Off The Record: తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ ఎస్‌విఎస్‌ఎన్ వర్మకు భారీ షాక్?

Off The Record: పిఠాపురం రాజకీయాల్లో పెను మార్పులు! టీడిపి ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను పక్కన పెట్టబోతున్నారా?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 May 2026 6:40 AM IST
Off The Record
X

Off The Record: తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ ఎస్‌విఎస్‌ఎన్ వర్మకు భారీ షాక్?

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేనివిధంగా ఆ నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు మధ్య ఎప్పుడూ.. ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఒకసారి ఫోటో వివాదం.. మరోసారి ఫ్లెక్సీ వివాదం.. ఇంకొకసారి మా నాయకుడి పేరు చెప్ప లేదంటూ వివాదం. పిఠాపురం నియోజవర్గంలో రెండు నెలలకు ఒకసారి జనసేన, టీడీపీ నాయకుల మధ్య ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. పిఠాపురం.. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో.. నియోజకవర్గంలో ఏ చిన్న విషయం జరిగినా అది రాష్ట్రవ్యాప్తంగా సంచనంగా మారడం రివాజు. అలాగే ఆ ప్రభావం కూటమి ఐక్యతకు భంగం కలిగించేలా కూడా మారుతుంది.

కొద్దిరోజుల క్రితం పిఠాపురం నియోజవర్గంలో జరిగిన పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు స్వాగత ఫ్లెక్సీ లేదనే విషయమై మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మ, జనసేన పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘర్షణ ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధాన పత్రికలతోపాటు ప్రధాన మీడియా, సోషల్ మీడియాలోనూ ఈ ఇష్యూ హైలైట్ అయ్యింది. మరోవైపు టీడీపీ, జనసేన కార్యకర్తల పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తుతోంది. ఈ వివాదం ఒక దశలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా మారుతుందా అన్నసందేహాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ వ్యవహారం పెద్దది కాకుండా అటు జనసేన, ఇటు టిడిపికి చెందిన అది నాయకులు జాగ్రత్త పడ్డారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. తరచూ ప్రొటోకాల్ అంటూ వర్మ ఘర్షణలకు దిగడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ అంటే ఫ్లెక్సీలో ఫోటో కాదని ఆయన స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య ఇబ్బందులు వుంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలి.. కానీ వీధిన పడకూడదని అధినేత హితవు పలికారు. పిఠాపురంలో వర్మతోనే ఈ ఇబ్బంది ఎక్కువగా వస్తోందని జనసేన పార్టీ అధినాయకత్వం.. ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరోవైపు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కూడా.. వర్మ చిన్నచిన్న విషయాలపై మీడియాకు ఎక్కడం మంచిది కాదంటూ చురకలంటించారు. ఇది కార్యకర్తలు, నాయకులకు తప్పుడు సంకేతాలు ఇస్తుందన్నారు. పైగా కూటమి ఐక్యతకు భంగం కలిగించే అవకాశం ఉంటుందన్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై వర్మకు వివరించి చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసుకు చంద్రబాబు ఆదేశించారనీ తెలుస్తోంది.

ఎప్పటినుంచో తలనొప్పిగా మారుతున్న పిఠాపురం వివాదానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు టీడీపీ హైకమాండ్ ఓ అంతర్గత కమిటీ వేసింది. పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జీగా వర్మను శాశ్వతంగా తప్పిస్తే బాగుంటుందని ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని సమాచారం. వర్మతోపాటు పార్టీకి పంటికింద రాయిలా మారిన మరికొందరు నాయకులను సైతం పక్కన పెట్టాలని ఆ కమిటీ సూచించిందని చెబుతున్నారు. టీడీపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోందట.

మరోవైపు వర్మ వ్యవహారంపై ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్ కూడా ఇదే విషయం తేల్చి చెప్పిందట. లేదంటే రాబోయే రోజుల్లో పార్టీకి మరింత డామేజ్ చేసే అవకాశం ఉందని ఆ కమిటీ హెచ్చరించిందట. పైగా వర్మ ఏదోఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారనీ ఆ నివేదిక వెల్లడించిందట. అందుకే ఓ ప్లాన్ ప్రకారం నియోజకవర్గంలో వర్మ.. లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారట. వర్మ చూపు వైసీపీవైపు మళ్లుతోందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదట. వర్మ వ్యవహారం, కదలికలపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు పలు నివేదికలు ఇచ్చినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. వర్మ కొంతమంది వైసీపీ నాయకులతో ఈపాటికే టచ్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. అందుకే తరచూ స్థానిక నాయకులను రెచ్చగొట్టి, వివాదాలు సృష్టిస్తున్నారని పిఠాపురంలో టాక్. ఇక్కడ పవన్ ఉన్నన్ని రోజులు తనకు ఎలాగూ సీటు రాదని వర్మ గ్రహించారని, సార్వత్రిక ఎన్నికల సమయానికి వైసీపీ దిశగా అడుగులు వేస్తారనీ రాజకీయ విశ్లేషకుల టాక్.

రాజకీయ వ్యూహాలు రచించడంలో, రాజకీయ చతురతలో అపర చాణక్యుడిగా పేరొందిన వర్మ.. టిడిపి వ్యూహాలను ఎలా తిప్పికొడతారోనన్నది ఉత్కంఠ రేపుతోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story