Off The Record: చక్రం తిప్పుతున్న హరీష్ రావు..?
Off The Record: నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ లో సంచలన మార్పులు! మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధిపత్యానికి హరీష్ రావు చెక్ పెడుతున్నారా?
Off The Record: చక్రం తిప్పుతున్న హరీష్ రావు..?
Off The Record: నల్లగొండ గడ్డపై గులాబీ రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లు వన్-వే ట్రాఫిక్‌లా సాగిన జగదీష్ రెడ్డి హవాకు.. బ్రేకులు పడ్డాయా అన్న చర్చ మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి జిల్లాలో జరుపుతున్న వరుస పర్యటనలు.. పార్టీలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాధారణ పార్టీ కార్యకలాపాల కంటే.. రాజకీయంగా బలమైన సంకేతాలు ఇవ్వడానికే హరీష్ ఈ పర్యటనలు పెట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, నియోజకవర్గ స్థాయి కీలక సమావేశాలకు.. జిల్లా సీనియర్ నేత జగదీష్ రెడ్డిని దూరం పెట్టడం.. గులాబీ పార్టీలో 'గ్రూపు రాజకీయాలను' బట్టబయలు చేస్తోంది.
హరీష్ రావు పర్యటనల వెనుక పెద్ద స్కెచ్చే ఉందనేది తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. జగదీష్ రెడ్డితో రాజకీయంగా తీవ్ర విభేదాలు ఉండి.. ఆయన్ను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలనే హరీష్ టార్గెట్ చేశారని చర్చ జరుగుతుంది. కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్, సాగర్‌లో నోముల భగత్, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య.. వీరంతా గత కొన్ని రోజులుగా జగదీష్ రెడ్డి పోకడలపై అసంతృప్తితో ఉన్నారట. ఇప్పుడు వీరందరితో హరీష్ రావు వరుసగా భేటీలు కావడం.. జగదీష్ రెడ్డికి చెక్' పెట్టడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు జిల్లా బీఆర్ఎస్‌లో కొత్త నాయకత్వ సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కోదాడలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఈ విభేదాలను మరింత స్పష్టం చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో హరీష్ రావు ఫోటోలు భారీగా ఉన్నప్పటికీ.. జిల్లా కీలక నేత జగదీష్ రెడ్డి ఫోటో ఎక్కడా కనిపించకపోవడం సంచలనం రేపింది. ఇది కావాలనే జగదీష్ రెడ్డి వర్గాన్ని అవమానించడమేనని తెలుస్తోంది. పైగా ఈ సమావేశానికి సూర్యాపేట, హుజూర్ నగర్, తుంగతుర్తి కేడర్ దూరంగా ఉండటం.. గాదరి కిషోర్ లాంటి ముఖ్య నేతలు రాకపోవడం.. పార్టీలో చీలికను స్పష్టంగా చూపిస్తోంది..
నిజానికి గత పదేళ్లుగా నల్లగొండ జిల్లా బీఆర్ఎస్‌లో జగదీష్ రెడ్డి తిరుగులేని నేత. 2018 ఎన్నికల్లో 10 సీట్లు గెలిపించి.. మూడు ఉప ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చి.. కేసీఆర్ నమ్మకాన్ని చూరగొన్నారు. అప్పట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు జిల్లాలో పట్టు సాధించాలని చూసినా.. జగదీష్ రెడ్డి సమర్థవంతంగా అడ్డుకున్నారు. కానీ గత ఎన్నికల్లో ఒక్క తాను తప్ప.. జిల్లాలోని మిగతా 11 చోట్లా పార్టీ ఓడిపోవడం జగదీష్ రెడ్డికి పెద్ద మైనస్‌గా మారింది.
జగదీష్‌రెడ్డి మిరిమీరిన జోక్యమే జిల్లాలో పార్టీ ఘోర ఓటమికి కారణమన్న విమర్శలూ లేకపోలేదు. ఇదే సాకుతో.. ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ బలహీనతను ఆసరాగా చేసుకునే హరీష్ రంగంలోకి దిగారని తెలుస్తోంది..
అయితే జగదీష్ రెడ్డి వర్గం మాత్రం ఈ పరిణామాలను తేలిగ్గా తీసుకుంటోంది. కేటీఆర్‌తో జగదీష్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం.. ఉద్యమ కాలం నుంచి ఉన్న గుర్తింపు.. పార్టీలో ఆయన ప్రాధాన్యతను తక్కువ చేయలేమని వారు వాదిస్తున్నారు. 'హరీష్ తో పోలిస్తే జగదీష్ రెడ్డి ఏమాత్రం తక్కువ కాదు' అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. జిల్లాలో పార్టీ నిర్మాణం నుంచి ఉద్యమ రాజకీయాల వరకు ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని, కాబట్టి కేటీఆర్-జగదీష్ రెడ్డి సారథ్యంలోనే నల్లగొండ పార్టీ ముందుకెళ్తేనే మంచిదని వారు భావిస్తున్నారు. 2014, 2018 ఎన్నికలో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా గులాబీ పట్టు సాధించినా 2023లో తిరిగి హస్తం మళ్లీ పుంజుకుంది. కంచుకోటను కాపాడుకుంది. నల్గొండ కాంగ్రెస్ అంటే రెడ్డి లీడర్ల ప్రాభల్యం ఎక్కువ. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్, జానారెడ్డి లాంటి బడా నేతలు ఉన్న జిల్లా అది. అలాంటి చోట హస్తం వ్యూహాలను తట్టుకొని నిలబడాలంటే గ్రూప్ వార్‌ను అధిగమించి గులాబీ పార్టీ పావులు కదపాల్సి ఉంటుంది. ఐతే మొన్నటి వరకు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జగదీష్‌రెడ్డి.. పెత్తనాన్ని కొందరు లీడర్లు వ్యతిరేకిస్తుండంతో.. అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఆసక్తిగా మారింది.
ఏది ఏమైనా ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్‌లో ఇప్పుడు 'ఆధిపత్య పోరు' క్లైమాక్స్‌కు చేరుకుంది. హరీష్ రావు 'ఆపరేషన్ నల్లగొండ' జగదీష్ రెడ్డి కోటను బద్ధలు కొడుతుందా? లేక ఈ విభేదాలు పార్టీని మరింత బలహీనపరుస్తాయా? అధిష్టానం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది? అనేది వేచి చూడాల్సిందే..




