Burning Topic: సీఎం డీకే శివకుమార్ కు బిగ్ షాక్?

Burning Topic: కర్ణాటక కొత్త సీఎం డీకే శివకుమార్ కి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలిందా? మంత్రుల రాజీనామాలతో ప్రభుత్వానికి వచ్చిన చిక్కేంటి?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2026 6:50 AM IST
Burning Topic
X

Burning Topic: సీఎం డీకే శివకుమార్ కు బిగ్ షాక్?

Burning Topic: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిద్ధరామయ్యను గద్దె దింపడంతో పాటు అధిష్టానంతో పోరాడి మరీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న డీకే శివకుమార్ ప్రభుత్వానికి ఆదిలోనే కుదుపు ఎదురైంది. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే డీకే మంత్రి వర్గంలో అసంతృప్తి మొదలైంది. తమకు కేటాయించిన శాఖల విషయంలో కొందరు సీనియర్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. తనకు ఇష్టం లేని శాఖను కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ రామలింగారెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యతల నుంచి వైదొలిగారు. నగరాభివృద్ధి శాఖ కేటాయిస్తానని హామీ ఇచ్చిన శివకుమార్ తనకు అవగాహన లేని నీటిపారుదల శాఖ ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఎదుట తన రాజీనామా లేఖపై సంతకం చేశారు రామలింగారెడ్డి. నాకు ఇది ఆమోదయోగ్యం కాదు. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను.. ఇక ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినా తీసుకోనని స్పష్టం చేశారు.

ఆ తర్వాత మరో మంత్రి కూడా కేటాయింపుల తీరుపై అలకబూనారు. మంత్రిత్వశాఖల అప్పగింత సమయంలో సీనియార్టీని పరిగణనలోకి తీసుకోలేదని మంత్రి కేహెచ్‌ మునియప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్‌ విస్తరణలో మునియప్పకు ఆహార, ప్రజా పంపిణీ శాఖను కేటాయించారు. అయితే ఆయన సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖ కోరుకున్నారు. ముఖ్యమంత్రి డీకేపై మునియప్ప విమర్శలు గుప్పించారు. ‘‘మంత్రిత్వశాఖ కేటాయింపుల్లో సీనియార్టీని పట్టించుకోలేదు. రామలింగారెడ్డి, నేను ఎనిమిది సార్లు గెలిచాం. ఐదు కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతలూ ఉన్నారు. మాలాంటి వారికి సమన్యాయం జరగలేదు. రాహుల్‌ గాంధీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు సామాజిక సంక్షేమశాఖ ఇస్తే ప్రజలకు మరింత సేవ చేయగలనని, వ్యవసాయం ఇస్తే రైతుల ప్రయోజనాల కోసం పనిచేయగలనని చెప్పా.. అని గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణను మరోసారి సమీక్షించాని మునియప్ప డిమాండ్‌ చేశారు.

గతంలో కూడా రామలింగారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ పెద్దలు ఆయనను శాంతింపజేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే నాకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాని స్పష్టం చేశారు రామలింగారెడ్డి. కాగా శాఖల కేటాయింపు విషయంలో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ముఖ్యమంత్రి శివకుమార్ తెలిపారు. రామలింగారెడ్డి తన ఆప్తమిత్రుడిగా అభివర్ణించారు. ఆయనకు కేటాయించిన శాఖలో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, ఆయనకు వేరే శాఖ కావాలని చెప్పారు. నేను ఈ విషయం ఆయనతో చర్చించి ఒక పరిష్కారం కనుగొంటాను. ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదని తెలిపారు డీకే.

కర్ణాటకలో కాంగ్రెస్‌కు అత్యంత కీలక నాయకుడిగా భావించే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలన్న తన ఎన్నో ఏళ్ల ఆకాంక్షను జూన్ 3న నెరవేర్చుకున్నారు.అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సిద్ధరామయ్యను తప్పించి డీకేకు అప్పగించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద సాహసమే చేసింది. అయితే ఈ పదవి ఆయనకు పూలపాన్పు కాదు. ఒక విధంగా ముళ్ల కిరీటంగానే చెప్పాలి. కర్ణాటకలో నాయకత్వ మార్పును కాంగ్రెస్‌ చాలా జాగ్రత్తగా చేసింది. 2028లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక భావన క్రమంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన శివకుమార్ బీజేపీ, జేడీఎస్ కూటమిని బలంగా ఎదుర్కోగలరని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. సాధారణంగా కర్ణాటకలో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. 35 ఏళ్ల ఈ రాజకీయ సంప్రదాయాన్ని కాంగ్రెస్, శివకుమార్ సరైన వ్యూహంతో ముందుకు సాగితే చెరిపివేసే అవకాశం ఉంది.

డీకే శివకుమార్‌ నేతృత్వంపై కాంగ్రెస్‌లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయనను క్రమశిక్షణ గల, కష్టపడి పనిచేసే నాయకుడిగా పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల కేంద్ర నాయకత్వం నుంచి ఆయనకు బలమైన మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలనలో స్థిరత్వం తీసుకురావడంతో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించగలరన్న ఆశాభావం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. 2028లో జరగనున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మధ్యకాలంలో నాయకత్వ మార్పు ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. శివకుమార్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా రాష్ట్రంలో పార్టీని నిలబెట్టగల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నిర్ణయం విజయవంతమైతే కాంగ్రెస్‌కు బలం, విఫలమైతే పెద్ద రాజకీయ రిస్క్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

కాగా సిద్దరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిండం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య చెందిన కురుబా సామాజిక వర్గంలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయన్ని తప్పించడంతో ‘అహింద’ ఓటుబ్యాంకు దూరం కాకుండా జాగ్రత్తపడుతూ, ఒక్కలిగలను కాంగ్రెస్‌ వైపు తీసుకురావడం ఇక సిద్ధరామయ్య రాజ్యసభ ఆఫర్‌ను తిరస్కరించి రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకోవడం శివకుమార్‌కు ఆందోళన కలిగించే అంశం. ఆయన సిద్దరామయ్యతో కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే సమయంలో బీజేపీ ఓబీసీ అంశాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ దళితులు, ఆదివాసీలు, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్‌కు సాంప్రదాయ మద్దతుగా కొనసాగుతాయని పార్టీ ఆశిస్తోంది. రామలింగారెడ్డి రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్‌లో విభేదాలు మరింత పెరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story