Off The Record: సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్?

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్రపక్షాల నుండి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 May 2026 6:37 AM IST
Off The Record
X

Off The Record: సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్?

Off The Record: తెలంగాణ తెచ్చిన పార్టీగా కాంగ్రెస్‌.. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా గత అసెంబ్లీ ఎన్నికల వేళ సీపీఐ, జనసమితితో జత కట్టింది. అనుకున్నట్టే.. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర పీఠాన్ని అధిరోహించింది. అలా అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ, జన సమితి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొదట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 65 సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ అధిష్టించారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల జయ, అపజయాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిపిఐకి 2 ఎమ్మెల్సీలు, 5 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని ఎన్నికల ముందు ఆ పార్టీ హామీ ఇచ్చింది. జనసమితికి 2 ఎమ్మెల్సీలు, 3 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామనీ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు సిపిఐ, జనసమితికి చెరోక ఎమ్మెల్సీ ఇచ్చి.. అధికార కాంగ్రెస్ చేతులు దులుపుకుందన్న అపవాదు లేకపోలేదు. అయితే మొదటివిడత కార్పొరేషన్ చైర్మన్లలో 2 మిత్రపక్ష పార్టీలకు ఎవరికీ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా కేటయించలేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. కనీసం రెండో విడత కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికలో అయిన తమకు అవకాశం కల్పించాలంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తోపాటు సీఎం రేవంత్ రెడ్డినీ కోరుతున్నారు మిత్రపక్ష పార్టీల నేతలు.

అయితే రీసెంట్‌గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సిపిఐ కోరిన సీట్లు ఇవ్వకపోవడంతో ఖమ్మం, క్యాతనపల్లిలో కామ్రేడ్లు విడిగా పోటీ చేశారు. అందులో ఖమ్మంలో సీపీఐ ఒంటరిగా పోటీ చేసింది. క్యాతనపల్లిలో brsతో జతకలిసి పోటీ చేసింది. దానితో ఖమ్మంలో మేయర్‌, క్యాతనపల్లెలో డిప్యూటీ మేయర్‌ కుర్చీని సీపీఐ దక్కించుకోగలిగింది. దానితో ఇక పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటించకపోతే భవిష్యత్ ఇలాగే ఉంటుందని ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ద్వారా హెచ్చరించింది. భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పాటించకపోతే ఇదే సీన్ రిపీట్ అవుతుందని ఇప్పటికే హెచ్చరించింది. ఇక మరొక మిత్రపక్షం జనసమితి. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు కావస్తోంది కానీ తమకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్న అసంతృప్తి ఆ పార్టీలో సుస్పష్టంగా కనిపిస్తోంది. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలను కోరుతున్నారు జనసమితి నేతలు.

ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వచ్చే ఎలక్షన్లో రెండు కూటములు ఉంటాయంటూ బహిరంగ సభలో ప్రకటిస్తున్నారు. అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ సీపీఐ. జనసమితి కూటమి కాగా.. రెండోది బీజేపీ, brs కూటమి అంటూ సీఎం కుండబద్ధలు కొడుతున్నారు. అయితే ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదూ.. మళ్ళీ మీతో కలిసి పోటీ చేయడమా.. అని సన్నిహితులతో అంటున్నారట సిపిఐ, జనసమితి నేతలు. చూడాలి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జత కలిసినట్టు కాంగ్రెస్, సీపీఐ, జనసమితి రాబోయే ఎన్నికల్లో కూడా కూటమిగా పోటీ చేస్తాయా..? లేదంటే ఎవరికి వారు యమునా తీరే చందనా పోటీ చేసి.. ప్రత్యర్థులుగా మిగిలిపోతారో.. కాలమే నిర్ణయించనుంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story