OFF THE RECORD: ఒక్క టూర్ తో బీజేపీలో జోష్ తెచ్చిన అమిత్ షా!

OFF THE RECORD: హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం, మెగాస్టార్ చిరంజీవితో భేటీ, రేవంత్ సర్కార్‌పై ఆర్ఆర్ ట్యాక్స్ ఆరోపణలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Nov 2026 8:24 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: ఒక్క టూర్ తో బీజేపీలో జోష్ తెచ్చిన అమిత్ షా!

OFF THE RECORD: హైదరాబాద్‌కు వస్తే అమిత్ షా పర్యటనలో రాజకీయ లెక్కలు పక్కాగా ఉంటాయన్న టాక్ ఉంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్, నితిన్‌లతో భేటీ అయిన షా.. ఈసారి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లను కలిశారు. రాజకీయాల్లో ఒక అడుగు వేస్తే.. దాని వెనుక పది లెక్కలుంటాయన్నట్టుగా సాగిందట షా టూర్. ఇక ఓల్డ్ సిటీలో సెంటిమెంట్‌గా భావించే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఓవైపు హిందుత్వ సెంటిమెంట్.. మరోవైపు మెగా గ్లామర్.. ఇంకోవైపు గ్రేటర్ రాజకీయాలపై గురితోపాటు 2028 అసెంబ్లీ పీఠమే లక్ష్యంగా మిషన్ తెలంగాణ షురూ చేశారా..? అన్న టాక్. ఇదంతా ఎన్నికల ముందు వేసిన పక్కా పొలిటికల్ స్కెచ్చా..? ఒవైసీ కంచుకోటలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవడంతో అక్కడ కమలం పాగా వేయాలనే అసలు లెక్క వేశారట. దీంతో రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీ రాజకీయాలే కొత్త అస్త్రంగా మారబోతున్నాయా..? అంటూ షా పాదయాత్ర రాజకీయ సంకేతాలు వెతుక్కుంటున్నాయట ప్రత్యర్థి పార్టీలు.

మహా పాదయాత్రలో అసలు రాజకీయ రచ్చ మొదలైందట. SIR ప్రక్రియపై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా లోక్ తంత్ర బచావో -అరాచకత్వ హటావో పేరుతో బీజేపీ పాదయాత్రలకు పిలుపు ఇచ్చింది. అందులో భాగంగానే హైదరాబాద్ లో మహా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా తిప్పికొట్టారు. ఓటు బచావో పేరుతో కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలు ఫ్లాప్ షో అంటూ సెటైర్లు వేశారు. ఓటర్ల జాబితాలో అక్రమ ఓట్లు, చొరబాటుదారులు, మరణించిన వారి పేర్లు తొలగిస్తుంటే కాంగ్రెస్‌కు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. ఓటు చోరీ జరిగితే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కేరళలో కాంగ్రెస్ ఎలా గెలిచిందంటూ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఇక తెలంగాణ రాజకీయాలపై కూడా షా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో RR ట్యాక్స్ నడుస్తోందని, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? అంటూ సూటిగా ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్‌ను కార్నర్ చేసిన అమిత్ షా.. తెలంగాణలో కమలం వికసిస్తుందంటూ ఎన్నికల సమరానికి సై అన్నారు.

తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన అమిత్ షాకు బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. రామచందర్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. ఇలా ముఖ్య నేతలంతా ఒకే వేదికపై కనిపించారు. మొన్నటిదాకా కొత్తోళ్లు.. పాతోళ్లు అంటూ లోలోపల రగిలిన అసంతృప్తి.. ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఎవరికి వారే అన్న నేతలు.. అమిత్ షా రాకతో ఒక్కటయ్యారా..? లేక కెమెరాల ముందు కలిసినట్టు కనిపించి.. కెమెరాలు ఆగగానే మళ్లీ పాత కథేనా..? జాతీయ జెండా చేతపట్టి అమిత్ షా ముందుకు కదులుతుంటే నేతలంతా అడుగులో అడుగేశారు. కార్యకర్తల్లోనూ ఫుల్ జోష్ కనిపించింది. అయితే ఎన్నికల ముందు కలిసిన చేతులు.. ఎన్నికల తర్వాత కూడా కలిసే ఉంటాయా అన్నదే అసలు ప్రశ్న. గ్రేటర్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఈ ఐక్యత బీజేపీకి ఎంతవరకు బలమవుతుందో చూడాలి. ఎందుకంటే ఎన్నికల రాజకీయం అంటే మాటలు కాదు.. ఓట్ల దగ్గరే అసలు లెక్క తేలేది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అమిత్ షా హైదరాబాద్ పర్యటనను చూస్తే ఇది కేవలం ఒక పాదయాత్రకే పరిమితం కాలేదన్న చర్చ నడుస్తోందట. గ్రేటర్ ఎన్నికల నుంచి రాబోయే అసెంబ్లీ రాజకీయాల వరకు పార్టీకి దిశానిర్దేశం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నలు.. మరోవైపు MIM, BRS, కాంగ్రెస్ రాజకీయాలపై విమర్శలు.. ఇలా తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ షా గట్టిగానే సంకేతాలిచ్చారు. రాహుల్ గాంధీని ఓడించడానికి మోదీ అవసరం లేదని, తెలంగాణ బీజేవైఎం నేత చాలంటూ విసిరిన సవాల్ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే ప్రసంగాల్లో కనిపించిన వేడి.. ఓట్ల దగ్గర కూడా కనిపిస్తుందా..? పాదయాత్రలో కనిపించిన ఐక్యత.. ఎన్నికల వరకు నిలబడుతుందా..? అన్నదే ఇప్పుడు బీజేపీలో అసలు చర్చ జోరుగా సాగుతోందట.

మొత్తానికి షా వచ్చారు.. అడుగేశారు.. ప్రత్యర్థులపై అస్త్రాలు సంధించారు! కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైందా..? అన్నదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. కాంగ్రెస్‌పై షా విసిరిన సవాళ్లు.. రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెడతాయా..? ఇప్పటికైతే బీజేపీ శిబిరంలో జోష్ మామూలుగా లేదు. కానీ రాజకీయాల్లో జోష్ వేరు.. ఓట్ల లెక్క వేరు.. ఇక రాబోయే ఎన్నికల వేళా షా పాదయాత్ర జోష్.. బీజేపీకి ఏ మేరకు లాభం చేకూరుతుంది..? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్