Off The Record: మన్యం కోటలో రాజకీయ సమరం!

Off The Record: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పట్టుకోసం కూటమి, వైసీపీ మధ్య తీవ్ర పోరు సాగుతోంది. అరకు కాఫీ బ్రాండింగ్ అస్త్రంతో ఏజెన్సీపై టీడీపీ, జనసేన గురి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Oct 2026 8:13 AM IST
Off The Record
X

Off The Record: మన్యం కోటలో రాజకీయ సమరం!

Off The Record: పచ్చని మన్యం కొండలు.. మంచు కురిసే లోయలు.. నిశ్శబ్దంగా కనిపించే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు రాజకీయ వేడి ఎగసిపడుతోంది. ఒకవైపు ప్రకృతి అందాలతో పరవశించే అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన సమరక్షేత్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతటా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం వీచినా.. అల్లూరి మన్యంలో మాత్రం ఫ్యాన్ స్పీడ్ తగ్గలేదు. సగటు గిరిజనుడి ఆదరణ మారలేదు. ఈ గిరిజన కోటను ఎలాగైనా బద్ధలు కొట్టాలనే పట్టుదలతో కూటమి అధినేతలు రంగంలోకి దిగారు. గతంలో వైసీపీ ఉంటే గంజాయి ఘాటు వాసనలు.. అదే మేము వస్తే అంతర్జాతీయ స్థాయి అరకు కాఫీ సువాసనలు.. అంటూ కూటమి నాయకులు చెబుతున్న మాటలు ఇప్పుడు ఏజెన్సీ రాజకీయాల్లో కొత్త ఫ్లేవర్‌ను నింపుతున్నాయి. మరి అరకు కాఫీ అరోమాతో అల్లూరి జిల్లా పొలిటికల్ ఫ్లేవర్ మారబోతోందా..? కూటమి వేసిన నయా ప్లాన్ పారుతుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఒకదారి. అల్లూరిది మరోదారి. అవును.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి గాలి వీచినా, అల్లూరి జిల్లా చరిత్ర మాత్రం భిన్నంగా నమోదైంది. జిల్లాలోని పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాలతోపాటు అరకు పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ తన ఖాతాలోనే వేసుకుంది. రాష్ట్రంలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైనా.. ఏజెన్సీ బిడ్డలు మాత్రం తమ ఆదరణను కాపాడుకున్నారు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రామాణికంగా తీసుకుని, ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల నాటికి ఏజెన్సీపై పూర్తిగా పట్టు సాధించాలనే వ్యూహంతో.. ఆపరేషన్ అల్లూరికి శ్రీకారం చుట్టింది బాబు సేన. దీనికోసం స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధుల ప్రాధాన్యతను తగ్గిస్తూ, కూటమి పార్టీల ఇన్‌ఛార్జీల ద్వారానే పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం.

పాడేరు నియోజకవర్గంలో వైసీపీ పునాదులను కదిలించేందుకు తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఒకప్పుడు ఇదే పాడేరులో వైసీపీ తరఫున బలమైన కేడర్‌ను నిర్మించి, పార్టీకి కొండంత అండగా నిలిచారు ఆ పార్టీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి. రాజకీయంలో కాల చక్రం తిరిగింది.. ప్రస్తుతం ఆమె టీడీపీ పాడేరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. తాను ఒకప్పుడు ఏ పునాదులనైతే నిర్మించారో, ఇప్పుడు అదే పునాదులను కదిలించి, టీడీపీకి తిరుగులేని కోటగా మార్చేందుకు గిడ్డి ఈశ్వరి క్షేత్రస్థాయిలో చెమటోడుస్తున్నారు. కేడర్‌ను సమన్వయం చేస్తూ రాబోయే స్థానిక ఎన్నికలకు శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారు. మరోవైపు కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీ తరఫున అరకు ఇన్‌ఛార్జ్‌గా కొణిదల నాగబాబు వ్యవహరిస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురూ కలసి గిరిజనుల మనసులను గెలుచుకునేందుకు పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సైతం స్వయంగా ఏజెన్సీలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

కేవలం రాజకీయ ఉపన్యాసాలకే పరిమితం కాకుండా.. గిరిజనుల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడం ద్వారానే వారి హృదయాలను గెలుచుకోవచ్చని కూటమి భావిస్తోంది. అందులో భాగంగానే గిరిజన సహకార సంస్థ ద్వారా అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ కల్పించే బృహత్తర కార్యక్రమానికి తెరలేపారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, అరకు కాఫీని ప్రపంచ స్థాయి మార్కెట్‌లో నిలబెట్టడం ద్వారా అక్కడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది ప్లాన్. దీనికితోడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి అధిష్ఠానం అదనపు బాధ్యతలు అప్పగించి ఏజెన్సీలో కూటమి బలాన్ని పెంచే పనిని అప్పగించింది. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం తన పేషీ ద్వారా ప్రత్యేక దృష్టి సారించి, ఏజెన్సీ ప్రాంత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేస్తున్నా.. వైసీపీ కేడర్ మాత్రం అత్యంత ధీమాగానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. "ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా ఏజెన్సీలో మా పునాదులకు వచ్చిన ఢోకా ఏమీ లేదు" అని ధీమా వ్యక్తం చేస్తున్నారట స్థానిక వైసీపీ నేతలు. ఇక అరకు ఎంపీ డాక్టర్ తనూజ రాణి వైసీపీకి పెద్ద అసెట్‌గా మారారు. ఒక వైద్యురాలిగా, ఒక జెన్-జీ యువ నాయకురాలిగా ఆమెకు ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఏజెన్సీ సమస్యలపై పార్లమెంట్‌తో పాటు క్షేత్రస్థాయిలో గళమెత్తుతూ, గిరిజన ప్రజలకు తామున్నామని కొండంత అండగా నిలుస్తున్నారు. వైసీపీ స్థానిక నాయకత్వం కూడా తమ కేడర్ కూటమి వైపు జారిపోకుండా గట్టిగా పట్టు బిగిస్తోంది. సంక్షేమ పథకాలు పొందిన గిరిజన కుటుంబాలు ఇంకా తమ వైపే ఉన్నాయని వారు నమ్ముతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అల్లూరి జిల్లా రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. అరకు కాఫీ బ్రాండింగ్, అభివృద్ధి హామీలతో కూటమి సర్కార్ విసురుతున్న రాజకీయ పాచికలు పారుతాయా..? లేక గిరిజనుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వైసీపీ తన జెండాను రెపరెపలాడిస్తుందా..? అరకు కొండల్లో మారబోతున్న రాజకీయ గాలి ఎటువైపు వీస్తుంది..? ఏ జెండా అల్లూరి మన్యంలో విజయకేతనం ఎగురవేస్తుందో తెలియాలంటే రాబోయే స్థానిక ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్