Off The Record: యువరక్తానికి స్వాగతం పలుకుతున్న బీజేపీ
Off The Record: తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు! సీనియర్ నేతలకు గవర్నర్ పదవులు ఇస్తూ, పార్టీలో యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలని అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు.
Off The Record: యువరక్తానికి స్వాగతం పలుకుతున్న బీజేపీ
Off The Record: తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇన్‌సైడ్ ఆపరేషన్ నడుస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లు పార్టీని భుజాన మోసిన సీనియర్ నేతలకు గౌరవప్రదమైన ఎగ్జిట్ ప్లాన్ రెడీ అయిందట. పెద్దలను దించకుండా.. చిన్నవాళ్లను ఎక్కించలేమన్న ఫార్ములాతో ఢిల్లీ పెద్దలు ముందుకెళ్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక సీనియర్ నేతలకు గవర్నర్ పోస్టులు ఫిక్స్ అయినట్టు ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం పదవి ఇవ్వడం మాత్రమే కాదు.. పార్టీలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్నాళ్లు టీబీజేపీలో ఈ గ్రూప్.. ఆ గ్రూప్ అంటూ నడిచిన అంతర్గత పోరుకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటోందట అధిష్టానం. ఒకరిని కాదంటే ఇంకొకరు అలిగే పరిస్థితి రావడంతో.. పాము చచ్చినా కర్ర విరగకూడదు అన్నట్టుగా ఢిల్లీ పెద్దలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారట. సీనియర్లను అవమానించకుండా.. రాజ్‌భవన్ దారి పట్టిస్తూ.. తెలంగాణలో కొత్త టీమ్‌కు ఫ్రీహ్యాండ్ ఇవ్వాలన్నదే అసలు ప్లాన్ అంటున్నారు. పాత కత్తికి పదును తగ్గినా.. విలువ తగ్గదు అన్నట్టుగా అనుభవాన్ని ఒకవైపు వాడుకుంటూనే.. మరోవైపు యువరక్తానికి పవర్ ఇవ్వాలని కమలం పార్టీ భావిస్తోందట.
ఇది కేవలం తెలంగాణ రాజకీయాలకు పరిమితమైన ఆపరేషన్ కాదన్న చర్చ ఇప్పుడు బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసిన జాతీయ స్థాయి మాస్టర్ ప్లాన్‌లో భాగమే అమిత్ షా మాస్టర్ స్కెచ్ అంటున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ఉండొచ్చన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ మార్పుల్లో తెలంగాణ నేతలకు పెద్దపీట వేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఇద్దరు నేతలకు ఢిల్లీలో కీలక పదవులు దక్కే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. గెలిపించే వారికే గద్దె అన్నట్టుగా.. ఎన్నికల్లో దూకుడుగా పనిచేసే నాయకులను ముందుకు తెచ్చేందుకు స్కెచ్ సిద్ధమైందట. మరోవైపు పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా తెలంగాణ యువ నాయకత్వానికి భారీ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎవరిని ఢిల్లీకి పిలవాలి..? ఎవరిని రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంచాలి..? ఎవరికి సంస్థాగత బాధ్యతలు ఇవ్వాలి..? అనే పూర్తి బ్లూప్రింట్ ఇప్పటికే రెడీ అయిపోయిందనే చర్చ కమలం పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. రాజకీయాల్లో టైమింగ్ కరెక్ట్ అయితే.. చిన్న నాయకుడే పెద్ద సెన్సేషన్ అవుతాడు అంటారు. ఇప్పుడు అదే ఫార్ములాతో తెలంగాణ బీజేపీని పరుగులు పెట్టించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట.
ఈ మొత్తం ఆపరేషన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్.. అమిత్ షా అనే చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో శత్రువు కనిపించడు... వ్యూహమే కనిపిస్తుంది అన్న స్టైల్లో తెలంగాణ కోసం ప్రత్యేక స్క్రిప్ట్ రెడీ చేశారట. ఆ స్క్రిప్ట్‌ను అమలు చేసే బాధ్యతను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌కు అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఢిల్లీ పెద్దలు.. పార్టీని పూర్తిగా రీడిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారట. కొత్త నాయకత్వం.. కొత్త టీమ్.. కొత్త దూకుడు.. ఇలా పూర్తిగా ఫ్రెష్ ఎనర్జీతో పార్టీని ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారట. గ్రౌండ్ లెవల్‌లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా యువ నేతలకు బాధ్యతలు అప్పగించే ప్లాన్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. సీనియర్లకు గౌరవం ఇవ్వకపోతే పార్టీకి నష్టం జరుగుతుందనే లెక్కతో.. వారిని గవర్నర్ పోస్టుల రూపంలో సంతృప్తి పరచాలని చూస్తున్నారట. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా ఇప్పటి నుంచే చెస్ గేమ్ స్టార్ట్ చేసిందనే చర్చ కమలం పార్టీలో కొనసాగుతోంది.




