Burning Topic: చెప్పి మరీ కోలుకోలేని దెబ్బ కొట్టిన చద్దా.. కుప్పకులుతున్న ఆప్ పార్టీ..!

Burning Topic: ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్! రాఘవ్ చద్దాతో పాటు ఆరుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 April 2026 7:43 AM IST
Burning Topic
X

Burning Topic: చెప్పి మరీ కోలుకోలేని దెబ్బ కొట్టిన చద్దా.. కుప్పకులుతున్న ఆప్ పార్టీ..!

Burning Topic: రాజ్యసభలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఉన్న మొత్తం 10 మంది ఎంపీలలో ఏడుగురు గుడ్‌ బై చెప్పారు. ముఖ్యంగా పార్టీలో అత్యంత ప్రభావవంతమైన యువ నేత, వ్యూహకర్తగా పేరున్న రాఘవ్ చద్దా ఆప్‌కు గుడ్‌బై చెప్పి భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాఘవ్ చద్దా నేతృత్వంలో సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ తదితర ఆప్ రాజ్యసభ సభ్యుల బృందం బీజేపీలో విలీనమైంది. ఇందులో పంజాబ్ నుంచి ఆరుగురు ఢిల్లీ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. వీరంతా కలిసి తమ సంతకాలతో కూడిన పత్రాలను రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు. ఈ పరిణామంతో రాజ్యసభలో ఆప్ బలం పడిపోవడమే కాకుండా వచ్చే ఏడాది జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కోలుకోలేని దెబ్బ తగిలింది. పంజాబ్‌లోని 92 మంది ఆప్ ఎమ్మెల్యేలపై చద్దా రాజీనామా వ్యవహారం ప్రభావం చూపే అవకాశం ఉంది. పైగా పంజాబ్ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, వెంటనే ప్రభుత్వం పడిపోయేంత తిరుగుబాటు ఎమ్మెల్యేలలో లేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీలో చేరిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీపై రాఘవ్ చద్దా సంచలన కామెంట్స్ చేశారు. ఆప్ సరైన దారిలో వెళ్లడం మర్చిపోయిందని సెటైర్లు వేశారు. దీనిపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. బీజేపీ మరోసారి తన కుట్రను అమలు చేసిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. వీరి పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నప్పికీ.. రాఘవ్ చద్దా ఆమ్‌ ఆద్మీని వీడటానికి కొన్ని కారణాలు లేకపోలేదు. ఆప్‌లో పెరుగుతున్న అంతర్గత అసమ్మతికి తోడు పార్టీ వ్యవస్థాపక విలువలకు చరమ గీతం పాడటమేననీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ నిర్ణయాధికారాలన్నీ కేవలం కేజ్రీవాల్ చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నాయన్న అంతర్గత విమర్శలు ఉండనే ఉన్నాయి. కేజ్రీవాల్ నాయకత్వంలో క్రమశిక్షణ ఉన్నప్పటికీ, అది ఇతర నేతలు ఎదగకుండా అడ్డుకట్ట వేసిందనే వాదన కూడా ఉంది. ఈ విధానమే స్వయంప్రతిపత్తి కోరుకునే నేతలు పార్టీకి దూరమవుతున్నారన్న చర్చ జోరందుకుంది.

కొన్ని నెలలుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వానికి, రాఘవ్‌ చద్దాకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో చద్దా కీలక పాత్ర పోషించినప్పటికీ, ఇటీవల కాలంలో ఆయనను పక్కన పెట్టారు. చద్దాకు పంజాబ్ ప్రభుత్వం కల్పించిన Z+ భద్రతను ఉపసంహరించుకోవడం ఈ విభేదాలకు కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలో తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. చద్దాకు Z కేటగిరి భద్రత కల్పించింది. అప్పుడే చద్దా.. బీజేపీ వైపు వెళ్తున్నారే ఊహాగానాలు వెల్లువెత్తాయి. పార్టీ నెలకొల్పిన అనతికాలంలోనే జాతీయ హోదా పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇలా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ పార్టీ అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. అయితే గతంలో కూడా పార్టీ పలు సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ, చద్దా నిష్క్రమణ మాత్రం అందుకు భిన్నమైనదిగా అభివర్ణిస్తున్నారు రాజకీయ పండితులు. ఇది కేవలం ఒక నేత వెళ్లడం మాత్రమే కాదు.. ఆ పార్టీ క్లీన్ ఇమేజ్‌పైనే దాడిగా విశ్లేషిస్తున్నారు. చద్దా తిరుగుబాటుతోనైనా గుణపాఠం నేర్చుకుని.. బలమైన నాయకులను తయారు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆప్ తన జాతీయ హోదాను కోల్పోవాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చద్దా అండ్ టీమ్ తిరుగుబాటుతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలు మరోసారి చర్చకు దారితీశాయి. ఈక్రమంలో ఒక పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికై.. ఆ తర్వాత మరో రాజకీయపార్టీలోకి మారే సమయంలో అప్పటి వరకూ ఉన్న పదవులను వదులుకోవాలా..? అనేది ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగులుతోంది. పార్టీ ఎంపీల్లో చీలిక వర్గానికి 2/3 వంతు మెజార్టీ ఉంటే నేరుగా మరో రాజకీయ పక్షంలో విలీనం కావచ్చా..? లేదంటే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా గెలిచి రావాలా..? అన్నది చర్చనీయాంశంగానే మిగిలింది.

2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీడీపీ ఓడిపోయాక.. సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో విలీనం అయ్యారు. ఇప్పుడు ఆ మార్గంలోనే ఆప్ ఎంపీలు ఏడుగురు బీజేపీ గూటికి చేరారు. అయితే ఆనాడు టీడీపీకున్న అయిదుగురు రాజ్యసభ సభ్యుల్లో కనకమేడల రవీంద్రకుమార్‌ మినహా మిగతా నలుగురూ ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ పేరా 4(2)లోని నిబంధనలను అనుసరించి బీజేపీలో విలీనమయ్యారు. సభలో పార్టీకున్న మొత్తం సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు కలిసి వేరే పార్టీలో చేరడానికి సిద్ధమైనప్పుడు దాన్ని విలీనంగా పరిగణించాలన్న వాదన కూడా లేకపోలేదు. ఇదే వాదనకు అనుగుణంగా చద్దా అండ్ టీమ్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీకి చెందిన మొత్తం 10 మంది రాజ్యసభ్యుల్లో ఏడుగురు తిరుగుబాటు చేశారు. రెండింట మూడో వంతు సభ్యులు బీజేపీలో చేరుతుండటంవల్ల వారికి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదంటున్నారు. ఇలా రాఘవ్ చద్దా రాజకీయ చతురత జాతీయ రాజకీయాల్లో హాట్‌ టాపికైంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story