Burning Topic: ఎగ్జిట్ పోల్స్ సంచలనం..మమతకు బిగ్ షాక్?

Burning Topic: పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 May 2026 7:57 AM IST
Burning Topic
X

Burning Topic: ఎగ్జిట్ పోల్స్ సంచలనం..మమతకు బిగ్ షాక్?

Burning Topic: దేశంలో ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పోలింగ్ పూర్తయింది. ఏప్రిల్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ తర్వాత వెలువనున్నాయి. కాగా బెంగాల్‌లో తుది విడత పోలింగ్ పూర్తికాగానే ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. దీంతో రాజకీయ పార్టీల్లో విజయంపై ధీమా, నైరాశ్యం, గందరగోళం మొదలైంది. అసలు ఏ సర్వేను నమ్మాలి? ఇవి నిజమేనా? ఓటరు నాడిని సరిగ్గా అంచనా వేశారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆక్సిస్ మై ఇండియా, సీ-ఓటర్, టుడేస్ చాణక్య, జనతాకీ బాత్, రిపబ్లిక్-సీఎన్ఎక్స్, పీ-మార్క్ సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఇందులో అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగి ఎన్నికల్లో విజేత విషయంలో అన్ని సర్వేల్లోనూ ఏకాభిప్రాయం కనిపించింది. అయితే దేశ ప్రజలంతా ప్రధానంగా ఎదురు చూస్తున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఉత్కంఠను మిగిల్చాయని చెప్పవచ్చు.

అస్సాంలో ఎన్డీయే తిరుగులేని విజయం సాధిస్తుందని అన్ని సర్వేలూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అక్కడ హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టనుంది. కేరళలో సాధారణంగా ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. 2021 ఎన్నికల్లో మాత్రం వామపక్ష కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ ఎల్డీఎఫ్‌కు హ్యాట్రిక్‌ అవకాశం లేదని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. ఇక పుదుచ్చేరిలో అధికార ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్, భాజపా కూటమి మరోసారి అధికారంలోకి రావొచ్చని అన్ని సర్వేలు అభిప్రాయపడ్డాయి. కాంగ్రెస్, డీఎంకే కూటమి రెండో స్థానానికి పరిమితం కానుందన్నాయి. కాగా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఆరు సంస్థల్లో రెండు తృణమూల్‌వైపు, మిగిలిన సంస్థలు బీజేపీవైపు మొగ్గాయి. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభావం ఉన్నా డీఎంకే తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని అయిదు సంస్థల్లో మూడు అంచనా వేయగా, ఒక సంస్థ అన్నాడీఎంకే–బీజేపీ కూటమివైపు మొగ్గింది.

దేశ ప్రజలందరి దృష్టీ పశ్చిమ బెంగాల్ మీదే ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఇప్పటికే వరుసగా మూడుసార్లు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎగ్జిట్ పోల్స్ షాక్ తెప్పించాయి. ఈసారి ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన విపక్షం బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయి. పోలింగ్ 92% కంటే ఎక్కువ నమోదు కావడంతో, ఇది ఎవరికి లాభిస్తుందనేది ఉత్కంఠగా మారింది అక్కడ పోలింగ్ ముగుస్తూనే టీవీ ఛానల్స్‌లో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈసారి బెంగాల్‌లో ఏకధాటిగా విజయం సాధిస్తున్న మమతాబెనర్జీ ఆధిపత్యానికి ఈసారి గండిపనుందని, కమలం వికసించబోతోందని అధికశాతం ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పాయి. వాస్తవ ఫలితాలకు ఇవి ఏమేరకు దగ్గరగా ఉంటాయన్నది వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాతగానీ తెలియదు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తృణమూల్‌ కొట్టిపారేసింది. వాటి విశ్వసనీయతను ప్రశ్నించింది. 2021లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఎలా తప్పాయో గుర్తు చేసుకోవాలని చెబుతోంది

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్లు 294. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం సీట్లలో సగానికంటే కనీసం ఒక్క సీటు అయినా అదనంగా గెలుపొందాలి. అంటే అధికార పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా కనీసం 148 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.. అయితే టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో, అక్కడ ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. బీజేపీకి కచ్చితంగా 100 సీట్లు దాటుతాయని తెలుసుస్తోంది. టీఎంసీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడితే ఎలా? అన్నదే ప్రశ్న.. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో రాష్ట్ర గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. అత్యధిక స్థానాలు గెలుపొందిన అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తారు. మెజారిటీ నిరూపించుకోవడానికి 10 రోజుల గడువు ఇస్తారు. ఈలోగా బలాన్ని కూడగట్టుకోవాల్సి ఉంటుంది. లేనట్లుయితే ఆ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది

ఇక రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్ల మెజారిటీ అసవరం. అధికార డీఎంకే మరోసారి అధికారం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు అంచనా వేశాయి. బీజేపీతో జట్టుకట్టిన అన్నాడీఎంకేకు మరోసారి నిరాశ తప్పదని చెబుతున్నాయి.. ప్రజాపోల్, పీపుల్స్ పల్స్, పీ-మార్క్, మార్జిజ్ సర్వే సంస్థలు డీఎంకే స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందని చెబుతుంటే.. కాగా జేవీసీ సర్వే సంస్థ మాత్రం అన్నా డీఎంకేకు మెజారిటీ ఖాయమంటోంది. ఇదే సమయంలో విజయ్‌ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోందని యాక్సిస్‌ మై ఇండియా వెల్లడించింది.. 18–19 ఏళ్ల వయసులో తొలిసారిగాఓటేసిన యువ ఓటర్లలో 68 శాతం మంది టీవీకే పార్టీకే ఓటేశామని చెప్పారు. ఇదే నిజమైతే ఇప్పటి వరకూ డీఎంకే, అన్నా డీఎంకేల మధ్యే పరిమితమైన తమిళ రాజకీయంలో పెనుమార్పు ఖామయని చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే అసలు ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకూ నమ్మొచ్చు?.. పోల్స్ సర్వేలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నప్పటికీ, అవి ఎల్లప్పుడూ 100% కచ్చితమైనవి కావు. ఇవి ఓటర్లు పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చిన తర్వాత వారి అభిప్రాయాలను సేకరించి రూపొందించే అంచనాలు మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ ఓటరు నాడిని చెప్పగలవు కానీ, కచ్చితమైన సీట్ల సంఖ్యను చెప్పలేకపోవచ్చు. కొన్నిసార్లు ఇవి వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా వస్తే, మరికొన్నిసార్లు పూర్తిగా తప్పుగా నిరూపితమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కేవలం పోలింగ్ రోజున సేకరించిన డేటాపై ఆధారపడి ఉంటాయి, ఇవి చివరి నిమిషం మార్పులను ప్రతిబింబించకపోవచ్చు. సర్వే సంస్థలు ఓటర్లను ఎవరికి ఓటు వేశారో అడిగి, ఆ డేటాను విశ్లేషించి ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఓటర్లు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం కూడా ఉంది. నిజమైన అభిప్రాయాన్ని చెప్పకపోవడం వల్ల కూడా ఫలితాలు మారవచ్చు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story