Big Story: భూటాన్‌లో వరద బీభత్సం.. ఉప్పొంగిన షింటాపు సరస్సు!

Big Story: భూటాన్‌లోని షింటాఫు హిమానీనద సరస్సు విస్ఫోటనం చెందడంతో మోచు నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో పశ్చిమ బెంగాల్, అస్సాం సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2026 12:59 PM IST
Big Story
X

Big Story: భూటాన్‌లో వరద బీభత్సం.. ఉప్పొంగిన షింటాపు సరస్సు!

Big Story: భూటాన్‌లోని గాసా జిల్లాలో ఉన్న షింటాఫు హిమానీనద సరస్సు అకస్మాత్తుగా విస్ఫోటనం చెందింది. అక్టోబరు 29 రాత్రి ఈ విస్ఫోటనం జరిగింది. ఈ ఈ విస్ఫోటనం కారణంగా దాదాపు 7.4 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఒక్కసారిగా మోచు నదిలోకి విడుదలయ్యింది. ఇది దిగువన ఉన్న నదులలో నీటి మట్టాన్ని తీవ్రంగా పెంచింది. అంతేకాదు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు కూడా డేంజర్ జోన్ లో చిక్కుకున్నాయి.

షింటాఫు హిమానీనద సరస్సు విస్ఫోటనం కారణంగా భూటాన్ కు తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడి ప్రసిద్ధ సహజ వేడినీటి బుగ్గలు అలాగే వాటి పర్యాటక సదుపాయాలు ఈ వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోయాయి.

అంతేకాదు భూటాన్ లో రవాణా వ్యవస్థకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. లయా గ్రామానికి వెళ్లే రహదారిలోని కొంత భాగం కొట్టుకుపోయింది. అంతేకాదు, పునాఖా-గాసా హైవేపైకి భారీగా శిథిలాలు చేరాయి. దీంతో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. కాగా మోచు నదిపై ఉన్న రెండు బెయిలీ వంతెనలు కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.

అయితే విస్ఫోటనం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇదొక చెప్పుకోదగ్గ విశేషం. కాగా విస్ఫోటనం జరిగే అవకాశాలున్నాయని సైంటిస్టులు ముందుగానే హెచ్చరించారు. దీంతో ముందస్తు చర్యగా భూటాన్ ప్రభుత్వం హెచ్చరిక సైరన్లు మోగించింది. అంతేకాదు...ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించింది. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని భూటాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా భూటాన్ విస్పోటనం నేపథ్యంలో భారతదేశంలో హై అలర్ట్ నెలకొంది. భూటాన్ లోని మోచు నది పునాఖా వద్ద ఫోచు నదితో కలిసి పునత్సాంగ్‌చ్చు గా మారుతుంది. ఈ నదినే భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత సంకోష్ నదిగా పిలుస్తారు. కాగా సంకోష్ నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్, జల్‌పైగురి, డార్జిలింగ్ జిల్లాలతో పాటు అస్సాంలోని ధుబ్రి జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పరిధిలోని సంకోష్ నది పరివాహక ప్రాంతాల నుంచి దాదాపు 10,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అలాగే సహాయక శిబిరాలకు తరలించారు. అంతేకాదు ప్రమాదం పొంచి ఉండటంతో రంగంలోకి విపత్తు బృందాలు దిగాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సరిహద్దు జిల్లాల్లో మోహరించారు.

హిమానీనద సరస్సు విస్ఫోటనం అంటే ఏమిటో చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లోని మంచు పర్వతాలు వేగంగా కరిగి, వాటి దిగువన సహజసిద్ధమైన మట్టి, రాళ్లతో కూడిన ఆనకట్టల వెనుక పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడతాయి. నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు లేదా భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాల వల్ల ఆ సహజ ఆనకట్టలు ఒక్కసారిగా బద్దలవుతాయి.

ఫలితంగా , సరస్సులోని నీరంతా ఉధృతంగా దిగువకు దూసుకువస్తుంది. దీనినే వాడుక భాషలో విస్పోటనం అంటారు. సాంకేతిక పరిభాషలో గ్లేసియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్ అంటారు. ఇదిలా ఉంటే భూటాన్ జాతీయ హైడ్రాలజీ అండ్ మెటియోరాలజీ సెంటర్ ప్రకారం, ఆ దేశంలో ప్రమాదకరంగా మారే అవకాశం 17 హిమానీనద సరస్సులకు ఉంది. వీటిలో 'షింటాఫు' సరస్సు కూడా ఒకటి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్