Off The Record: ఆనం రాంనారాయణ రెడ్డికి అగ్ని పరీక్ష!
Off The Record: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబ ప్రస్థానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వారి అనుబంధాన్ని వివరించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
Off The Record: ఆనం రాంనారాయణ రెడ్డికి అగ్ని పరీక్ష!
Off The Record: "ఆనం కుటుంబం" తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వటవృక్షం. రాజకీయ రాజధానిగా భావించే నెల్లూరు జిల్లాలోతోపాటు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఆనం అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. సుదీర్ఘ రాజకీ చరిత్ర కలిగిన ఆనం కుటుంబంలో ఇప్పుడు ఆరో తరంగా ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఇటీవల ఆనం రామనారాయణ.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడులో చేసిన కొన్ని రాజకీయ ప్రస్థానాలు.. ప్రత్యేకించి నీటిపారుదల రంగం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పూర్తిస్థాయిలో వివరించడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతం, వర్తమాన, భవిష్యత్తు రాజకీయాలలో ఆనం చేసిన కొన్ని వ్యాఖ్యానాలు జిల్లా రాజకీయాలలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ఆనం కుటుంబంలో.. పాత, కొత్త తరాల మేళవింపు కలిగిన నాయకుడిగా మంత్రి రామనారాయణరెడ్డి.. ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. రామనారాయణరెడ్డి నెల్లూరుకు చెందిన ఆనం వెంకటరెడ్డి కుమారుడు. ఇతని సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కూడా రాజకీయ నాయకుడే. 1983లో టిడిపి ఆవిర్భావం అనంతరం యువకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రామనారాయణరెడ్డి.. 1983లో నెల్లూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై కాంగ్రెస్, వైసీపీల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
రామనారాయణరెడ్డి, ఆయన తండ్రి ఆనం వెంకటరెడ్డి.. ఆత్మకూరు, రాపూరు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడే సోమశిల కండలేరు జలాశయాలు పురుడు పోసుకున్నాయి. మైనర్ ఇరిగేషన్‌లోని అనేక చెరువులు, మధ్యతరహా నీటిపారుదల రంగంలోని కనుపూరు కాలువ.. బహుళార్థసాధక ప్రాజెక్టుల జాబితాలో చేరిన సోమశిల కండలేరు జలాశయాల నిర్మాణంలో ఆనం కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందంటారు. మరోవైపు మధ్యతరహా నీటిపారుదల రంగంలోని కనుపూరు కాలువ కూడా ఆనం వెంకటరెడ్డి నెల్లూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలోనే నిర్మించారట.
జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనింగ్ ఇరిగేషన్ మినిస్టర్ హోదాలో ఆనం వెంకట్ రెడ్డి.. సోమశిల జలాశయానికి శంకుస్థాపన చేశారు. ఆపై ఎన్టీఆర్ రాజ్యాధికారంలోకి వచ్చాక ఆనం వెంకటరెడ్డి.. సోమశిల జలాశయం జాతికి అంకితం చేయడంలో కీలక భూమిక వహించారు. అంతేకాదూ కండలేరు జలాశయం జాతికి అంకితం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఆ సమయంలో రామనారాయణ రెడ్డి.. రాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
అంతకుముందు 1962లో ఆనం కుటుంబ తొలి రాజకీయ పెద్దగా ఉన్న చెంచు సుబ్బారెడ్డి.. అప్పట్లో పీడబ్ల్యుడీ అనే ఐదు శాఖలతో కూడిన ఇరిగేషన్ మంత్రిగా.. జిల్లాలోని సాగునీటి రంగానికి ఆయువుపట్టుగా ఉన్న కనుపూరు.. డెల్టా కాలువల నిర్మాణానికి పునాదులు వేశారు. వీటిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ.. మంత్రి రామనారాయణరెడ్డి.. మర్రిపాడులో తమదైన రీతిలో నీటిపారుదల శాఖకు తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు.
నెల్లూరు జిల్లాలో తనకంటూ రాజకీయంగా ఓ వర్గమే కాదు.. సుస్థిరమైన చరిత్ర, అభివృద్ధిలోనూ తమదైన ముద్ర వేసినట్టుగా ఇటీవల దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. అదే ఇప్పుడు జిల్లా రాజకీయాలలో ఆ కుటుంబానికి, నీటిపారుదల రంగానికి ఉన్న అనుబంధం.. హాట్ టాపిక్ అయ్యందట.
ఆత్మకూరు నియోజకవర్గంలో తమ రాజకీయ ప్రత్యర్థులైన మేకపాటి కుటుంబీకులు, మద్దతుదారులు ఇటీవల సోమశిల హై లెవల్ కెనాల్ నిర్మాణంలో ఆనం రామనారాయణరెడ్డి జాప్యం చేస్తున్నారంటూ మర్రిపాడు మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. దీంతో రామనారాయణరెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని, నీటిపారుదల రంగంతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారట.
ఆత్మకూరు నియోజకవర్గంలో.. పురోగతిని సాధించడంతోపాటు నెల్లూరు ఐకాన్‌గా ఉత్తర శ్రీరంగంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న చారిత్రక ఆలయం శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి ఆలయం రూపురేఖలను మార్చారట రామనారాయణ. ఆనం కుటుంబానికి విడదీయరాని బంధం కలిగిన తల్పగిరి రంగనాథుడే కాదు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఇప్పుడు పూర్వ వైభవానికి పునాదులు వేసుకుంది. ఆ దేవాలయ నిర్మాణం చకచకా జరుగుతోందని మంత్రి ఆనం వివరించారు.
దీంతోపాటు జిల్లాలో కరోనా సమయంలో వెలుగులోకి వచ్చిన కవూరు, తిరుమలపాడులోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, ఇప్పుడు చారిత్రక విశేషాలు విశిష్టతతో పునర్నిర్మాణం సంతరించుకుంటోందని మంత్రి వివరించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ఒక కుటుంబం తిరిగి వెనక్కి చూసుకున్నప్పుడు.. ఏం చేశాం..? ఇంకా ఏం చేయాలి..? ప్రజల్లో మన గుర్తులేంటి..? అన్న ఆత్మపరిశీలన చేసినప్పుడు అనేక ఆనవాళ్లు కళ్ల ఎదుట కనిపిస్తే... ఆ ఆనందమే జీవితానికి సార్ధకమన్నారు రామనారాయణ రెడ్డి. అయితే రాజకీయ ప్రస్థానంలో చేసినవి చెప్పుకోకపోతే భావితరం ఎలా గుర్తుంచుకుంటుంది..? అప్పుడప్పుడు సింహావలోకనం అవసరమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




