Off The Record: అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది..?
Off The Record: కల్వకుంట్ల కవిత కొత్తగా స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' పార్టీ పేరు చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది.
Off The Record: అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది..?
Off The Record: తెలంగాణ పేరులో ఇప్పటి వరకు దాదాపూ 15కు పైగా రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిలో అత్యధికం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో భావోద్వేగాలను ప్రతిబింబించడానికి పుట్టుకొచ్చినవే. అలా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం వీరోచితంగా పోరాడిన దివంగత మర్రి చెన్నారెడ్డి 1969లోనే తెలంగాణ ప్రజా సమితి పేరుతో ఓ పార్టీకి పురుడుపోశారు. నిజానికి 1969లో అనంతుల మదన్ మోహన్ ఈ పార్టీని స్థాపించగా.. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో రాజకీయ శక్తిగా నిలదొక్కుకుంది. 1971లో మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో 10 లోక్ సభ స్థానాలు సాధించి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ హోంమంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీ నెలకొల్పారు. అది కాలక్రమేణా కనుమరుగైపోయింది. టైగర్ నరేంద్రగా అభిమానులు పిలుచుకునే ఆలె నరేంద్ర తెలంగాణ సాధన సమితి పేరుతో మరో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. రాములమ్మగా ప్రసిద్ధి చెందిన అలనాటి సినీ హీరోయిన్ విజయశాంతి పెట్టిన తల్లి తెలంగాణ పార్టీని కూడా టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. మరో మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ నెలకొల్పిన నవ తెలంగాణ పార్టీ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనమైంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్ నెలకొల్పిన తెలంగాణ ఇంటి పార్టీ.. అధికార కాంగ్రెస్‌లో విలీనమైంది. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ లేబర్ పార్టీ వంటి అనేక చిన్నాచితక పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉండటం గమనార్హం.
గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రసిద్ధి చెందిన టీఆర్‌ఎస్ భారత రాష్ట్ర సమితి.. బీఆర్‌ఎస్‌గా మార్పు చెందింది. ఈ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి, పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి.. ప్రస్తుత రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంది. కోదండరాం.. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్‌కు పోటీగా అదే పేరు స్ఫూరించేలా తెలంగాణ రక్షణ సేన పేరుతో ఏప్రిల్ 25 న మరో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. ఇంతకీ తండ్రీ, సోదరుడు, ఇతర దగ్గరి బంధువులు కీలక నేతలుగా కొనసాగుతున్న ప్రస్తుత బీఆర్‌ఎస్‌పైనే ఆమె కత్తి కట్టారా..? లేక మరో టార్గెట్ ఏదైనా ఉందా..? అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ కేసీఆర్ మొదట్లో స్థాపించిన టీఆర్‌ఎస్ అనే మూడు అక్షరాలను అలాగే తీసుకుని మరో కొత్త ప్రకటించడం వెనుక కవిత ఉద్దేశమేంటనేది సస్పెన్స్‌గా మారింది. టీఆర్‌ఎస్ అధిష్టానాన్ని కాని, ప్రజలను కానీ అయోమయానికి గురి చేయాలనుకున్నారా..? ఆ భావనతో తానే అయోమయానికి గురయ్యారా..? అన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో రీసౌండ్ చేస్తోందట. ఇంతకీ.. కవిత.. కొత్తగా తెలంగాణ రక్షణ సేన పార్టీకి పురుడుపోయడంతో.. తెలంగాణ సెంటిమెంట్, పేరుతో ఏర్పడిన పార్టీలపై మరోసారి చర్చ మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత పార్టీ ప్రకటించిన మరుసటి రోజు TRS అనే పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయంటూ.. ఎన్నికల సంఘానికి తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం లేఖ రాశారు. 2023లోనే తన తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఎన్నికల సంఘం రిజిస్టర్ చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుతో పది నియోజకవర్గాల్లో పోటీ చేశామనీ ఆయన గుర్తు చేశారు. ఈక్రమంలో కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సమితి పేరుతో ఒక పార్టీ ఇప్పటికే ఉందని, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి పాత పేరు కూడా టిఆర్ఎస్ కావటం వల్ల ప్రజల్లో పేర్ల విషయంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ దృష్టికి రక్షణ సమితి, బీఆర్ఎస్, ఇతరులు అభ్యంతరాలు చెప్పే ఛాన్స్ ఉందట. ఎన్నికల కమిషన్ అధికారులే కవిత నివాసానికి వచ్చి అనుమతి లేఖని ఇచ్చారంటూ ఆ పార్టీ కార్యకర్తలు చెప్పడం విడ్డూరంగా ఉందని బిఆర్ఎస్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గతంలో తెలంగాణ పేరుతో వచ్చిన పార్టీల్లో ఏ ఒక్కటి మనుగడలో లేవంటున్న బీఆర్‌ఎస్ అభిమానులు... కేసీఆర్ స్థాపించిన టీఆర్‌ఎస్ ఒక్కటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా కెసిఆర్ ఉద్యమ కాలంలోనే పార్టీని తీసుకొచ్చారని, అందుకే తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్‌ను మాత్రమే గుర్తుపెట్టుకున్నారని తేల్చి చెబుతున్నారు. ఇంతకీ.. తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్తగా పుట్టిన కవిత పార్టీని ప్రజలు ఆదరిస్తారా.. అనేది ఆసక్తి రేపుతోంది.




