Off The Record: నారా లోకేష్ జెన్-జీ మంత్రం!

Off The Record: యువతను ఆకట్టుకునేలా ఏపీ మంత్రి నారా లోకేష్ కొత్త రాజకీయ వ్యూహం. సోషల్ మీడియా వేదికగా నిమజ్జనంలో డీజేల అనుమతిపై చర్చ. పూర్తి వివరాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Sept 2026 8:46 AM IST
Off The Record
X

Off The Record: నారా లోకేష్ జెన్-జీ మంత్రం!

Off The Record: యువతతో కనెక్ట్ అయ్యే విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ తన రాజకీయ కార్యాచరణను క్రమంగా మార్చుకుంటున్నారన్న చర్చ మొదలైంది. ఉద్యోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, స్టార్టప్‌ల వంటి అంశాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన లోకేష్.. ఇప్పుడు యువత రోజువారీగా ఆసక్తి చూపించే అంశాలపైనా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నేరుగా మాట్లాడటం.. యువతకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడం.. వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు ఇందులో కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇది కేవలం యువత సమస్యలపై స్పందించే రాజకీయ శైలేనా..? లేక కొత్త తరం ఓటర్లతో ఇప్పటి నుంచే ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఏర్పరుచుకునే ప్రయత్నమా..? అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇక వినాయక చవితి విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొనే వేడుకల్లో గణేష్ ఉత్సవాలు కూడా ఒకటి. ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలు, మ్యూజిక్, భారీ ఊరేగింపులు యువతలో ప్రత్యేక ఉత్సాహాన్ని కలిగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో నిమజ్జనాల్లో డీజేలకు అనుమతులు ఇవ్వాలంటూ హోంమంత్రి అనితను X వేదికగా లోకేష్ కోరడం చర్చకు దారితీసింది. ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఒక మంత్రి.. యువత ఎక్కువగా ఆసక్తి చూపించే అంశంపై నేరుగా స్పందించడం రాజకీయంగా కూడా ఆసక్తిని రేపుతోంది. మరి ఇది కేవలం ఒక అంశంపై చేసిన విజ్ఞప్తిగానే చూడాలా..? లేక యువత పల్స్‌ను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా రాజకీయంగా స్పందిస్తున్నారన్న సంకేతంగా చూడాలా..?

ఇప్పటికే ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, టెక్నాలజీ వంటి అంశాలను యువతకు సంబంధించిన ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్న లోకేష్.. ఇప్పుడు వారి ఆసక్తులు, సామాజిక అంశాలపైనా దృష్టి పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సంప్రదాయ రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. కొత్త తరం ఆలోచనలు, వాళ్లకు నచ్చే అంశాలపై కూడా స్పందించడం ద్వారా తన రాజకీయ కమ్యూనికేషన్‌ను మార్చుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. అంటే.. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్త తరం ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా..? లేక భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తన కమ్యూనికేషన్‌నే కొత్తగా మలుచుకుంటున్నారా..?

మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొత్త తరం ఓటర్ల పాత్ర కూడా చర్చకు వస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో యువత రాజకీయాలపై ఆసక్తి చూపుతోంది. కొంతమంది నేరుగా రాజకీయాల్లోకి వస్తుంటే.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను బలంగా వినిపిస్తున్నారు. దీంతో ఈ తరం ఆలోచనలు, వారి సమస్యలను రాజకీయ పార్టీలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో నారా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. స్థానిక ఎన్నికల ముందు యువతకు సంబంధించిన అంశాలపై వరుసగా స్పందించడం.. కేవలం ప్రభుత్వ విధానాల్లో భాగంగానే జరుగుతోందా..? లేక కొత్త తరం ఓటర్లతో రాజకీయంగా ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నమా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

స్థానిక ఎన్నికల్లో పార్టీతోపాటు అభ్యర్థి వ్యక్తిగత పరిచయం, స్థానిక సమస్యలు, యువత భాగస్వామ్యం కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో యువతతో ఏర్పడే ఈ కనెక్ట్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఉపయోగపడుతుంది..? ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న యువతను మరింత యాక్టివ్ చేయడానికా ఈ ఫోకస్..? లేక తొలిసారి ఓటు వేయబోయే తరం వైపు కూడా దృష్టి సారిస్తున్నారా..? లోకేష్ ఇప్పుడు యువతను ఫాలో అవుతున్నారా..? లేక యువతను దృష్టిలో పెట్టుకుని తన రాజకీయ శైలినే మార్చుకుంటున్నారా..? జెన్‌ జీతో ఈ కనెక్ట్ కేవలం సోషల్ మీడియా, యువతకు నచ్చే అంశాల వరకేనా..? లేక రాబోయే స్థానిక ఎన్నికల నుంచి భవిష్యత్ రాజకీయాల వరకు కొనసాగించే వ్యూహమా..? అన్నదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్