off the record: జగన్ పొలిటికల్ రూట్ మారిందా?

off the record: వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాలు, వామపక్షాలతో పొత్తులపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Sept 2026 11:26 AM IST
off the record
X

off the record: జగన్ పొలిటికల్ రూట్ మారిందా?

off the record: ఒకప్పుడు.. సింహం సింగిల్‌గా వస్తుంది అన్నారు. పొత్తులు లేవు.. ఎవరి తోడు అవసరం లేదు.. తమకు ప్రజలే అండగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. ఆ మాటల్లో అప్పట్లో ఒక రాజకీయ ధైర్యం కనిపించింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. అదే మాటకు మరో అర్థం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే సింగిల్ సింహం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది..? కారణం ఒకే ఒక్క భేటీ. వైసీపీ అధినేత జగన్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ నేరుగా కలిశారు.

ప్రజా సమస్యలపై నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆహ్వానించారు. అంతేకాదు.. ఉమ్మడి ప్రజా పోరాటాలపై కూడా చర్చ జరిగినట్లు సీపీఐ నేతలు స్వయంగా వెల్లడించారు. అక్కడే అసలు ఆసక్తి మొదలవుతోంది. ఇన్నాళ్లూ సొంత బలంపైనే రాజకీయ ప్రయాణం చేసిన వైసీపీ.. ఇప్పుడు వామపక్షాలతో కలిసి అడుగులు వేస్తుందా..? ఇది ఇక్కడితో ఆగిపోతుందా..? లేక దీని వెనుక మరో రాజకీయ లెక్క ఉందా..? అన్నదే ఇప్పుడు అందరిలో రగులుతున్న చర్చ.

వైసీపీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో, ఎన్నికల్లో ఆ పార్టీ ప్రధానంగా సొంత బలంపైనే ఆధారపడింది. ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు.. పొత్తులకు దూరంగా ఉండటాన్ని ఒక రాజకీయ వ్యూహంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాయి.

ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి.. రెండు వ్యూహాల మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. కూటమి అధికారంలోకి రాగా.. వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. అక్కడి నుంచే వైసీపీ “సింగిల్” వ్యూహంపై రాజకీయ చర్చ మొదలైంది. ఒంటరిగా పోటీ చేయడమే సరైన వ్యూహమా..? లేక రాజకీయంగా కలిసి వచ్చే పార్టీలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందా..? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

అయితే జగన్‌తో సీపీఐ నేతల భేటీకి ముందే.. కొన్ని ప్రజా సమస్యల విషయంలో వామపక్షాలు, వైసీపీ వాదనలు దగ్గరగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా DSC విషయంలో కూటమి ప్రభుత్వ తీరును వామపక్ష నేతలు ప్రశ్నించారు. DSC ఫలితాల తీరుపై వైసిపి చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.

ఆందోళన చేస్తున్న వారిపై రౌడీషీట్లు నమోదు చేయడాన్ని ప్రశ్నించారు. అదే విధంగా SIR అంశంలో సీపీఐ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి వైసీపీ ప్రతినిధులు హాజరై.. తమ పార్టీ వాదనను బలంగానే వినిపించారు. అప్పటివరకు ఇవి ప్రజా సమస్యలపై వివిధ పార్టీల స్పందనగానే కనిపించాయి. కానీ ఇప్పుడు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ స్వయంగా జగన్‌ను కలవడం.. రౌండ్‌టేబుల్‌కు ఆహ్వానించడం.. ఉమ్మడి పోరాటాలపై చర్చించడం.. తాజా పరిణామాలతో సరికొత్త రాజకీయ ప్రాధాన్యతపై చర్చ ప్రారంభమైంది.

అయితే ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతోంది. ప్రజా సమస్యలపై కలిసి పోరాడటం వేరు.. ఎన్నికల రాజకీయాల్లో కలిసి నడవడం వేరు. ప్రస్తుతానికి వైసీపీ–సీపీఐ మధ్య ఎన్నికల పొత్తు ఖరారైందన్న అధికారిక ప్రకటన లేదు. సీట్ల సర్దుబాటు గురించి కూడా ఎలాంటి చర్చ బయటకు రాలేదు. కాబట్టి ఈ భేటీని ఇప్పుడే పొత్తుగా ముద్ర వేయడం సరైంది కాదు అన్న భావన విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు.

కానీ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ భేటీ జరగడం మాత్రం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు అంటే కేవలం గ్రామం, మండలం, పట్టణ స్థాయిలో జరిగే ఎన్నికలు మాత్రమే కాదు. క్షేత్రస్థాయిలో పార్టీల బలాన్ని పరీక్షించే వేదిక కూడా. అలాంటి సమయంలో వామపక్షాలతో వైసీపీకి ఏర్పడుతున్న సమన్వయం.. భవిష్యత్తులో ఎటు వెళ్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదే సమయంలో వైసీపీ శ్రేణుల్లోనూ పొత్తులపై చర్చ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం లేకపోలేదు. 2024లో ఎదురైన ఫలితాలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే.. 2029లో కూడా ఒంటరిగానే వెళ్లాలా..? లేక కలిసి వచ్చే పార్టీలతో సమన్వయం చేసుకోవాలా..? అన్నది పార్టీ ముందున్న వ్యూహాత్మక ప్రశ్నగా మారిందన్న చర్చ పార్టీ అంతర్గతంగా కొనసాగుతోందట.

ముఖ్యంగా వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్తే క్షేత్రస్థాయిలో కొంత రాజకీయ ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చర్చ పార్టీ అధినేత జగన్ వరకు వెళ్లిందా..? వెళ్లి ఉంటే ఆయన ఆలోచన ఏంటి..? అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు.

అటు సీపీఐ కూడా వైసీపీతో మాత్రమే చర్చలు జరపడం లేదు. కాంగ్రెస్‌తోనూ సంప్రదింపులు కొనసాగిస్తోంది. అంటే వామపక్షాల వైపు నుంచి చూస్తే.. వివిధ ప్రతిపక్ష పార్టీలతో ప్రజా సమస్యలపై సమన్వయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల సీపీఐ–వైసీపీ భేటీని ఇప్పుడే ఒక రాజకీయ కూటమికి సంకేతంగా చూడటం తొందరపాటు చర్యే అన్న వారు లేకపోలేదు.

మరి గత అనుభవం నుంచి వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకుంటుంది..? సింహం సింగిల్‌గానే వస్తుందా..? లేక కలిసి వచ్చే పార్టీలతో అడుగులు వేస్తుందా..? సీపీఐతో మొదలైన ఈ సంభాషణ వామపక్షాలతో కలిసి ప్రజా ఉద్యమాల వరకే ఆగిపోతుందా..? లేక భవిష్యత్తులో రాజకీయ అవగాహనకు దారితీస్తుందా..? 2024లో “సింహం సింగిల్” అంటూ ఒంటరి రాజకీయ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లిన వైసీపీ.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏ వ్యూహాన్ని ఎంచుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్