Burning Topic: పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైన ఆంథ్రోపిక్ ఏఐ!

Burning Topic: ఆంథ్రోపిక్ సంస్థ 2 ట్రిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో భారీ ఐపీఓకు సిద్ధమైంది. మరోవైపు క్లాడ్ ఏఐ జార్జియా ఓటర్ల డేటాను యాక్సెస్ చేయడం కలకలం రేపింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Oct 2026 7:24 AM IST
Burning Topic
X

Burning Topic: పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైన ఆంథ్రోపిక్ ఏఐ!

Burning Topic: అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఆంథ్రోపిక్ తన పాపులర్ ఏఐ చాట్‌బోట్ ‘క్లాడ్’ తో పాటు పలు కీలక పరిణామాలతో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటి దాకా అతిపెద్ద ఐపీఓ అంటే 4 నెలల కిందటి వరకు సౌదీకి చెందిన సౌదీ ఆరాంకో పేరు వినిపించేది. ఇటీవల జూన్ నెలలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ దీనిని బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించే దిశగా ఐపీఓ రాబోతోంది.

శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ, 'ఏఎన్‌టీ' అనే ట్రేడింగ్ సింబల్‌తో నాస్‌డాక్ గ్లోబల్ సెలెక్ట్ మార్కెట్‌లో తమ షేర్లను లిస్ట్ చేయడానికి దరఖాస్తు చేసుకుంది. ఈ మెగా ఆఫరింగ్ తుది పరిమాణం, ధరల శ్రేణి, వాల్యుయేషన్ ఇంకా ఖరారు కానప్పటికీ.. గత మే నెలలో జరిగిన ప్రైవేట్ ఫండింగ్ రౌండ్‌లో కంపెనీ విలువ 965 బిలియన్ల డాలర్లుగా ఉండగా.. ప్రస్తుత ఐపీఓ ద్వారా దీని మొత్తం వాల్యుయేషన్ ఏకంగా 1.5 ట్రిలియన్ల నుండి 2 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఆంథ్రోపిక్ ఐపీఓ ద్వారా రికార్డు స్థాయిలో 100 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మధ్యలో థ్యాంక్స్ గివింగ్‌కు ముందు ఈ షేర్లు ట్రేడింగ్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఐపీఓ ద్వారా సమీకరించే ఈ భారీ నిధులను కంపెనీ విస్తరణ ప్రణాళికలకు, ముఖ్యంగా అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల సామర్థ్యం పెంపునకు, సరికొత్త ఏఐ నమూనాల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.

అంతేకాకుండా, వ్యూహాత్మక వ్యాపారాలు, సాంకేతికతను కొనుగోలు చేయడానికి కూడా ఈ నిధులను ఉపయోగిస్తామని ఫైలింగ్‌లో పేర్కొంది.ఏఐ మోడళ్ల శిక్షణకు విపరీతమైన కంప్యూటింగ్ శక్తి, విద్యుత్, డేటా మౌలిక వసతులు అవసరం కాబట్టి, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ క్లౌడ్ భాగస్వాములతో కలిసి రాబోయే సంవత్సరాల్లో రూ. $500 బిలియన్లకు పైగా ఖర్చు చేయడానికి ఆంథ్రోపిక్ కట్టుబడి ఉంది.

ఓపెన్‌ ఏఐ మాజీ ఉన్నతోద్యోగులతో 2021లో స్థాపితమైన ఆంథ్రోపిక్, ఏఐ రంగంలో వేగంగా అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. పబ్లిక్‌ ఇష్యూలో జారీ చేయనున్న షేర్ల పరిమాణం, ఇష్యూ ధరల శ్రేణి లాంటి వివరాలను ఆంథ్రోపిక్‌ వెల్లడించలేదు. అత్యాధునిక ఏఐ మోడళ్ల అభివృద్ధిని స్లో డౌన్‌ చేయాలని కంపెనీ సీఈఓ డారియో అమోడెయ్‌ పేర్కొన్న కొద్దిరోజులకే 335 పేజీల ఐపీఓ పత్రాలు సమర్పించడం గమనార్హం.స్థాపించిన ఐదేళ్లలోనే విశేష ప్రాచుర్యం పొందిన ఆంథ్రోపిక్.. ఆదాయం కూడా అంతే వేగంగా పెరిగింది.

అయితే, నష్టాల్లోనే కొనసాగుతుండం గమనార్హం. 2026తొలి అర్ధభాగంలో 80.7 బిలియన్‌ డాలర్లు నష్టం వాటిల్లినట్లు ఐపీఓ పత్రాల్లో పేర్కొంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఈ మొత్తం 13 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కంపెనీ మొత్తం విలువ 1.5-2 ట్రిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సుమారు 100 బిలియన్‌ డాలర్లు సమీకరించొచ్చని తెలుస్తోంది.

ఇటీవలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్.. మానవ ప్రమేయం లేకుండానే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకు దారి తీస్తోంది. ఏఐ మోడళ్లతో సైబర్‌ భద్రతకు సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ తన ట్రైనింగ్ ప్రక్రియలో అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి సంబంధించిన ఓట్ల సమగ్ర సమాచారాన్ని యాక్సెస్ చేసింది.

సాధారణంగా ఎన్నికల వివరాలకు సంబంధించిన పబ్లిక్ డాష్‌బోర్డ్‌ను యాక్సెస్‌ చేయడానికి ఎన్నికల యంత్రాంగం టోకెన్లు జారీ చేస్తుంది. వాటితో పౌరులు అందులోని ఓట్ల సంఖ్య, ఇతర వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. దీనికోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన ఏఐ.. పేవాల్‌ను అధిగమించి, ఓటరు డేటాను యాక్సెస్ చేసింది. అయితే ఓటింగ్ రికార్డులను కాపీ చేయడం, మార్పులు చేయడం వంటివి మాత్రం చేయలేదని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది.

ఈ ఘటనపై ఆంథ్రోపిక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. క్లాడ్ కేవలం సమగ్ర ఓట్ల లెక్కలను మాత్రమే యాక్సెస్ చేసిందని తెలిపారు. జార్జియా రాష్ట్ర ఓటరు నమోదు వ్యవస్థలోకి క్లాడ్ ప్రవేశించలేదని స్పష్టం చేశారు. అందువల్ల ఈ ఘటనను వ్యక్తిగత ఓటర్ల సమాచార చోరీగా లేదా ఎన్నికల డేటా మార్పుగా భావించడానికి ఆధారాలు లేవు.

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ విషయాన్ని జార్జియా రాష్ట్ర కార్యదర్శి కార్యాలయానికి, వైట్ హౌస్‌కు తెలియజేశామంది. గత నెలలో అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాల వెబ్‌సైట్లలోకి తమ ఏఐ ఏజెంట్లు ఊహించని రీతిలో చొరబడ్డాయని ఓపెన్‌ఏఐ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ట్రంప్ యంత్రాంగం ప్రభుత్వ వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేస్తున్న ఏఐ మోడళ్లపై నిఘా పెంచింది.

కృత్రిమ మేథ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రభుత్వ సమాచారానికి , జాతీయ భద్రతకు ఖచ్చితంగా ముప్పు పొంచి ఉందనేది వాస్తవం. సాంప్రదాయ హ్యాకర్ల కంటే AI ఆధారిత టూల్స్ ప్రభుత్వ సర్వర్లలోని లోపాలను అత్యంత వేగంగా గుర్తిస్తాయి. ప్రభుత్వ అధికారులను మోసగించడానికి, నిజమైన ఇమెయిల్‌లను పోలిన నకిలీ ఇమెయిల్‌లను AI సృష్టించగలదు.

దీనివల్ల రహస్య సమాచారానికి సంబంధించిన పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు తెలియకుండా AI టూల్స్‌లో ప్రభుత్వ రహస్య పత్రాలను, సమాచారాన్ని విశ్లేషణ కోసం అప్‌లోడ్ చేస్తే, ఆ డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది.

బహిరంగంగా అందుబాటులో ఉండే ప్రభుత్వ డేటాను, దేశ రక్షణ వ్యూహాలను అంచనా వేసే అవకాశం ఉంది. విద్యుత్ గ్రిడ్లు, రక్షణ రంగానికి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థలు, బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లను నియంత్రించే ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌లను AI ద్వారా హ్యాక్ చేసి స్తంభింపజేసే ప్రమాదం ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్