Off The Record: భీమిలి వైసీపీ కొత్త బాస్ ఎవరు!

Off The Record: భీమిలి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ రేసులో గండ్రెడ్డి శ్రీనివాస్. చిన్న శ్రీను రాజీనామాతో కొత్త నాయకత్వంపై జగన్ ఫోకస్, అవంతి రీఎంట్రీపై ఊహాగానాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Sept 2026 7:37 AM IST
Off The Record
X

Off The Record: భీమిలి వైసీపీ కొత్త బాస్ ఎవరు!

Off The Record: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. మొదటి నుంచీ ఈ నియోజకవర్గంగా టీడీపీ కంచుకోట. కానీ 2019లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేవ్‌ వీచింది. 2024లో మళ్లీ టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో భీమిలీ సెగ్మెంట్ ఫ్యాన్ పార్టీకి అంతగా అచ్చిరావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈలోగా ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండగా.. భీమిలి వైసీపీ చీఫ్ మజ్జి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేయడంతో ఈ సెంటిమెంట్‌కు బలం చేకూరినట్టయ్యింది. కాపు సామాజికవర్గం ఈక్వేషన్స్‌తో ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్దదిక్కుగా భావించే సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుకు భీమిలి పార్టీ పగ్గాలు అప్పజెప్పింది ఆ పార్టీ అధిష్టానం. అయితే చిన్న శ్రీను అనూహ్యంగా జగన్‌కు హ్యాండిచ్చి సైకిల్ ఎక్కేశారు.

మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వైసీపీకి, భీమిలి సమన్వయకర్త పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఆ నియోజకవర్గ పగ్గాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో యువనేత గండ్రెడ్డి శ్రీనివాస్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, అధిష్ఠానం ఇతర ప్రత్యామ్నాయాలపై కూడా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. భీమిలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. చిన్న శ్రీను నిష్క్రమణ తర్వాత నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దేందుకు మెజారిటీ స్థానిక నేతలు గండ్రెడ్డి శ్రీనివాస్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. భీమిలిలో టీడీపీ తరఫున బలమైన నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావును ఢీకొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కొత్త వ్యూహంతో, నమ్మకస్తుడైన ఒక యువ నాయకుడిని ఇన్‌చార్జ్‌గా దించే యోచనలో ఉన్నట్లు కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల క్రమంలో గండ్రెడ్డి శ్రీనివాస్ పేరు దాదాపూ ఖరారవుతుందేమోనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ భీమిలి ప్రాంతంలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో అక్కడ బలమైన కూటమి నేతలను ఢీకొట్టే క్రమంలో వైసీపీ అధిష్టానం గండ్రెడ్డి శ్రీనివాస్ వైపు మొగ్గు చూపనుందన్నఆసక్తికర చర్చ నడుస్తోంది.

భీమిలి వైసీపీ కొత్త నాయకత్వం కోసం పార్టీ అధిష్టానం కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ బాధ్యతలను సీనియర్ నాయకులు గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, కేకే రాజులకు అప్పజెప్పింది. బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారంపై ఇంతవరకు వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే స్థానిక యువకుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి, సర్పంచ్‌గా అనుభవం ఉన్న వ్యక్తి గండ్రెడ్డి శ్రీనివాస్ పేరు ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో రీసౌండ్ చేస్తోంది. తూర్పు కాపు సామాజిక వర్గం, బలమైన ఆర్థిక వ్యవస్థ, తండ్రి రాజకీయ అనుభవం గండ్రెడ్డి శ్రీనుకు కలిసి వచ్చే అంశాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. చాలా కాలంగా భీమిలిలో స్థానిక నాయకత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ఉంది. 3.66 లక్షల జనాభా ఉన్న భీమిలిలో కాపు, యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఈ ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఇంచార్జ్ నియమాకం జరిగితే వచ్చే ఎన్నికలకు రెడీ కాగలమన్న అభిప్రాయం దాదాపూ అందరు నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఆ దిశగా అధిష్టానానికి ఓ నివేదిక కూడా ఇవ్వనున్నారట. ఈ లెక్కలు పక్కాగా కుదిరితే గండ్రెడ్డి శ్రీనివాస్ జాక్ పాట్ కొట్టడం ఖాయమంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్.

మరోవైపు వైసీపీలోకి అవంతి శ్రీనివాస్ రీఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. అసలే భీమిలి ఇంచార్జ్ పోస్ట్ వైసీపీకి కలిసి రావడంలేదు. 2014లో కర్రి సీతారాం ఓటమి తర్వాత పార్టీని వీడి వెళ్లారు. 2019 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ ఓడిపోగానే పార్టీకి రాజీనామా చేశారు. మధ్యలో కొంతమంది నాయకులు వచ్చినా మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. దీంతో రాబోయే రోజుల్లో భీమిలి వైసీపీకి బలమైన నాయకత్వం అవసరమన్న వాదన బలంగానే వినిపిస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయకుమార్ తదితరులు స్థానిక కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం త్వరలోనే అధికారికంగా భీమిలి కొత్త ఇన్‌చార్జ్ పేరును ప్రకటించనుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్