BIG STORY: 400 దాటిన AQI! పాలనా వైఫల్యమా?
BIG STORY: ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రస్థాయికి చేరి AQI 400 మార్కు దాటింది. వాయు నాణ్యత క్షీణించడంతో అధికారులు GRAP-1 ఆంక్షలను అమలులోకి తెచ్చారు.
BIG STORY: 400 దాటిన AQI! పాలనా వైఫల్యమా?
BIG STORY: దేశ రాజధానీ నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి పడగవిప్పింది. స్థానికంగా వాయు నాణ్యతా సూచీ మరోసారి పడిపోయింది. ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది 400 మార్కును దాటింది.కాగా రాజధానిలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది.
తెల్లవారుజామున రహదారులపై సమీపాన ఉన్న వాహనాలు కూడా కనిపించలేదు. గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరువ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే దీపావళి సందర్బంగా పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చడమే వాయు కాలుష్యం పెరగడానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీ నగరంలో గత వారం రోజులుగా వాయు నాణ్యతా సూచీ పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్...ఈ సీజన్లో తొలిసారిగా ఆంక్షలు విధించింది. ఢిల్లీ - ఎన్ సీ ఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఒన్ ను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ వెల్లడించింది.
సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ చైర్మన్ రాజీవ్ వర్మ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమీక్షా సమావేశంలో ఢిల్లీకి చెందిన పలువురు ఉన్నతాధికారులతో పాటు అనేక ప్రభుత్వ ఏజన్సీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.రాబోయే రోజుల్లో ఢిల్లీ నగరంలో వాయు కాలుష్య నియంత్రణా చర్యలను మరింత బలోపేతం చేయడంపై కూడా ఈ సమీక్షా సమావేశం చర్చించింది.
అంతేకాదు రానున్న రోజుల్లో వాయు నాణ్యతా సూచీ మరింతగా క్షీణించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా జీఆర్ ఏపీ ఒన్ నిబంధనలను వెంటనే అమలు చేయాలని అలాగే అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ అధికారులు తెలియచేశారు.
ఢిల్లీ నగరంలో వాయు నాణ్యతా సూచీ ఈనెల 20న 179గా నమోదైంది. కాగా 21వ తేదీకి సదరు వాయు నాణ్యతా సూచీ అమాంతంగా 244 కు పడిపోయిందని సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ అధికారులు వెల్లడించారు. అలా క్రమక్రమంగా వాయు కాలుష్య పెరిగిపోయింది.
చివరకు వాయు నాణ్యతా సూచీ 400 మార్కు దాటింది.కాగా వాయు కాలుష్యం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొలిటికల్ వార్ గా మారింది. కాలుష్యానికి కారణం మీరంటే...కాదు మీరేనని రెండు పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
కాగా ఇటీవలికాలంలో ఢిల్లీ నగరం వాయుకాలుష్యానికి మారుపేరుగా మారింది.కొన్నేళ్లుగా ఢిల్లీ నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది. ఢిల్లీ ఒక్కటే కాదు మనదేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యం ఇటీవలికాలంలో పెరిగిపోతోంది.
గాలి కాలుష్యానికి ఒకటి కాదు, రెండు కాదు అనేక కారణాలున్నాయి. పంజాబ్లో పంట వ్యర్థాల దహనం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. అలాగే వాతావరణంలోకి పెద్ద ఎత్తున విడుదలయ్యే గ్రీన్ హౌస్ ఉద్గారాలు మరో కారణం. కాగా గాలి కాలుష్యం, ఆరోగ్యంపై చూపే ప్రభావం అంతా ఇంతాకాదు. కాలుష్యం దెబ్బకు మనిషి అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నాడు.
వాయు కాలుష్యం కేవలం భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్య సమస్య ఉంది. ప్రధానంగా అనేక వర్థమాన దేశాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్ చాలా తీవ్రంగా ఉంది. ఈ భూగోళంపై ప్రతి పదిమందిలో ఎనిమిది మంది కలుషిత గాలి పీలుస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల మంది వరకు కేవలం కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రో కార్బన్లు, సీసం ...ఇవన్నీ గాలి కాలుష్యానికి దారితీసే ప్రధాన కారకాలు అంటున్నారు సైంటిస్టులు.
కాగా సహజంగా మనుషులు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా కాలుష్యానికి గురవుతుంటారు. పట్టణాలు,నగరాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలు ఆగినప్పుడు కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతుంటారు. చుట్టుపక్కల వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు వాహనాల ఎయిర్ ఫిల్టర్ల పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు నిపుణులు.
వాయు కాలుష్యం అనగానే మనదేశంలో అందరికీ వెంటనే గుర్తుకువచ్చేది ఢిల్లీ నగరం. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కొత్త విషయం కాదు. అనేక సంవత్సరాలుగా రాజధానీ నగర ప్రజల ఆరోగ్యంతో పొల్యూషన్ చెలగాటమాడుతోంది. తొలిసారిగా 2018 నవంబరులో ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యధిక స్థాయిలో నమోదైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాదకర స్థాయికంటే 2018 లో ఎక్కువ రేంజ్లో కాలుష్యం నమోదైంది. దీంతో, ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఒక దశలో అక్కడి ప్రభుత్వం వాహనాల రవాణాకు సంబంధించి సరి -బేసిల సంఖ్యల విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే, ఇబ్బడిమబ్బడిగా పెరిగిన వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల సగటు ఆయుర్దాయం పది సంవత్సరాలు తగ్గిపోతోందని అమెరికాకు చెందిన ఒక రీసెర్చ్ గ్రూప్ కొంతకాలం కిందట జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. దీంతో, ఢిల్లీలో వాయిు కాలుష్యం తీవ్రతను ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం హానికర స్థాయిని మించిపోతోంది. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం కమ్మేసింది. ఒకదశలో ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లేనని సాక్షాత్తూ ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించిందంటే పొల్యూషన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వాయు కాలుష్యాన్ని తగ్గించడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఒక సమష్టి కృషి. దీనికి ముందుగా ప్రజలు, అధికారులు అందరికీ పర్యావరణ స్పృహ ఉండాలి. కాలుష్యానికి చెక్ పెట్టాలన్న మైండ్ సెట్ ఉండాలి. కాలుష్య తీవ్రతను తగ్గించడానికి పర్యావరణవేత్తలు అనేక సూచనలు చేశారు.
రోడ్లపై వాహనాల రద్దీని సాధ్యమైనంతవరకు తగ్గించాలన్నది పర్యావరణవేత్తల ప్రధాన సూచన. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించాలంటే స్వంత వాహనాల్లో ప్రయాణాలు చేయడం సాధ్యమైనంతవరకు మానుకోవాలన్నది పర్యావరణవేత్తల సూచన.ప్రజా రవాణాను ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంతగా కాలుష్యానికి చెక్ పెట్టవచ్చంటున్నారు పర్యావరణవేత్తలు.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర ఆరోగ్య సంక్షోభంగా మారుతోందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. 2023లో భారత్లో మెజారిటీ మరణాలకు వాయు కాలుష్యమే కారణమని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, కన్సల్టింగ్ సంస్థ ఈవై నివేదిక వెల్లడించినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పరిస్థితి ఇంత భయంకరంగా ఉన్నప్పటికీ వాయు కాలుష్యం అంశంపై నరేంద్ర మోడీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.
అంతేకాదు, వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, మరణాలపై కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా వాస్తవాలను అంగీకరించడం లేదన్నారు జైరాం రమేశ్. పార్లమెంటులోనూ, బయటా జరిగిన పలు అధ్యయనాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత ముఖ్యమో, ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పరిస్థితులు కల్పించడం అంతకంటే ముఖ్యం అన్నారు జైరాం రమేశ్.
దేశ రాజధానిలో వాయు కాలుష్యం అదుపు తప్పుతున్నా ప్రభుత్వాలు సమర్థంగా చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ కు చెందిన మరో నేత పవన్ ఖేడా విమర్శించారు. ఢిల్లీలో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉన్నందున కాలుష్య సమస్యకు ఇతరులను బాధ్యులుగా చూపే అవకాశం లేదన్నారు.
గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పరస్పరం విమర్శించుకున్నాయన్నారు. అయితే ప్రజలు మాత్రం కాలుష్యంతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలను అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం జరుగుతోందని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇది పాలనా వైఫల్యమా? లేక న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోవడమా? పవన్ ఖేడా అని నిలదీశారు.




