Off The Record: బాన్సువాడలో హత్యా రాజకీయాలు!
Off The Record: కామారెడ్డి జిల్లా వర్ని మండలం మాజీ సర్పంచ్ వెంకట్ హత్యతో తీవ్ర ఉద్రిక్తత. భూతగాదాలా? రాజకీయ కక్షలా? పోచారం, బాజిరెడ్డి వర్గాల ఆరోపణలు-ప్రత్యారోపణలు.
Off The Record: బాన్సువాడలో హత్యా రాజకీయాలు!
Off The Record: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో పెరిగిన పొలిటికల్ హీట్.. ఓ మాజీ సర్పంచ్ హత్యతో పీక్స్‌కు చేరింది. కామారెడ్డి జిల్లా వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటేశ్ అలియాస్ వెంకన్న ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. వెంకన్న తలపై మాజీ ఎంపీటీసీ నారాయణ గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా కొట్టి హత్య చేశాడని ఆరోపణలు వస్తున్నాయి.
అయితే వెంకట్, నారాయణ మధ్య కొంత కాలంగా రాజకీయ కక్షలతోపాటు భూతగదాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలో నారాయణ తన వ్యవసాయ పొలం వద్దకు వెంకట్‌ను పిలిపించి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడని చెబుతున్నారు. అనంతరం పక్కనే ఉన్న కాలువలో మృతదేహాన్ని పడేసి.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
హత్యకు గురైన వెంకట్.. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడు. ఫలితంగా.. ఈ హత్య రాజకీయ రంగు పులుపుకుంది. తమ నాయకుడి ప్రధాన అనుచరుడిని రాజకీయ కక్షతోనే హత్య చేశారంటూ.. పోచారం తనయుడు మాజీ డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి ఆరోపించడంతో హత్య కేసు కొత్త మలుపు తిరిగింది.
బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కలిసి హత్య చేయించారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతటితోఆగక వర్నిలో రాస్తారోకో నిర్వహించి.. ఆ ఇద్దరు నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీంతో బాన్సువాడలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
అయితే పోలీసులు మాత్రం.. తగిలేపల్లి మాజీ సర్పంచ్ హత్యకు భూతగాదాలే కారణమని తేల్చారు. హత్య చేసిన నిందితుడు కూడా పోలీసులకు లొంగిపోయాడు. కానీ ఎమ్మెల్యే పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది.
ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యేల అనుచరులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలతో బాన్సువాడలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి.. పోచారంపై తీవ్ర స్దాయిలో ధ్వజమెత్తారు. బాన్సువాడలో బీఆర్ఎస్‌కు ఆదరణ పెరగడంతో అభద్రతా భావంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. హత్య చేసిన మాజీ ఎంపీటీసీ బక్క నారాయణ పోచారం కుమారుడి అనుచరుడు అంటూ బాంబు పేల్చారు.
హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అని విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ నేతలు చంపుకుంటే బాజిరెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. సిగ్గులేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని, శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి అనుచురులు సైతం పోచారంపై విమర్శలు గుప్పించారు.
మాజీ సర్పంచ్ వెంకట్ హత్యోదంతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భూతగాదాలతో హత్య చేసినట్లు.. నిందితుడు పోలీసులకు లొంగిపోగా.. అధికార పార్టీ నేత చేసిన సంచలన ఆరోపణలు, మాజీ ఎమ్మెల్యేల ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఇంతకీ వెంకన్నను హత్య చేసిందెవరు..? ఈ వ్యవహారంపై పోలీసులు ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.




