OFF THE RECORD: ఎమ్మెల్యే పై గుసగుసలు.. అనుచరులదే పెత్తనమా?

OFF THE RECORD: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్థానికంగా అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Nov 2026 7:48 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: ఎమ్మెల్యే పై గుసగుసలు.. అనుచరులదే పెత్తనమా?

OFF THE RECORD: ప్రజలు ఎవరిని గెలిపించుకుంటే వారు ప్రజా సమస్యల కోసం పాటుపడాలి. వారి సమస్యలు తీర్చాలి. కానీ బెల్లంపల్లి నియోజకవర్గంలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఒకరైతే.. క్షేత్రస్థాయిలో పెత్తనం చెలాయిస్తున్న నాయకులు మరికొందరనే ఆరోపణలున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గంలో స్థానికంగా అందుబాటులో ఉండటం లేదన్న అపవాదు లేకపోలేదు.

నియోజకవర్గ ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాల్సిన ప్రజాప్రతినిధి అందుబాటులో లేకపోతే ఆ లోటును ఎవరు భర్తీ చేయాలి..? ప్రజల సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే అందుబాటులో లేని పరిస్థితిని కొందరు అనుచరులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారట.

నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒకరిద్దరు నాయకులు తమదే అధికారం అన్నటుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ రీసౌండ్ చేస్తోంది. అధికారులతో మాట్లాడాలన్నా, ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగాలన్నా.. చివరకు చిన్న పాటి ప్రజా సమస్య పరిష్కారం కావాలన్నా కొందరు నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా ప్రతినిధికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన అనుచరులు.. తామే మరో ప్రజా ప్రతినిధులమన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నియోజకవర్గంలో చిన్న చిన్న సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకుని కొందరు సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని పనులు చక్కబెట్టుకోవడం అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, తమ మాటే చెల్లాలన్న ధోరణితో వ్యవహరించడం వంటి ఆరోపణలు వివాదాలకు కారణమవుతున్నాయి.

ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను పక్కనపెట్టి, పెత్తనం చెలాయించడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అందుబాటులో లేకపోవడం ఒక సమస్య అయితే.. ఆయన పేరుతో కొందరు అనుచరులు పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు మరో సమస్యగా మారుతున్నాయి.

ప్రజలు కోరుకుంటున్నది ఒక్కటే.. తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలి. పనుల కోసం నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు. బెల్లంపల్లిలో ప్రజాప్రతినిధి పాలన సాగుతోందా..? లేక అనధికార సామంతరాజ్యాలు నడుస్తున్నాయా..? అన్న ప్రశ్నలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు రాజకీయ పరిశీలకులు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్