Burning Topic: ఏపీ తలరాత మారుస్తున్న చంద్రబాబు

Burning Topic: విశాఖపట్నంలో గూగుల్ మెగా డేటా సెంటర్ మరియు ఏఐ హబ్ ఏర్పాటు! 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ దశ మారనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 April 2026 7:10 AM IST
Burning Topic
X

Burning Topic: ఏపీ తలరాత మారుస్తున్న చంద్రబాబు

Burning Topic: విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న భారీ మెగా డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ప్రాజెక్టుకు ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారు. సుమారు 1.35 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు.. భారతదేశంలో గూగుల్ చేపట్టిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలవనుంది. ఈ డేటా సెంటర్ విశాఖ పరిసర ప్రాంతాలైన తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలలోని సుమారు 601 ఎకరాల విస్తీర్ణంలో మూడు క్యాంపస్‌లుగా విస్తరించి ఉంటుంది. ఇందులో తర్లువాడలో అతిపెద్ద క్యాంపస్ సుమారు 266 ఎకరాలలో ఏర్పాటవుతోంది. ఇది 1 గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైపర్‌స్కేల్ డేటా సెంటర్. ఇది అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టును 2030 నాటికి ఐదేళ్ల కాలంలో దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశ పనులు జూలై 2028 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా దాదాపు 10 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా. ఈ పెట్టుబడితో విశాఖపట్నం ఆసియాలోనే కీలకమైన ఏఐ గేట్‌వేగా, గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా అవతరించనుంది.

దేశంలో ఐటీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహా నగరాల సరసన ఇక విశాఖపట్నం చేరనుంది. విశాఖలో గూగుల్‌ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్‌ కాదు. అది ఏఐ మెగా హబ్‌. ఇక్కడ డేటా సెంటర్‌తో పాటు, వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కంప్యూటింగ్‌ సేవలందించే మౌలిక వసతులు, భారీ ఎత్తున డేటా స్టోరేజీ, అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్‌ సదుపాయాలు వంటివి ఏర్పాటవుతాయి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌. సముద్రగర్భంలో వేసే కేబుళ్లతో అభివృద్ధి చేసే ఇంటర్నేషనల్‌ సబ్‌ సీ గేట్‌వేతో వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడుతుంది. గూగుల్‌ క్లౌడ్‌ ఏఐకి సంబంధించి మొత్తం ఆసియాకే విశాఖ గేట్‌వేగా మారనుంది. ఇప్పటి వరకు ఉక్కు నగరంగా పేరొందిన విశాఖను రాబోయే రోజుల్లో ఏఐ నగరంగా పిలుస్తారు.

విశాఖలో గూగుల్‌ ఏఐ సేవలందించే మెగా హబ్‌‌కు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డేటా సైంటిస్ట్‌లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ నిపుణులతో పాటు, విద్యుత్తు సరఫరా, కూలింగ్, నెట్‌వర్కింగ్‌ వ్యవస్థల నిర్వహణకు అవసరమైన హార్డ్‌వేర్‌ నిపుణుల అవసరం మెండుగా ఉంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై పనిచేస్తూ, ఆర్థిక సేవలు వంటివి అందించే సంస్థలకు ప్రతి మిల్లీ సెకను విలువైనదే. అదే టార్గెట్‌తో గూగుల్‌ ఏఐ హబ్, డేటా సెంటర్‌ రూపుదిద్దుకోనుంది. గూగుల్‌ హబ్‌తో పాటు, దాని ఆధారంగా ఏర్పాటయ్యే కంపెనీల్లో కలిపి 1.88 లక్షల వరకు ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా. డేటా సెంటర్ల నిర్మాణ సమయంలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌ వంటి రంగాలకు చెందిన నిపుణులకు, నిర్మాణరంగ కార్మికులకు భారీగా ఉపాధి లభించనుంది. సుమారు 60 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌గేర్‌లు, కూలింగ్‌ సిస్టమ్‌లు, బిల్డింగ్‌ మెటీరియల్, యూపీఎస్‌లు, జనరేటర్లు వంటి బ్యాకప్‌ పవర్‌ సరఫరాదారులు, వర్కర్లకు ఉపాధి లభిస్తుంది. వీటికి అవసరమైన పరికరాలు సరఫరా చేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. స్థిరాస్తి, నిర్మాణ, రవాణా, ఆతిథ్య రంగాలకూ ఊతం లభిస్తుంది. ఫలితంగా దేశ, విదేశాలకు చెందిన ఐటీ, సాఫ్ట్‌వేర్‌ నిపుణుల రాకపోకలతో ఎయిర్‌ కనెక్టివిటీ పెరుగుతుంది.

మెగా డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించగానే ప్రపంచం మొత్తం విశాఖవైపు చూసింది. డేటా సెంటర్‌తో విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ 2025 అక్టోబరులో సిలికాన్‌వ్యాలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని గూగుల్‌ ప్రకటించగానే.. రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థలు కూడా విశాఖలో డేటా సెంటర్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. భవిష్యత్తులో ఐటీ, ఏఐ, క్లౌడ్, సెమీకండక్టర్‌ కంపెనీలు అనేకం విశాఖకు క్యూ కట్టేందుకు గూగుల్‌ డేటా సెంటర్‌ దోహదం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ మోడల్‌ డెవలప్‌మెంట్‌కు అవసరమైన కంప్యూటింగ్‌ అవసరాల కోసం అనేక స్టార్టప్‌లు, ఏఐ ల్యాబ్‌లు, రీసెర్చ్‌ సెంటర్లు, ఇంక్యుబేటర్లు, టెస్టింగ్‌ సెంటర్లు, ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్‌లు కూడా విశాఖలో ఏర్పాటు కానున్నాయి. మెగా ఏఐ హబ్‌ ఆధారంగా ఏఐ, ఎంఐలపై పనిచేసే కంపెనీలకు కావలసిన నిపుణులను తయారు చేసేందుకు విశాఖ చుట్టుపక్కలకు పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు తరలిరానున్నాయి. ‘వైజాగ్‌ మెగా డేటా పార్కు లిమిటెడ్‌’ పేరుతో నిర్మించనున్నా ఈ మెగా ప్రాజెక్టుకు అదానీ సంస్థ మౌలిక వసతుల భాగస్వామిగా ఉంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story