Burning Topic: శివయ్య భక్తులకు నిరాశ మిగిల్చిన వాతావరణ మార్పు
Burning Topic: అమరనాథ్ యాత్రలో ఊహించని పరిణామం ఎదురైంది.
Burning Topic: శివయ్య భక్తులకు నిరాశ మిగిల్చిన వాతావరణ మార్పు
Burning Topic: గ్లోబల్ వార్మింగ్ ప్రభావం చివరకు పవిత్ర క్షేత్రం అమరనాథ్ గుహపై కూడా పడింది. యాత్ర ప్రారంభమైన ఐదు రోజులకే మంచు శివలింగం కరిగిపోవడం భక్తులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. తగినంత మంచు ఏర్పడకపోవడం, పెరిగిన ఉష్ణోగ్రతలు కారణమని అంచనా వేస్తున్నారు.
ఈసారి మంచు లింగం త్వరగా కరిగిపోయినా ఈ పవిత్ర స్థలం పట్ల భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసం, భక్తి ఏమాత్రం తగ్గలేదు. యాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచే భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది.. అమర్‌నాథ్ యాత్రా మార్గాలైన పహల్గామ్, బాల్తాల్ ప్రాంతాలు భంభం భలో నినాదాలతో మారుమోగుతున్నాయి.
జమ్మూ కశ్మీర మంచు కొండల్లో వెలిసిన అమరనాథుని పవిత్ర యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు లక్షా 60 వేల మందికి పైగా భక్తులు పవిత్ర గుహలోని స్వామివారిని దర్శించుకున్నారు. యాత్ర ప్రారంభమైన మొదటి 4 రోజుల్లోనే దాదాపు 86,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈ ఏడాది దర్శనాల కోసం ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే 4 లక్షల మందికి పైగా భక్తులు రిజిస్టర్ చేసుకోగా, ఆఫ్-లైన్ కౌంటర్ల ద్వారా కూడా ప్రతిరోజూ వేలాది మంది టోకెన్లు పొంది యాత్రకు బయలుదేరుతున్నారు. భం భం భోలే, హర హర మహాదేవ్ స్మరణలతో అమర్‌నాథ్ యాత్రా మార్గాలైన పహల్గామ్, బాల్తాల్ ప్రాంతాలు మారుమోగుతున్నాయి.
కాగా అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లోనే భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పవిత్ర అమర్‌నాథ్ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగం కేవలం ఐదు రోజుల్లోనే పూర్తిగా కరిగిపోయింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. హిమగిరుల్లో నిరంతరం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రభావం ఈసారి అమర్‌నాథ్ మంచు లింగంపై తీవ్రంగా పడిందని అంచనా వేస్తున్నారు.
దీనికి తోడు, యాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచే భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడం, వారి నుంచి వెలువడే వేడి కారణంగా మంచు లింగం చాలా త్వరగా కరిగిపోయిందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో 2018, 2020, 2022 సంవత్సరాల్లోనూ మంచు లింగం త్వరగా కరిగినప్పటికీ.. ఈసారి కేవలం ఐదు రోజుల్లోనే కరిగిపోవడం పర్యావరణ విపత్తుకు అద్దం పడుతోంది.
మంచు లింగం తర్వగా కరగడంతో ఈసారి యాత్ర త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే వేల మంది భక్తులు అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ఉన్నారు. బాబా బర్ఫానీగా పిలిచే మంచు రూపం లేకపోయినా పవిత్ర గుహను దర్శించుకునేందుకు వేలాది మంది తరలి వస్తున్నారు.. శివలింగం పూర్తిగా కరిగిపోయేలోగా అమరనాథుడిని దర్శించుకోవాలని వారంతా కోరుకుంటున్నారు.
గుహ లోపలికి వెళ్ళే నీరు గడ్డ కట్టే పరిస్థితులు లేకపోవడంతో మంచు లింగం స్థానం లో ప్రస్తుతం త్రిశూల వేదిక మాత్రమే ఉంది...మంచు లింగం కరిగిపోయినప్పటికీ, ఆ పవిత్ర స్థలం పట్ల భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసాలు ఏమాత్రం తగ్గలేదు. మంచు లింగం కరిగిపోయిన నేపథ్యంలో, యాత్రికులకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం అందిస్తూ, అమర్‌నాథ్ శ్రైన్ బోర్డ్ భద్రతా దళాలు బేస్ క్యాంపుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
అమర్‌నాథ్ యాత్ర కోసం భక్తులు భారీ ఎత్తున కాశ్మీర్ చేరుకుంటున్నారు. నిజానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిని మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. కానీ కొందరు రిజిస్ట్రేషన్ లేకుండానే యాత్రకు వస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద భారీ క్యూ కనబడుతోంది. వారు అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు, తర్వాత ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డులు తీసుకునేందుకు కూడా ఎక్కువ సమయం పడుతోంది.
రద్దీ అనూహ్య స్థాయిలో పెరగడం వల్ల రవాణా, భద్రత, పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని అమర్‌నాథ్ యాత్ర బోర్డు వివరించింది. భక్తులకు అమర్‌నాథ్ యాత్ర బోర్డు అనేక సూచనలు చేస్తోంది. భక్తులు తమ వంతు వచ్చే వరకు సహనంతో ఉండాలని జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం భక్తులను అనుమతిస్తారని, ఎక్కువ మంది భక్తులను అనుమతించబోరని ఆయన అన్నారు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీనగర్‌కు ఈశాన్యంగా సుమారు 145 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 4,000 మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ గుహ ఉంది. సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తునున్న ఈ గుహల్లో శివలింగం 12 అడుగుల ఎత్తు వరకూ సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది. ఇక్కడ శివలింగం ఏటా సహజంగా ఎలా ఏర్పడుతుందే ఆసక్తి సహజం. కోట్లాది మంది భక్తులకు అది పరమశివుడి దివ్య స్వరూపం. అమర్‌నాథ్ గుహ పరమశివుడు పార్వతీదేవికి సృష్టి రహస్యం, అమరత్వ రహస్యాన్ని వివరించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి.
ఈ విశ్వాసమే దీన్ని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా నిలబెట్టింది. అయితే, శాస్త్రం ఈ మంచు శివలింగం ఎలా ఏర్పడుతుందో మాత్రమే వివరిస్తుందని, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఏమాత్రం తగ్గించదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అమర్‌నాథ్‌లో ప్రకృతి, విశ్వాసం కలిసే అద్భుత దృశ్యమిదేనని పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తలు ఈ ఆధ్యాత్మిక అద్భుతం వెనుక ఆసక్తికరమైన భౌగోళిక ప్రక్రియ ఉందని చెబుతున్నారు.
అమర్‌నాథ్ గుహపై ఉన్న సున్నపురాయి, జిప్సం శిలల పగుళ్ల ద్వారా హిమనదాలు, మంచు కరిగిన నీరు నెమ్మదిగా గుహలోకి చేరుతుంది. లోపల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా ఆ నీరు ఒక్కో పొరగా గడ్డకడుతుంది. ఇలా పొరపై పొర ఏర్పడుతూ పైకి ఎదిగే మంచు స్తంభమే భక్తులు దర్శించే మంచు శివలింగం. పౌర్ణమి వరకు మంచు శివలింగం క్రమంగా పెరిగి,
తర్వాత అమావాస్య వచ్చేకొద్దీ చిన్నదవుతుందనే విశ్వాసం ఉంది. హిమాలయాల్లో హిమనీ నదాలు, సహజంగా ఏర్పడే మంచు కొండలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఎప్పటి నుంచో పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణం, మారుతున్న గాలుల సరళి, గుహల్లోని వాతావరణ మార్పులవంటివి మంచు త్వరగా కరగడానికి కారణమవుతున్నాయి.




