Off The Record: రంగంలోకి మోదీ-షా?

Off The Record: తెలంగాణలో మోదీ పాలన 12 ఏళ్ల వేడుకలపై రాజకీయ రగడ. బీజేపీ అభివృద్ధి లెక్కలు, కాంగ్రెస్-బీఆర్ఎస్ ఎదురుదాడి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Jun 2026 6:44 AM IST
Off The Record
X

Off The Record: రంగంలోకి మోదీ-షా?

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. బీజేపీ కొత్త రాజకీయ లెక్కలతో రంగంలోకి దిగింది. సిద్ధాంతాలు, విమర్శలు, భావోద్వేగాల కంటే.. నేరుగా డెవలప్‌మెంట్ అజెండానే ప్రజల ముందుంచాలని డిసైడ్ అయింది. నరేంద్ర మోడీ ప్రధానిగా పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ బీజేపీ భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి రూపాయి తెలంగాణ అభివృద్ధి చరిత్రలో ఒక అధ్యాయం అంటోంది బీజేపీ. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు వచ్చిన నిధులు ఒక ఎత్తైతే.. మోదీ పుష్కర కాలంలోనే 13 లక్షల కోట్లకు పైగా అభివృద్ది నిధులు, ప్రాజెక్టులు మరో ఎత్తు అని కమలనాథులు చెబుతున్నారు.

జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే లైన్ల అభివృద్ధి, గ్రామీణ రోడ్ల నిర్మాణం, ఆవాస్ యోజన ఇళ్ల పథకాలు, జల్ జీవన్ మిషన్, అయుష్మాన్ భారత్, రైతులకు పీఎం కిసాన్... ఇలా ప్రతి పథకం వెనుక మోడీ ముద్రే ఉందని ప్రచారం మొదలుపెట్టింది బీజేపీ. గ్రామాల్లో లబ్ధిదారుల సమావేశాలకు ప్లాన్ చేస్తోంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు విజయోత్సవ సభలు, లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశాలు.. సోషల్ మీడియా ప్రచారం... ఇలా "మోడీ నమ్మకం - తెలంగాణ అభివృద్ధి" అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్తోంది కమలం పార్టీ..

బీజేపీ అభివృద్ధి చిట్టాపద్దులకు.. అదే స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా పదునైన అస్త్రాలతో సిద్ధమయ్యాయి. "13 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ వాదిస్తుంటే...అది కేంద్రం జేబులోని డబ్బు కాదు... తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులే అని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటే దాన్ని సహాయం అనాలా?" అని కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.‌ అంతేకాదు రాష్ట్ర విభజన హామీలను ప్రస్తావిస్తున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ? ఐటీఐఆర్ కల ఎందుకు కలగానే మిగిలింది? మెట్రో రెండో దశకు నిధులు ఎక్కడ? మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహాయం ఎందుకు లేదు? అంటూ వరుస ప్రశ్నల వర్షం కురిపిస్తోంది అధికార కాంగ్రెస్‌. మరోవైపు బీఆర్ఎస్ కూడా దూకుడు పెంచింది. "గుమ్మడికాయంత ప్రచారం.. ఆవగింజంత ఫలితం" అంటూ సెటైర్లు పేలుస్తోంది. తెలంగాణ హక్కులను ఢిల్లీ వద్ద రాష్ట్ర బీజేపీ తాకట్టు పెట్టింది అంటూ బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. తెలంగాణ ఉద్యమ ఫలితాలను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ చూస్తోందని ఆరోపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి..తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందనే అంశాన్ని రాజకీయ అస్త్రంగా మారుస్తున్నారు.

కేవలం మోడీ ఇమేజ్‌తోనే తెలంగాణలో రాజకీయ పంట పండదని బీజేపీకి కూడా స్పష్టంగా తెలిసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పుడు కమలం పార్టీ డబుల్ ఇంజిన్ కాదు... డబుల్ ఎటాక్ స్ట్రాటజీ అమలు చేస్తోంది. ఒకవైపు మోడీ పాలన విజయాలను ప్రజలకు వివరిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆరు గ్యారంటీల అమలులో జాప్యం... రైతుల అసంతృప్తి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, విద్యుత్,జల వివాదాలు , స్థానిక సమస్యలు, ప్రతి అంశాన్ని రాజకీయ అస్త్రంగా మార్చి కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాలని చూస్తోంది. ఢిల్లీ పనితీరు ఒక కత్తి అయితే... రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు మరో కత్తి" అన్నట్టుగా రెండు వైపులా పదునుపెడుతోంది. కానీ తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ స్క్రిప్ట్ ప్రకారం నడిచే వేదిక కాదు. ఇక్కడ లోక్‌సభ ఎన్నికల్లో ఒక తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో తీర్పు ఇస్తున్నారు. అందుకే మోడీ ఇమేజ్ బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ కుల సమీకరణాలు, స్థానిక నాయకత్వ ప్రభావం... ఉద్యమ నేపథ్యం, ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రాంత అస్థిత్వం, ఆత్మగౌరవం అన్నీ మిళితమైన ఉంటాయి. స్థానిక సమీకరణాలే ఫైనల్ ఫలితాన్ని డిసైడ్ చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మొత్తానికి... బీజేపీ చేతిలో మోడీ పన్నెండేళ్ల పాలన బ్రహ్మాస్త్రం, కాంగ్రెస్ చేతిలో అధికార బలం, బీఆర్ఎస్ చేతిలో ప్రాంతీయ భావోద్వేగ బలం ఉంది. దీంతో తెలంగాణ రాజకీయ రంగస్థలంపై మూడు శక్తులు, మూడు కథలు ,మూడు ఎజెండాలు ఢీకొనబోతున్నాయి. మోడీ పన్నెండేళ్ల రూలింగ్‌ను రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి మోడీ మ్యాజిక్‌తో తెలంగాణలో కమలం వికసిస్తుందా..? అసలు తెలంగాణ ఓటరు ఎవరి కథను నమ్ముతారు? ఢిల్లీ అభివృద్ధి గణాంకాలకు ఆకర్షితులవుతారా ? లేక మళ్లీ ప్రాంతీయ భావోద్వేగానికే జై కొడతారా ? అన్నది చూడాలి.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story