Burning Topic: చక్రం తిప్పిన సీఎం విజయ్.. అన్నాడీఎంకే కు బిగ్ షాక్..?
Burning Topic: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం! అన్నాడీఎంకే పార్టీ నిలువునా చీలిపోయింది.
Burning Topic: చక్రం తిప్పిన సీఎం విజయ్.. అన్నాడీఎంకే కు బిగ్ షాక్..?
Burning Topic: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన దగ్గరి నుంచి,కొత్త ప్రభుత్వం ఏర్పాలు వరకూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో బల పరీక్షకు సిద్దం అవుతున్న వేళ అన్నా డీఎంకే చీలిపోయింది. ఇటీవలి ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి 47 మంది గెలవగా, ఇందులో 30కి పైగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రి సీవీ షణ్ముగం ఆధ్వర్యంలో పార్టీపై తిరుగుబాటు చేశారు. తమ శాసససభా పక్షనేతగా ఎస్పీ వేలుమణిని ఎన్నుకున్నారు. తాము టీవీకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్టుగా వారు ప్రకటించారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఎన్నిక జరగడానికి ముందే ఈ చీలిక వర్గం తమ వైఖరిని, మద్దతును స్పష్టం చేసింది. తమిళనాడు ప్రజలు విజయ్ ముఖ్యమంత్రిగా ఉండాలని తీర్పు ఇచ్చారని షణ్ముగం పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
కొత్తగా ఏర్పడ్డ శాసనసభ కొలువు తీరిన రోజునే అన్నా డీఎంకేలో చీలిక బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని షణ్ముగం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్‌పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్‌లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకేలో అంతర్గత పోరు ముదిరి చివరకు పార్టీ చీలికకు దారి తీసింది. వేలుమణి శాసనసభా పక్ష నాయకుడిగా 30 మంది, పళనిస్వామి నాయకుడిగా 17 మంది విడివిడిగా లేఖలు ఇచ్చారు. అయితే ఈ లేఖలపై రెగ్యులర్ స్పీకరు ఎన్నికైన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తాము ఇక ఎన్డీఏ కూటమిలో కొనసాగబోమని స్పష్టం చేశారు చేశారు షణ్ముగం. తమ వర్గమే అసలైన అన్నాడీఎంకే అని ప్రకటించారు
అన్నా డీఎంకేలో పళనిస్వామి నాయకత్వం పట్ల ఎన్నికలకు ముందు నుంచే అసమ్మతి కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటైన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పలువురు నాయకులు సూచించారు. అయితే వీరి నిర్ణయాన్ని పళనిస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల ఫలితాలు టీవీకేకు అనుకూలంగా రావడం అన్నాడీఎంకేలో సంక్షోభానికి దారి తీసింది. ఎన్డీయే కూటమి 53 సీట్లు సాధించింది అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్‌కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్‌కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. పళనిస్వామి వారితో రాజీకోసం ప్రయత్నించినా.. వారు దిగిరాలేదు. చివరికి పార్టీ నిలువునా చీలిపోయింది.
అన్నా డీఎంకే ఓటమికి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయాలని షణ్ముగం వర్గం డిమాండ్ చేస్తోంది.. డీఎంకేకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేను ఏర్పాటుచేశాం. 53 ఏళ్లుగా మా రాజకీయాలు ఆ దిశగానే కొనసాగాయి. కానీ డీఎంకే మద్దతుతో ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన వచ్చింది. మెజార్టీ సభ్యులు దానిని తిరస్కరించారు. ఈ పొత్తు ప్రతిపాదనను తమ వర్గం వ్యతిరేకించినట్టు షణ్ముగం తెలిపారు. డీఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పుట్టిందని షణ్ముగం గుర్తు చేశారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అన్నాడీఎంకే ఉనికే లేకుండాపోతుంది. ప్రస్తుతం మేం ఎలాంటి పొత్తులో లేము. ఇప్పుడు మా దృష్టి అంతా అన్నాడీఎంకేను పునరుద్ధరించి, బలోపేతం చేయడం పైనే ఉంది. ఇది పార్టీని చీల్చే ప్రయత్నం కాదన్నారాయన. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్‌కు సపోర్ట్ ఇస్తామని అన్నారు.
తాజా పరిణామాలపై పళని స్వామి వర్గం తీవ్రంగా స్పందించింది. షణ్ముగం, వేలుమణి మంత్రి పదవులను ఆశించే టీవీకేకు మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తింది. వీరు చెప్పేవి అన్నీ అబద్దాలు అంటూ అన్నా డీఎంకే ఐటీ విభాగం తీవ్రమైన పదజాలంతో పోస్ట్ పెట్టింది. ‘డీఎంకేతో పొత్తు గురించి మీడియాలో వస్తున్న కొన్ని వదంతులను సాగదీసి, వాటిని ప్రదర్శించడం మీ ప్లాన్‌లో భాగమా? మీ ముగ్గురూ వెళ్లి టీవీకే కాళ్లపై పడి మంత్రి పదవి కోసం యాచించారని అదే మీడియా రాస్తోంది... దాన్ని కూడా మీరు అంగీకరిస్తున్నారా?.. అది సరే... కానీ ‘మేము అధికార పార్టీకి తోక ఊపడానికి వెళ్తున్నాం’ అని మీరెందుకు చెప్పలేదు? "పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించడానికి మీరెవరు?’’ అని ప్రశ్నించింది. మరోవైపు బీజేపీ దేశ వ్యాప్తంగా తన మిత్ర పక్షాలను నాషనం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అన్నా డీఎంకేను నాషనం చేయాలనే చిరకాల స్వప్నం ఇవాళ నెరవేరబోతోంది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాకూర్ విమర్శించారు.
ఒకప్పుడు తమిళ రాజకీయాలను శాసించిన అన్నా డీఎంకే ఇప్పుడు నాయకత్వ సంక్షోభం ఎదుర్కోంటోంది. డీఎంకేను చీల్చి అన్నా డీఎంకేను ఏర్పాటు చేశారు ఎంజీ రామచంద్రన్. ఆయన శిష్యరాలు జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే 2006 నుంచి 2021 వరకు తమిళ రాజకీయాలను శాసించింది. కానీ 2016 డిసెంబర్‌లో ఆమె మరణం తర్వాత నుంచి అన్నాడీఎంకే క్రమంగా ప్రాభవం కోల్పోయింది. పార్టీ మీద పట్టు సాధించిన పళని స్వామి తన ఉనికి కోసం సీనియర్ నాయకులుకు పొగపెట్టారు పన్నీర్ సెల్వం, శశికళ వంటి కీలక నాయకులను పార్టీ నుంచి బహిష్కరించడం, ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో 2019, 2024 లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. ఇదే సమయంలో డీఎంకేతో పొత్తుకోసం అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరగడం, షణ్ముఖం తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించడంతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి.




