబాలే గుర్తుకు వస్తాయి. అయితే నియోజకవర్గం అభివృద్ధిపై మాత్రం ఏ ఒక్క నేత కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదనే చెప్పవచ్చు. అధికారంలో ఉన్నన్నాళ్లు సొంత ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప.. స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేదు. ఆలూరులో ఆలూరుతోపాటు దేవనకొండ, ఆస్పరి, హోళగుంద, చిప్పగిరి, హాలహర్వి మండలాలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి రెండుసార్లు మినహా టీడీపీ అభ్యర్థి విజయం సాధించలేదు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు.

దీనికి ముఖ్య కారణం లేకపోలేదు. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలు, విబేధాలేనన్నది రాజకీయ విశ్లేషకుల టాక్. మొన్నటి 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్‌పై వైసీపీ అభ్యర్థి విరూపాక్షి విజయం సాధించారు. నేతల మధ్య సమన్వయ లోపం, వర్గపోరు కారణంగానే ఓటమి పాలైనట్టు పార్టీ అంతర్గత సమావేశంలో నేతలు బహిరంగంగానే మాట్లాడారు. దీంతో వీరభద్ర గౌడ్‌ను ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి మాజీ ఇన్‌చార్జి వైకుంఠం శివ ప్రసాద్ సతీమణి వైకుంఠం జ్యోతిని ఆలూరు ఇన్‌ఛార్జిగా టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు.

ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల కోసం 24 ఎన్నికలకు ముందు వైకుంఠం జ్యోతి, భర్త శివప్రసాద్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా తమకు ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇప్పించాలని కోరారు. వీరభద్ర గౌడ్ ఓడిపోయాక వైకుంఠం జ్యోతికి సువర్ణ అవకాశం దొరికింది. వైకుంఠం జ్యోతి ఇన్‌చార్జిగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మొదటి నుంచీ పార్టీకి పనిచేసిన వారిని పక్కన పెడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత ఇన్‌‌ఛార్జి వీరభద్ర గౌడ్ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. దేవనకొండ మండలానికి చెందిన కప్పట్రాల బొజ్జమ్మ, వైకుంఠం జ్యోతి ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేవారు. వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న బొజ్జమ్మను ముందు పెట్టి వైకుంఠం జ్యోతి రాజకీయాలు చేసేవారు. అయితే నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నాక నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోయాయి.

మొదటి నుంచీ కలసి ఉన్న కప్పట్రాళ్ళ బొజ్జమ్మ, ఆమె వర్గాన్ని జ్యోతి పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కప్పట్రాళ్ళ బొజ్జమ్మ ఏపీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మెన్‌గా ఉన్నారు. అయితే పార్టీ కార్యక్రమాలకు గాని, ప్రభుత్వ కార్యక్రమాలకు గానీ ఎలాంటి ఆహ్వానాలు పంపడం లేదని తెలుస్తోంది. అంతేకాక బొజ్జమ్మ సొంత మండలం, ఆమె పంచాయతీలో కూడా ఆమె తెలియకుండా వేరే వాళ్లకు పట్టం కట్టి అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా వేరే వాళ్ళకే కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఇలా ప్రతి విషయంలో తమ వర్గానికి కాకుండా పక్క వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆమె వర్గీయులు ఆరోపించడమే కాకుండా జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. జ్యోతి ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. తమను పూర్తిగా దూరం పెట్టినట్టు పార్టీ నేతలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

అలాగే ఆస్పరి, ఆలూరు, హోళగుంద, చిప్పగిరి, హాలహర్వి మండలాలలో కూడా కోట్ల, గుమ్మనూరు, వీరభద్ర గౌడ్ వర్గాలకు చెందిన పార్టీ నేతలను పక్కన పెట్టి తమ సొంత వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయా మండలాల నేతలు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఇప్పటికే గుమ్మనూరు జయరాం సోదరులు గుంతకల్లుకు పరిమితం కాగా వారి బంధువు గుమ్మనూరు నారాయణ టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. మరికొందరు అటు ఇటు పోలేక మద్యలో సమయం కోసం వేచి చూస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని వైకుంఠం కుటుంబం చేజేతులా జారవిడుచుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అందరినీ కలుపుకొని పోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించినట్టు టాక్.

ఆలూరు టీడీపీలో మొదటి నుంచీ వర్గపోరు తారాస్థాయిలో ఉందనేది బహిరంగ రహస్యమే. విభేదాలు పక్కన పెట్టి అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన నేతలు తమ ఆధిపత్యం కోసం సొంత పార్టీ నేతలను దూరం పెడ్తున్నారట. అంతేకాక నియోజకవర్గ వర్గ అభివృద్ధి వదిలేసి వర్గ రాజకీయాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ 40 ఏళ్లుగా విజయానికి నోచుకోలేదట. అందివచ్చిన అవకాశాన్ని వైకుంఠం జ్యోతి పాత పద్ధతిలో సొంత పార్టీ నేతలను నాయకులను పక్కన పెడుతున్నారట. అయితే నారా లోకేష్ మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇస్తామని భరోసా ఇచ్చిన నేపథ్యంలో.. వైకుంఠం జ్యోతి.. నియోజకవర్గంపై పట్టు సాధించి, సొంత పార్టీ నాయకులను ఆదరిస్తే మంచిదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలా.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో గాని.. 2029 ఎన్నికల్లో గానీ విజయం సాధించాలంటే అందరినీ కలుపుకొని వెళ్తే వైకుంఠం జ్యోతికి తిరుగుఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. మరి రానున్న రోజుల్లో వైకుంఠం జ్యోతి ఏ విధమైన రాజకీయం చేస్తారో చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story