Burning Topic: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు.. భోజ్‌శాలా ఆలయం హిందువులదే
Burning Topic: మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్‌శాలా (Bhojshala) వివాదంపై సంచలన తీర్పు వెలువరించింది.
Burning Topic: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు.. భోజ్‌శాలా ఆలయం హిందువులదే
Burning Topic: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రిక స్థల వివాదంలో సంచలన తీర్పు వచ్చింది. భోజ్‌శాల కాంప్లెక్స్ హిందూ ఆలయానికే చెందుతుందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇందౌర్ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కట్టడం సరస్వతి దేవి ఆలయమేనని తేల్చింది. ముస్లింలు వాదిస్తున్నట్టు అక్కడ మొదటి నుంచీ మసీదు లేదని వెల్లడించింది.
భోజ్‌శాలలో హిందువులు, ముస్లింలు వేర్వేరు వారాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ 2003 ఏప్రిల్ 7న భారత పురావస్తు విభాగం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. అక్కడ సరస్వతీ దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ప్రకటించింది. పురావస్తు శాఖ భోజ్‌శాల కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకొని భక్తులకు తగిన వసతులు కల్పించాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా, జస్టిస్ అలోక్ అవస్థిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో భోజ్‌శాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయమేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో హిందూ భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వందలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. హనుమాన్ చాలీసా పఠిస్తూ, దేవికి హారతి సమర్పించారు. తమ న్యాయపోరాటం ఫలించడంతో భక్తులు ఆనందభాష్పాలతో నృత్యాలు చేశారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతిరోజూ పూజలు చేసుకునే అవకాశం దక్కిందని వారు హర్షం వ్యక్తం చేశారు. లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకురావడమే తమ తదుపరి లక్ష్యమని ఉత్సవ సమితి సభ్యులు ప్రకటించారు. మరోవైపు న్యాయస్థానం తీర్పును స్వాగతించారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. భోజ్‌శాలను సామరస్య పూర్వకంగా పరిష్కారమైన అయోధ్య అంశంతో పోల్చారాయన.
కోర్టు తీర్పు నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ధార్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భోజ్‌శాల కాంప్లెక్స్ పరిసరాల్లో దాదాపు 1,200 మంది పోలీసులను మోహరించారు. వివాదాస్పద ప్రదేశాల్లో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని స్థానిక ముస్లిం ప్రముఖఉలు తెలిపారు. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దుచేస్తుందనే నమ్మకం ఉన్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. . భోజ్‌శాల మసీదు 700 ఏళ్లుగా అధికారిక రికార్డుల్లో ఉందని తెలిపారు. 1935లో ధార్ రాష్ట్ర గెజిట్‌లోనూ అది మసీదుగానే ఉందన్నారు.




