Off The Record: నెల్లూరు రాజకీయాల్లో 'ఆనం' వారసురాలు: తండ్రి బాటలో కైవల్యా రెడ్డి.. మహానాడు వేదికగా ఎంట్రీకి ముహూర్తం!

Off The Record: నెల్లూరు రాజకీయ దిగ్గజం ఆనం రామనారాయణ రెడ్డి తన కుమార్తె కైవల్యా రెడ్డిని రాజకీయ వారసురాలిగా ప్రకటించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 May 2026 11:41 AM IST
Off The Record
X

Off The Record: నెల్లూరు రాజకీయాల్లో 'ఆనం' వారసురాలు: తండ్రి బాటలో కైవల్యా రెడ్డి.. మహానాడు వేదికగా ఎంట్రీకి ముహూర్తం!

Off The Record: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు.. మద్రాస్ రాష్ట్ర రాజకీయాల నుంచి నేటి వరకు నెల్లూరు జిల్లా రాజకీయ చిత్రపటంలో తనకంటూ ప్రత్యేక ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది ఆనం కుటుంబం. ఆనం చెంచు సుబ్బారెడ్డి మొదలు.. ప్రస్తుత రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వరకు రాజకీయంగా ఆ కుటుంబానిది సుదీర్ఘ ప్రస్థానం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆనం కుటుంబానిదే నెల్లూరు జిల్లాలో పైచేయి. అవును.. భవిష్యత్తు రాజకీయాలను ఊహించడం... అందుకు తగ్గ మార్గాలను అన్వేషించడంలో ఆనం కుటుంబానిది అందెవేసిన చెయ్యంటారు రాజకీయ కురువృద్ధులు.

ప్రస్తుతం.. అధికార టీడీపీలో ప్రముఖ నేతగా కొనసాగుతున్నారు ఆనం రామనారాయణరెడ్డి. ఈ క్రమంలో ఆయన రాజకీయ వారుసులు ఎవరన్న చర్చ రీసౌండ్ చేస్తోంది. రామనారాయణ అనంతరం రాజకీయ అరంగేట్రం ఎవరు చేస్తారన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంత్రి ఆనం.. తమ పూర్వీకులు, బంధువులు ఉన్న సంఘం మండలంలోని వెంగారెడ్డిపాలెం, పడమటి పాలెం, దువ్వూరు గ్రామాలకు వెళ్లారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న సమయంలో మంత్రి ఆనం.. స్థానికులతో చెప్పిన మాటలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయట. తన రాజకీయ వారసత్వంపై ఇప్పటి వరకు కొనసాగుతున్న ప్రచారానికి పరోక్షంగా తెరదించారు. తన కుమార్తె కైవల్యారెడ్డిని రాజకీయ వారసురాలిగా పరిచయం చేసేందుకు ఆనం.. సర్వం సన్నద్ధం చేస్తున్నారట. అంతేకాదూ.. కూతురు కైవల్యను ఆయా గ్రామస్తులకు పరిచయం కూడా చేశారు. తన వారసురాలి రాజకీయ భవిష్యత్తుకు సహకారించాలంటూ అక్కడి నాయకులను అభ్యర్థించారు. తనయుడు శుభకర్ ఉన్నప్పటికీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్న కైవల్యనే తన రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట ఆనం.

ఇటీవల టీడీపీలో యువతకు ప్రాధాన్యం పెరగడం.. నారా లోకేష్ జోష్ కూడా కొత్త తరంలో ఆశలు రేకెత్తుతున్నాయన్న చర్చ లేకపోలేదు. ఈ క్రమంలోనే యువనేత టీంలో కీలక భూమిక పోషించే విధంగా వారసురాలిని మంత్రి ఆనం రెడీ చేస్తున్నారట. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం.. పైగా తండ్రి పాలనా వ్యవహారాలు, రాజకీయ ఎత్తులకు పైఎత్తులు, కేడర్‌తో అనుసరిస్తున్న తీరును అతి సమీపంగా కైవల్యారెడ్డి గమనిస్తున్నారు. గడిచిన ఏడేళ్లుగా తండ్రి వద్ద రాజకీయ పాఠాలలో కైవల్య నిమగ్నమై ఉన్నారట. తండ్రి గెలుపు కోసం ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేయడమే కాక.. ఇప్పటికీ గ్రామాల నేతలతో నేరుగా పరిచయాలు కలిగి ఉండడం.. కైవల్యకు కలిసివచ్చే అంశమంటున్నారు.

ఈనెల 23 నుంచి నెల్లూరు జిల్లాలో జరగనున్న టిడిపి మహానాడు వేదికగా కైవల్యను పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది మంత్రి ఆనం ఆలోచనగా చెబుతున్నారు. అందులోభాగంగా కైవల్యా రెడ్డిని పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌తోపాటు ప్రముఖులకు పరిచయం చేసే కార్యక్రమానికి ఆనం సన్నాహాలు చేస్తున్నారట. రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ నేతగా, రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన నేతగా ఉండడంతో రామనారాయణరెడ్డి కుమార్తె భవిష్యత్తు రాజకీయ వారసత్వం సునాయసమేనన్న భావన ఆయన అనుచరవర్గంలో కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆమె రాజకీయ భవిష్యత్తు పైనా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. 2029 ఎన్నికలనాటికి పునర్విభజన జరిగితే రాపూరు లేకుంటే ఆత్మకూరు నుంచే కైవల్యా రెడ్డి ఎమ్మెల్యే బరిలోకి దిగే అవకాశాలు ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story