Off The Record: గుంటూరు వైసీపీలో అంబటి బ్రదర్స్ హవా.. కూటమిపై అన్నదమ్ముల సమరశంఖం!
Off The Record: గుంటూరు జిల్లా వైసీపీలో అంబటి సోదరులు కీలకంగా మారారు. జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, పొన్నూరు ఇన్‌ఛార్జ్‌గా అంబటి మురళి ప్రజా పోరాటాలతో కేడర్‌లో జోష్ నింపుతున్నారు.
Off The Record: గుంటూరు వైసీపీలో అంబటి బ్రదర్స్ హవా.. కూటమిపై అన్నదమ్ముల సమరశంఖం!
Off The Record: వైసీపీ హాట్ లీడర్ల జాబితాలో అంబటి రాంబాబు టాప్‌లో ఉంటారంటే అతిశయెక్తి కాదేమో. ఇప్పుడు ఆ అంబటి సోదరులు ఉమ్మడి జిల్లాకే పరిమితం కాలేదు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ పరిచయం ఉన్న పేరు. ఇప్పుడు రాంబాబుకు ఆయన సోదరుడు మురళి కూడా జత అయ్యారన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. వివాదాలకు మారుపేరుగా నిలిచిన అంబటి రాంబాబులో కొద్ది రోజుల క్రితం చోటుచేసుకున్న పరిణామాలతో మార్పు కనిపిస్తోందట. రాంబాబులో మరింత కసి పెరిగిందట. అధికార కూటమిపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. విపక్ష వైసీపీ కేడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. తన సోదరుడు మురళితో కలిసి జిల్లాలో దూసుకుపోతున్నారు అంబటి రాంబాబు. అధికార పార్టీని ఇరుకున పెడుతూ స్వపక్షాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తున్నారట. అంబటి సోదరులు ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా మారారన్న చర్చ జోరందుకుంది. వైసీపీ హయాంలో అంబటి మంత్రిగానూ పని చేశారు. గత ఎన్నికల్లో అంబటి రాంబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2024 ఎన్నికల తరువాత మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో అంబటి బాధ్యతల్లో మార్పులు చేశారు. ఆయన్ను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇంఛార్జీగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో గుంటూరు జిల్లాలో పార్టీని అంబటి రాంబాబు ముందుండి నడిపిస్తున్నారు. వైసీపీ అధిష్టానం పిలుపిచ్చే అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూనే అధికార పార్టీపై పోరాటం చేస్తున్నారు అంబటి బ్రదర్స్. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబును దూషించారంటూ అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటన తరువాత అంబటి కసిగా పని చేయటం మొదలు పెట్టారట. అంబటి రాంబాబుకు పరామర్శ పేరుతో నెలరోజులపాటు ఆయన ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచీ ముఖ్య నేతలంతా రాంబాబు ఇంటికి క్యూ కట్టారు.
తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఒకరోజు దీక్ష కూడా చేశారు. వైసీపీ కార్యకర్తలతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు కూడా దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. దీంతో గుంటూరు జిల్లా వైసీపీ కేడర్‌లో ఒక్కసారిగా జోష్ పెరిగిందట. ఒకవైపు అన్న రాంబాబు పోరాటం చేస్తుంటే తమ్ముడు మురళి మరోవైపు అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో ఢీ అంటే ఢీ అంటున్నారు. గత ఎన్నికల్లో చివరి క్షణంలో పొన్నూరు టికెట్ దక్కించుకున్న అంబటి మురళి.. ధూళిపాళ్ల చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అంబటి మురళి నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల.. ఆరోపణలు చేసి ఆయనను ఇబ్బంది పెట్టారట. ఆనాటి నుంచి మురళి వర్సెస్ నరేంద్ర మధ్య పోరు కొనసాగుతోంది.
గత వర్షాకాలంలో భారీ వర్షాలకు గుంటూరు ఛానల్ పొంగిపొర్లింది. దీంతో పొన్నూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అనేక పంట పొలాలు మునిగిపోయాయి. దీనిపై అంబటి మురళి ప్రత్యేక్ష పోరు సాగించారు. ఆ తర్వాత ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ మురళి పోరుబాట పట్టారు. నరేంద్ర... సంగం డెయిరీ కోసం రైతుల వద్ద నుంచి మద్దతు ధర కంటే తక్కువకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాక ఏకంగా కలెక్టరేట్ ఎదుట ఒకరోజు దీక్షకు దిగారు. పొన్నూరుతోపాటు జిల్లా పార్టీ ముఖ్య నేతలంతా ఈ దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఇలా అన్నదమ్ములిద్దరూ ఒక వారం రోజుల వ్యవధిలో కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేసి వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. వీరిని చూసిన మిగిలిన నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా పోరాటాలకు సిద్దమవుతున్నారు.
గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల్లో జూనియర్ నేతలే ఇంఛార్జులుగా కొనసాగుతున్నారు. ఇక తెనాలి, మంగళగిరిలో సీనియర్ నేతలున్నా అంత దూకుడుగా ముందుకెళ్లలేకపోతున్నారన్న టాక్ లేకపోలేదు. ఇక గుంటూరు వెస్ట్, పొన్నూరు ఇంఛార్జీలుగా ఉన్న అంబటి సోదరులే ప్రత్యేక కార్యక్రమాలతో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇది ఓ రకంగా 2029 ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఈ బ్రదర్స్ రాజకీయ పోరాటం ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.




