Off The Record: బాపట్ల టీడీపీలో ఆధిపత్య పోరు!
Off The Record: బాపట్లలో టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య వర్గపోరు. ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మల మధ్య సూర్యలంక బీచ్ వివాదం.
Off The Record: బాపట్ల టీడీపీలో ఆధిపత్య పోరు!
Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో సముద్ర తీరం. ప్రస్తుత కొత్త జిల్లా బాపట్ల కేంద్రం. ఇక్కడ 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ.. ఎమ్మెల్యే గెలుపొందారు. ఇద్దరూ తొలిసారి చట్ట సభల్లో అడుగు పెట్టారు. బాపట్ల ఎమ్మెల్యేగా వేగేశ్న నరేంద్రవర్మ, బాపట్ల ఎంపీగా తెన్నేటి కృష్ణప్రసాద్ ఘన విజయం సాధించారు. గెలిచిన తరువాత ఇద్దరూ కలిసిమెలిసి పని చేసుకుంటూ కనిపించారు. అదే స్ఫూర్తితో ఇద్దరు కలిసి జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారని అందరూ భావించారు. అయితే.. అక్కడే సీన్ రివర్స్ అయింది. కొద్ది నెలల్లోనే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది. బాపట్ల జిల్లా కేంద్రం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే నరేంద్రవర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తేల్చి చెప్పారట.
అక్కడ నుంచి కొత్త పోరు మొదలైందట. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో కొంతమంది రియల్టర్లు ఎంపీ కృష్ణప్రసాద్ వద్దకు వెళ్లడంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలు అయినట్లు టాక్ వినిపిస్తోంది. తర్వాత ఇద్దరి మధ్య ఇసుక, బుసక తవ్వకాల వ్యవహారంలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు కోనసాగుతోంది. లిక్కర్ షాపుల వ్యవహారంలో కూడా ఇదే తంతు కంటిన్యూ అవుతోంది. బాపట్ల టీడీపీలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలుగా వేరు కుంపట్లు మొదలయ్యాని ప్రచారం సాగుతోంది. ఇద్దరు నేతల మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోందట. తాజాగా సూర్యలంక బీచ్‌లో స్వదేశీ దర్శన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సుమారు వందకోట్ల నిధులు మంజూరు చేసింది.
ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న వేళ.. ఈ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది. బీచ్ టూరిజం అభివృద్ధి కోసం వచ్చిన నిధులతో సూర్యలంకలో పెద్దఎత్తున నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బీచ్‌లో జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలించారు. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు.. తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా మరింత వేడిని రగిలించాయట. ఎంపీ పర్యాటకుల కోసం నిర్మాణం జరుగుతున్న టాయిలెట్లు, రెస్ట్ రూంలను తొలగించాలని అధికారులకు హుకుం జారీ చేసినట్లు తనకు తెలిసిందంటూ ఎమ్మెల్యే నరేంద్రవర్మ వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణాలు చేస్తుంటే తొలగించాలని చెప్పడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీచ్‌లో హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, హోటల్ ముందు టాయిలెట్లు ఉంటే బాగోదన్న ఉద్దేశంతో అధికారులకు ఇలా చెప్పించి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలతో చేస్తున్న నిర్మాణాలను తొలగించాలంటే తాను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తేల్చి చెబుతున్నారు. అయితే, ఈ వ్యవహారంలో హోటల్ మేనేజ్‌మెంట్‌కు ఎంపీ అనుకూలంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నారని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అందుకే ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కామెంట్స్‌తో బాపట్లలో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.
హోటల్ యాజమాన్యానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడానికి ముందే టూరిజం అధికారులు నిర్మాణాలు మొదలుపెట్టారంటున్నారు. ఒకవేళ హోటల్ యాజమాన్యం ఇష్టపడకపోతే అదే ప్రాంతంలో హోటల్ నిర్మించేందుకు అనేకమంది సిద్దంగా ఉన్నారంటూ మాట్లాడారు. దీంతో, ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే తాను తగ్గేదే లేదన్నట్లుగా హింట్ ఇచ్చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో.. ఇక ఇప్పుడు ఎంపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది చర్చ జరుగుతోంది. వీరిద్దరి వ్యవహారం పార్టీ హైకమాండ్‌కు చేరిందట. దీంతో... ఈ పరిణామం.. స్థానిక సంస్థల వేళ ఎలాంటి ప్రభావం చూపనుంది..? పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.




