Off The Record: అమిత్ షా మాస్టర్ ప్లాన్?

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు! రేవంత్ రెడ్డి సర్కార్‌ను టార్గెట్ చేస్తూ అమిత్ షా, నరేంద్ర మోడీ అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Jun 2026 6:56 AM IST
Off The Record
X

Off The Record: అమిత్ షా మాస్టర్ ప్లాన్?

Off The Record: తెలంగాణలో కమలం వికసించాలంటే.. కేవలం సభలు, ప్రసంగాలతో సరిపోదని బీజేపీ అధిష్టానం ఫిక్స్ అయిపోయిందట. అందుకే ఈసారి నేరుగా సంస్థాగత బలోపేతంపై ఫోకస్ పెట్టింది. "పంట పండాలంటే విత్తనం బలంగా ఉండాలి" అన్నట్టుగా.. పార్టీ మూలాలను బలపరచడంపైనే జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. మూడు రాష్ట్రాల విజయాలు, హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న కమలనాథులు... ఇప్పుడు గ్రౌండ్ లెవల్‌లో పార్టీని మరింత పటిష్టం చేసే పనిలో పడ్డారట. ఈ బాధ్యతను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్వయంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఛత్తీస్‌గఢ్‌లో పార్టీని విజయపథంలో నడిపించిన నబీన్... ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఫార్ములా అమలు చేస్తున్నారట. నేతల మధ్య సమన్వయం లోపం, జిల్లాల్లో మొక్కుబడి కార్యకలాపాలు, నేతల మధ్య వర్గపోరాటాలు.. ఇవే తెలంగాణ బీజేపీకి ప్రధాన అడ్డంకులని గుర్తించిన అధిష్టానం.. ఇప్పుడు నేతల స్టడీ వీక్లీ రిపోర్ట్ పేరుతో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అమలు చేస్తోందట. ఇక ఎవరు ఏ జిల్లాకు వెళ్లారు..? ఎంతమంది కార్యకర్తలను కలిశారు..? కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు..? అనే నివేదికలు నేరుగా ఢిల్లీకి చేరుతున్నాయట. హైదరాబాద్‌కే పరిమితమయ్యే నేతలకు ఇకపై అవకాశాలు తగ్గవచ్చన్న సంకేతాలు కూడా వెళ్లినట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని 38 సంస్థాగత జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ స్వయంగా పర్యవేక్షించడంతో కేడర్‌కు కొత్త ఉత్సాహం వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక యుద్ధ కదనరంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందన్న భావనలో పార్టీ అధిష్టానం కనిపిస్తోంది.

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను రాజకీయ అవకాశంగా మలుచుకోవాలని బీజేపీ సీక్రెట్ ప్లాన్ రచిస్తోందట. హామీల అమలులో జాప్యం ఒకవైపు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరోవైపు.. దీంతో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని తమవైపు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు తెలంగాణపై ఢిల్లీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన, మరో మూడు నెలలకు అమిత్ షా... ఇంకో మూడు నెలలకు నితిన్ నబీన్... ఇలా ఏడాది పొడవునా జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కనిపించేలా ప్లాన్ సిద్ధమైందంటూ చర్చ నడుస్తోంది. దీనికితోడు ప్రతి నెలా ఒక జాతీయ నేత లేదా కేంద్ర మంత్రి తెలంగాణలో పర్యటించేలా కార్యాచరణ రూపొందించారట. "ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి" అన్నట్టుగా.. రాజకీయ వేడి ఉన్నప్పుడే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఆ అసంతృప్తిని రాజకీయంగా మలచుకోవడం.. మరోవైపు కేంద్ర పథకాల ప్రయోజనాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం.. ఈ రెండు లక్ష్యాలతో కమలనాథులు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అమిత్ షా అమలు చేసిన బూత్ మేనేజ్‌మెంట్ వ్యూహం ఫలించినట్లు పార్టీ అంచనా వేస్తోంది. అందుకే ఇప్పుడు "బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం" అనే ఫార్ములాతో మైక్రో మేనేజ్‌మెంట్‌కు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు అగ్రనేతలు క్యూ కట్టారు. ఇటీవల రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ టూర్‌లో అధికారిక కార్యక్రమాలతోపాటు మేథావులతో సమావేశం, అలాగే కేంద్రమంత్రి సతీష్ చంద్ర దూబే పర్యటించారు. త్వరలో నితిన్ నబీన్ మూడు రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారట‌.. ఈ బీజేపీ హైకమాండ్ స్కెచ్ మొత్తం ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందట.

అయితే అసలు రాజకీయ పోరు ఇప్పుడు మొదలుకానుందట. త్వరలో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేవలం తీర్మానాలే కాదు..‌ భవిష్యత్ ఎన్నికల బ్లూప్రింట్ సిద్ధం కాబోతోందని సమాచారం. ఇక గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా 48 సీట్లు గెలిచి సంచలనం సృష్టించిన బీజేపీ... ఈసారి మరింత బలంగా పోరడాలని డిసైడ్ అయ్యిందట. ప్రధానంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్ పోరుగా గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పొరేషన్ల మేయర్ పీఠాలపై గురిపెట్టిందట. అలాగే వరంగల్, ఖమ్మం, రామగుండం కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అయితే పార్టీకి సవాళ్లు కూడా తక్కువగా లేవు. కొత్త, పాత నేతల మధ్య అంతర్గత విభేదాలు, ఈటలపై ప్లెక్సీ ఎపిసోడ్ తర్వాత బయటపడిన అసంతృప్తి.. ఇవన్నీ అధిష్టానం ముందున్న ప్రశ్నలుగా మారాయట. ముందుగా అంతర్గత విభేదాలను చక్కదిద్ది.. ఆ తర్వాతే ప్రజాక్షేత్రంలో దూకాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ బలహీనపడిన చోట.. బలంగా నిలబడి.. ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా.. తమవైపు తిప్పుకొని.. ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదగాలనే దానిపైనా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఢిల్లీ పెద్దల వరుస పర్యటనలు, బెంగాల్ తరహా హైవోల్టేజ్ పోరు, సంస్థాగత వ్యూహాలు, క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేస్తూ ప్రత్యేక సీక్రెట్ ఆపరేషన్ ఫలిస్తుందా..? లేదా..? ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ గీసిన పాచికలు పారుతాయా..? లేక కేవలం హైప్‌ క్రియేట్ చేయడానికే పరిమితం అవుతాయా..? కాషాయ ఆపరేషన్ నిజంగానే తెలంగాణ రాజకీయాల దిశను మార్చేస్తుందా..? అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌లను వెనక్కి నెట్టేసి బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ నిలబడుతుందా..? గ్రేటర్ ఎన్నికల ముందు అగ్రనేతల టూర్లతో బీజేపీకి ఏ మేరకు లాభం చేకూరుతుందోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story