Off The Record: కూటమిలో తేలని మేయర్ స్థానాల లెక్కలు!
Off The Record: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల సీట్ల పంపకంపై కూటమిలో జరుగుతున్న చర్చలు, జనసేన, బీజేపీ డిమాండ్లు మరియు టీడీపీ కేడర్ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక విశ్లేషణ.
Off The Record: కూటమిలో తేలని మేయర్ స్థానాల లెక్కలు!
Off The Record: ఏపీలోని అధికార కూటమి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన చర్చ ఏంటంటే.. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లను కూటమిలోని మూడు పార్టీలు ఎలా పంచుకోవాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సుమారు 5 కార్పొరేషన్లు, బీజేపీ 2 కార్పొరేషన్లు కోరుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై ఏ పార్టీ కూడా ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఇవి చర్చల దశలో ఉన్న ప్రతిపాదనలుగానే మిగిలిపోయాయి. ఇప్పటివరకు కూటమిలోని ముఖ్య నేతలు మూడు దఫాలుగా చర్చలు జరిపినా, వివరాలను మాత్రం బయటపెట్టలేదు. దీంతో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు తమ సొంత అంచనాలు వేసుకుంటూ.. రోజుకో కొత్త చర్చను తెరపైకి తెస్తున్నారు.
VO2: జనసేన పార్టీ తమకు కేటాయించాల్సిందిగా కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు, ఐదో స్థానంగా విజయవాడ లేదా గుంటూరు ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇక్కడే కూటమికి అసలైన సవాలు ఎదురుకానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయవాడ, గుంటూరు వంటి కీలక నగరాలను టీడీపీ తన పట్టున్న ప్రాంతాల నుంచి వదులుకునేందుకు సిద్ధపడుతుందా..? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. విజయవాడలో టీడీపీకి బలమైన కేడర్ నిర్మాణం ఉంది. ప్రస్తుత రాజకీయ ప్రాతినిధ్యం చూస్తే... విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటిలో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరొకటి బీజేపీ వద్ద ఉంది. ఒకవేళ విజయవాడ మేయర్ స్థానాన్ని గాజు గ్లాసు పార్టీకి కేటాయిస్తే.. అక్కడ టీడీపీ కేడర్ పూర్తిగా సహకరిస్తుందా..? గెలుపు కోసం నిజంగా కష్టపడతారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్థానిక టీడీపీ నేతలు, కార్పొరేటర్ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న తరుణంలో.. మేయర్ సీటు మిత్రపక్షానికి వెళ్తే స్థానికంగా తీవ్ర అసంతృప్తి చెలరేగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇదే రకమైన సంక్లిష్ట పరిస్థితి ఉత్తరాంధ్రలోని ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం విషయంలోనూ కనిపిస్తోంది. బీజేపీకి విశాఖపట్నం లేదా రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో ఒకదానిని కేటాయించాలనే చర్చ జరుగుతోంది. అయితే, విశాఖ లాంటి మహా నగరంలో టీడీపీకి ఉన్న కేడర్ బలం, రాజకీయ ప్రాతినిధ్యం దృష్ట్యా.. ఆ స్థానాన్ని టీడీపీ వదులుకుంటుందా అనేది మరో పెద్ద ప్రశ్న. మరోవైపు, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ను బీజేపీకి కేటాయించాలనే ప్రతిపాదనపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. ఆ ప్రాంతంలో పార్టీ విస్తరణకు, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. అయితే, ఏ పార్టీకి ఏది దక్కినా.. కేవలం సీటు కేటాయించడం మాత్రమే ముఖ్యం కాదు, అక్కడ గెలిచి తీరాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.
జనసేనకు కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, తిరుపతి వంటి కార్పొరేషన్లు దక్కితే.. ఆ పార్టీకి స్థానిక సంస్థల్లో బలపడేందుకు చక్కటి అవకాశం దొరుకుతుంది. కానీ, అక్కడ పార్టీకి సరైన స్థానిక నాయకత్వం, బలమైన ద్వితీయ శ్రేణి కేడర్, గెలుపు కోసం నిలబడే అభ్యర్థులు ఉన్నారా అనేది అత్యంత కీలకం. ఇప్పుడు కూటమి పెద్దల ముందున్న ప్రధాన సమస్య సీట్ల పంపకం మాత్రమే కాదు.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమన్వయం చేయడం కూడా పెద్ద సవాలే. రాష్ట్ర స్థాయిలో పొత్తు నిర్ణయం తీసుకోవడం సులువే కావచ్చు, కానీ స్థానికంగా ఏళ్ల తరబడి టికెట్లు ఆశిస్తున్న నేతలు, ఎన్నికల కోసం శ్రమిస్తున్న కార్యకర్తలు ఆ నిర్ణయాన్ని ఎంతవరకు జీర్ణించుకుంటారన్నదే మరో ప్రశ్న. ఒక పార్టీకి తిరుగులేని పట్టున్న కార్పొరేషన్‌ను మిత్రపక్షానికి కేటాయిస్తే.. దాని ప్రభావం కేవలం మేయర్ పదవికే పరిమితం కాకుండా, రాబోయే ఐదేళ్లపాటు ఆ నగరంలో పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల టాక్.
ప్రస్తుతానికి కూటమి పార్టీల మధ్య '10-5-2' ఫార్ములా చర్చల దశలో ఉన్నప్పటికీ.. తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, రాజమహేంద్రవరం వంటి మేజర్ కార్పొరేషన్ల విషయంలో రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అందుకే, కూటమి నాయకులు చేస్తున్న ఈ కసరత్తును కేవలం మేయర్ సీట్ల పంపకంలా చూడలేం. స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉండాలి..? ఎవరి కేడర్‌ను ఎలా సంతృప్తి పరచాలి..? భవిష్యత్ రాజకీయ సమీకరణాలను ఎలా బ్యాలెన్స్ చేయాలి..? అనే దానిపై జరుగుతున్న పెద్ద కసరత్తు ఇది. చివరకు, కూటమి పెద్దలకు సీట్ల సర్దుబాటు ఒక లెక్క అయితే.. ఆ లెక్కను క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అంగీకరించేలా చేయడమే అసలైన సవాలుగా మారనుంది. మరి ఈ అగ్ని పరీక్షను కూటమి పెద్దలు ఎలా దాటుతారో చూడాలి.




