Off The Record: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్?

Off The Record: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చేందుకు బీజేపీ సరికొత్త వ్యూహం సిద్ధం చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 May 2026 6:41 AM IST
Off The Record
X

Off The Record: రేవంత్ రెడ్డికి బిగ్ షాక్?

Off The Record: కాలం మారితే గాలి మారుతుంది. గాలి మారితే రాజకీయాల రూటూ మారుతుందని అప్పట్లో అన్నారు పెద్దలు. ఇప్పుడు అదే ఫార్ములాతో తెలంగాణ బీజేపీ ఫుల్ యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. పోరాడితేనే పార్టీ బతుకుతుందన్న ఫార్ములాతో కమలం పార్టీ కొత్త ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటివరకు పెద్ద పెద్ద సభలు.. ఢిల్లీ నేతల టూర్లు.. సోషల్ మీడియా వార్‌లతో హడావిడి చేసిన బీజేపీ... ఇక గ్రామాల్లో గల్లీ స్థాయిలో పోరాటాలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ లో నేతలకు క్లియర్ మెసేజ్ వెళ్లిందట.. కొత్త, పాత నేతల వర్గ పోరు అన్న తేడా మర్చిపోయి.. పార్టీ కోసం రోడ్డు ఎక్కండని తేల్చి చెప్పారట పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్.. ఇంటి దగ్గర కూర్చుంటే ఓట్లు రావు... జనాల్లో ఉంటేనే జనం నమ్ముతారని హితోపదేశం చేశారట. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు..ఇలా అందరికీ స్పెషల్ టాస్కులు అప్పగించారట. ముఖ్యంగా రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని కమలం పార్టీ డిసైడ్ అయిందట. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, రైతులకు చెల్లింపుల సమస్యలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లలో జాప్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, గందరగోళం ఇవే ఇప్పుడు బీజేపీ ప్రధాన అస్త్రాలుగా మారబోతున్నాయట. రైతు ఏడిస్తే రాజ్యం నిలవదు అన్న సామెతను రాజకీయ ఆయుధంగా మార్చుకుంటోంది బీజేపీ..! అందుకే “రైతు ఘోష – బీజేపీ భరోసా” పేరుతో సోమవారం నుంచి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది..!

పండించిన రైతుకే ధర దక్కకపోతే... ఆ పాలన ఎందుకయ్యా..? ఇదే ఇప్పుడు బీజేపీ ఎత్తుకున్న ప్రధాన అస్త్రం. రాష్ట్రంలో రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కాక గోదాముల దగ్గరే నిలిచిపోతుందని కమలం పార్టీ మండిపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కమలం పార్టీ నేతలు క్యాంప్ వేయబోతున్నారు. మొదటి రోజే రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి.. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతారట... అలాగే ప్రతి గింజను కేంద్రం కొనుగోలు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఆలస్యం చేస్తోందంటు రైతులకు వివరించబోతున్నారట. అంటే ఇకపై రైతు సమస్యలపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య నేరుగా పొలిటికల్ వార్ షూరూ కానున్నట్టు తెలుస్తోంది..

80 శాతం వడ్లు కొన్నామని సీఎం రేవంత్ చెబుతున్నారు. ఎక్కడ కొన్నారో చూపించండంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేరుగా సవాల్ విసిరారు. మేము కూడా మీతో వస్తాం, రైతుల ముందే తాడో పేడో తేల్చుకుందాం అంటూ ఫైర్ అయ్యారు. గ్రామాల్లో రైతుల ఆక్రోసమే తమకు రాజకీయంగా మంచి అవకాశమని కమలం పార్టీ లెక్కలు వేసుకుంటోందట. కాలికి బలపం కట్టుకుని తిరిగితేనే కష్టాలు తెలుస్తాయి అన్నట్టు. నేతలందరినీ క్షేత్రస్థాయిలో తిరగమంటోంది అధిష్టానం. మోడీ సభతో వచ్చిన ఊపు తగ్గకముందే దాన్ని ఓట్లుగా మార్చుకోవాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేసిందట.

రైతు సమస్యలతో పాటు... రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ పరిణామాలపైనా బీజేపీ ఫోకస్ పెంచిందట. SIR ప్రక్రియపై అపోహలు- వాస్తవాలు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, స్థానిక సమస్యలు... ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారట. గ్రామాల్లోకి వెళ్లి రైతుల మధ్య ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తోందట. ఇప్పటివరకు మాటల బీజేపీ అన్న విమర్శలకు ఇక పోరాటాల బీజేపీగా సమాధానం ఇవ్వాలని కమలం పార్టీ డిసైడ్ అయ్యిందట. కాంగ్రెస్, BRSకు ప్రత్యామ్నాయ బలమైన రాజకీయ శక్తిగా నిలబడాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందట. మంట చిన్నదైనా గాలి దొరికితే అడవంతా అంటుకుంటుందన్న నానుడి ఉంది.‌ దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే గాలి కోసం వెతుకుతోంది కాషాయ పార్టీ. ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నాయనుకుంటే పప్పులో కాలేసినట్టే! ఇప్పటి నుంచి పోరాడితేనే భవిష్యత్తులో ఫలితం వస్తుందన్న ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది..

మొత్తానికి రైతు ఘోష-బీజేపీ భరోసా అనే పోరు బాట నిజంగానే రైతులకు మేలు చేస్తుందా..? కొనుగోలు కేంద్రాల దగ్గర మొదలయ్యే ఈ రాజకీయ పోరు... అసెంబ్లీ గేట్ల వరకు వెళ్తుందా..? రైతు సమస్యల పేరుతో బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడ తెలంగాణ రాజకీయ సమీకరణాలనే మార్చేస్తుందా..? లేదా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. రైతు పోరుబాట బీజేపీకీ ఏ మేరకు లాభం చేకూరుతుందో చూడాలి మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story