Off The Record: ఆనంకు సవాల్‌గా మారిన నెల్లూరు స్థానిక ఎన్నికలు!

Off The Record: ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటనతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు రాజకీయం వేడెక్కింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Oct 2026 8:21 AM IST
Off The Record
X

Off The Record: ఆనంకు సవాల్‌గా మారిన నెల్లూరు స్థానిక ఎన్నికలు!

Off The Record: ఆనం రామనారాయణ రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయ యవనికపై పరిచయం చేయనక్కర లేని పేరు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. సింపుల్‌గా చెప్పాలంటే దేవుళ్ళ మంత్రిగా ఆనం బాధ్యతలు చూస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి, నాలుగవ తరంలో ఆనం కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న రామ నారాయణరెడ్డి.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆ నియోజకవర్గంలో హేమాహేమీలను ఎదుర్కొని, విజయ బావుటా ఎగరవేసిన రామనారాయణ రెడ్డికి.. తాజాగా ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు పెను సవాల్‌గా మారాయట. సీనియర్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఆత్మకూరు మున్సిపల్ పాలిటిక్స్ సహజంగానే హాట్ టాపిక్‌గా మరాయట.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ఖరారు కావడంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో ఆత్మకూరును జనరల్ మహిళకు కేటాయించారు. ఇదే ఇప్పుడు ఆత్మకూరు మున్సిపల్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర లేపిందట.

ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం మంత్రి రామనారాయణ రెడ్డికి పూర్తిస్థాయి ఆధిపత్యం ఉంది. ప్రస్తుత రాజకీయ రిజర్వేషన్ల నేపథ్యంలో కొత్త సమీకరణలకు తెరలేచే అవకాశం ఉందన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోందట. నియోజకవర్గ కేంద్రంలో బలమైన అనుచరగణం ఉన్నప్పటికీ, స్థానికంగా ఉన్న దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుందర రామిరెడ్డి కుటుంబం.. ఈ ఎన్నికల్లోతిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయట.

గతంలో మూడు దఫాలుగా శాసనసభ్యునిగా పనిచేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుందర్ రామిరెడ్డి కుటుంబం.. ఈసారి వైసీపీ నుంచి మున్సిపల్ బరిలోకి దిగబోతుందన్న ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోందట.

రాజకీయంగా డాక్టర్ సుందర్ రామిరెడ్డి రెండో కుమారుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి.. ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్‌గా, మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గాను రాజకీయ ప్రస్థానంలో కొనసాగుతున్నారు. దీంతో ఆ కుటుంబం నుంచి ఎవరైనా రంగంలోకి దిగితే మంత్రి రామనారాయణరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ తప్పదన్న ప్రచారం జరుగుతోందట.

ఇదే సమయంలో గత రెండు దశాబ్దాల కాలంలో మంత్రి రామనారాయణ రెడ్డి.. ప్రస్థానం గమనిస్తే.. ఇక్కడి నుంచి విజయం సాధించిన అనంతరం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా, ప్రత్యేక ఆంధ్రాలో ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా, అటు ప్రభుత్వంలోనూ ఇటు రాజకీయంగా కీలక భూమిక వహిస్తున్నారు. మున్సిపల్ ఎంపికలో.. కొత్త సమీకరణలకు తెరలేస్తోందట. దీంతో ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలపై అందరికీ ఆసక్తి నెలకొంది.

దాదాపు మూడు దఫాలుగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన రామ నారాయణరెడ్డి అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇదే సమయంలో అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీలో అడుగడుగునా ఉత్కంఠను రేపుతోందట. అధికారం.. అర్థబలం.. వర్గ బలం.. సుధీర్ఘ రాజకీయ నైపుణ్యం కలిగిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మున్సిపల్ ఎన్నికలు నల్లేరు మీద నడకలాంటివే అన్న భావన మొదట సర్వత్రా వ్యక్తమౌతున్నప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో మారుతున్న సమీకరణాలు మంత్రికి ఇంటి పోరు తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట.

ఇందుకు కారణాలు ఉన్నాయట. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ నియోజకవర్గానికి గతంలో రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్య నాయుడు, మరో రెండు దఫాలు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గూడూరు కన్నబాబుతోపాటు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి, మంత్రి రామనారాయణ రెడ్డి వర్గానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయట.

మరోవైపు నియోజకవర్గ కేంద్రంలో కాస్త వర్గ బలం కలిగిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చల్లా రవికుమార్‌, ఆనంకు మధ్య విభేదాలు కొన్నాళ్లుగా కొనసాగుతున్నాయట. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఈ వర్గం పార్టీ లైన్ మీద నడుస్తుందా..? లేదా అంతర్గతంగా వ్యతిరేకతను కనబరుస్తుందా..? అన్నది నియోజకవర్గంలో హాట్ టాపింగ్‌గా మారిందట. ఇంటి పోరును తట్టుకోగలిగితే.. ఆత్మకూరు మున్సిపాలిటీని సునాయసంగా చేజిక్కించుకోవచ్చు అనే భావన టిడిపి హార్డ్ కోర్ అనుచరగణం భావిస్తోందట.

ఆత్మకూరు మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు అధికార కూటమి ప్రభుత్వంతోపాటు ప్రతిపక్ష వైసిపి దీటైన అభ్యర్థులను రంగంలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయట. ప్రస్తుతం ఆశావహులుగా టిడిపి తరపున, ఆత్మకూరు మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. గుర్తింపు తెచ్చుకున్న కంచి పరమేశ్వర్ రెడ్డి భార్య కంచి జయమ్మ.. మంత్రి రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యా రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందట.

వైసీపీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన దివంగత ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కోడలు డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం మెండుగా ఉందట. రెండో అభ్యర్థిగా వైద్య వృత్తిలో కొనసాగుతూ అందరికీ సుపరిచితుడైన డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య సతీమణి చిల్లూరు మంజుషా పేరు తెరపైకి వచ్చిందట. సేవాకార్యక్రమాలతో గుర్తింపు పొందిన కంచి పరమేశ్వర్ రెడ్డి సతీమణి పోటీలో ఉంటే డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర్ రామిరెడ్డి కోడలు డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా గట్టి పోటీ ఇవ్వగలరని ఆత్మకూరులో ప్రచారం జరుగుతోందట.

అయితే కంచి పరమేశ్వర్ రెడ్డి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఇష్టపడటం లేదట. మరోవైపు కూటమి నుంచి, బిజెపి నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి సతీమణి లేదా జనసేన నుంచి నియోజకవర్గ కన్వీనర్ నలిశెట్టి శ్రీధర్ సతీమణి అభ్యర్థిగా పేరు ప్రచారంలో ఉందట. ఏదేమైనప్పటికీ ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు ఈసారి మంత్రికి పెను సవాల్‌తోపాటు రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు వైసిపి తీవ్రస్థాయిలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్