Burning Topic: భారత్ కు కొత్త సమస్య
Burning Topic: భారత్‌కు బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం షాక్ ఇచ్చిందా? తీస్తా నదీ జలాల వివాదంలో చైనా జోక్యం భారత్ భద్రతకు ముప్పుగా మారుతుందా?
Burning Topic: భారత్ కు కొత్త సమస్య
Burning Topic: పొరుగు దేశాలతో కయ్యానికి దిగి లబ్ది పొందాలని ప్రయత్నించే డ్రాగన్‌కు బంగ్లాదేశ్ రూపంలో సరికొత్త అవకాశం దొరికింది. తాజాగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహమాన్ బీజింగ్ వెళ్లారు. అక్కడ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కీలక భేటీ జరిగింది. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై వీరు చర్చించినట్లు బంగ్లాదేశ్ వార్తా సంస్థ బీఎస్‌ఎస్ తెలిసింది. ఈ విషయంలో భారత్‌తో తనకున్న వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపాలని, తనకు మద్దతు ఇవ్వాలని బంగ్లాదేశ్ లాంఛనంగా అభ్యర్థించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్ యీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహ్మన్ కోరినట్లు తెలిపాయి. తారిఖ్ రహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య భారత్‌తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది
భారత, బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీస్తా నదీ జలాల పంపకం అంశం కీలకంగా మారింది. దశాబ్దాలుగా ఈ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. 1996లో కుదిరిన గంగా జల ఒప్పందం, ఫరక్కా బ్యారేజీ వద్ద వేసవి కాలంలో నీటి పంపిణీని నిర్దేశిస్తుంది. నీటి కొరత ఉన్న నెలల్లో భారత్ తగినంత నీటిని విడుదల చేయకపోవడంతో తమ వ్యవసాయం, జీవనోపాధులు ప్రభావితమవుతున్నాయని బంగ్లాదేశ్ చెబుతోంది. తీస్తా జలాలపై 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, బంగ్లాదేశ్‌కు 36 శాతం, భారతదేశానికి 39 శాతం వాటా లభించగా, మిగిలిన 25 శాతాన్ని తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే, ఆ ఏర్పాటు ఎన్నడూ పూర్తిగా అమలు కాలేదు. మరోవైపు 1996 నాటి ఒప్పందం ఈ సంవత్సరం చివరలో ముగియనున్న నేపథ్యంలో, తీస్తా జలాల్లో తమకు న్యాయమైన వాటా కావాలని బంగ్లాదేశ్ కోరుతోంది.
2011లో తీస్తా జలాల్లో బంగ్లాదేశ్‌కు 37.5 శాతం, భారతదేశానికి 42.5 శాతం వాటా లభించేలా ఒక ప్రతిపాదన చేశారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన, న్యాయమైన మరియు సమానమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా గతంలోని విభేదాలను పరిష్కరించవచ్చనే అంచనాలను కూడా పెంచింది. అయితే అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ, ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత వస్తుందని అభ్యంతరం చెప్పి ఒప్పందాన్ని అడ్డుకున్నారు. తాజా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించడంతో బంగ్లాదేశ్‌కు కొత్త ఆశలు చిగురించాయి. బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తీస్తా నీటి పంపిణీ సమస్యకు పరిష్కారం దొరుకుందని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. తీస్తా నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆ పార్టీ విమర్శించడం గమనార్హం. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది
తీస్తా నది తూర్పు హిమాలయాల్లో మానస సరోవరం సమీపంలోని చెమయుంగ్‌డంగ్ హిమానీనదం నుండి పుట్టింది. ఇది సిక్కిం, పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి, బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. తీస్తా నది బంగ్లాదేశ్‌లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. అక్కడి సాగుకు, కోట్లాదిమంది జీవనోపాధికి ఎంతో కీలకం. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్యను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. ఇందు కోసం ఆ దేశం ఇప్పుడు చైనా నుంచి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని ఆశిస్తోంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్టులో చైనా పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో చైనా భాగస్వామ్యం కావడం భారత్‌కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు. దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి, తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్ట్ ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి
తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్‌లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్‌కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే, అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్‌కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఈ పరిణామం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపింది.భారత్-బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. తాజా పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిషితంగా గమనిస్తోంది. బంగ్లాదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడితే పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తే సమస్య మరింత సంక్లిష్టంగా మారుతోంది.




