Off The Record: తెలంగాణ బీజేపీ లీడర్లకు బిగ్ షాక్?
Off The Record: తెలంగాణ బీజేపీలో ముదురుతున్న అంతర్గత పోరు! రాష్ట్ర నాయకత్వం మాట వినని జిల్లా అధ్యక్షులపై చర్యలకు సిద్ధమైన అధిష్టానం.
Off The Record: తెలంగాణ బీజేపీ లీడర్లకు బిగ్ షాక్?
Off The Record: తెలంగాణ బీజేపీకి ఊపు తెచ్చేందుకు అధిష్టానం చేయని ప్రయత్నమంటూ లేదు. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు పగ్గాలు చేపట్టి పది నెలలు గడిచాయి. కానీ ఆశించినదానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పార్టీ యధాతధంగానే ఉందనే విమర్శలు గుప్పుమంటున్నాయట. కొందరు జిల్లా అధ్యక్షుల తీరు పార్టీకి తలనొప్పిగా మారిందనే చర్చ కూడా రీసౌండ్ చేస్తోందట. క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే పార్టీలో క్రమశిక్షణకు తిలోదకాలు ఇస్తున్నారా..? అనే చర్చ లేకపోలేదు. ఇప్పటికే పార్టీలో కొత్త, పాత అంటూ అంతర్గత పోరు నేపథ్యంలో ఇప్పుడు కొందరు జిల్లా అధ్యక్షుల తీరు అంతర్గత పోరుకు మరింత ఆజ్యం పోసినట్టైందట. రాష్ట్ర స్థాయి నేతలను కొందరు జిల్లా అధ్యక్షులు పట్టించుకోవడం లేదట. దీంతో వారి ప్రాతినిధ్యం లేక పేరుకే పరిమితమయ్యారట. రాష్ట్ర కమిటీలో చోటు దక్కిందని సంబర పడాలో.. స్థానికంగా పార్టీలో పట్టు లేదని బాధ పడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ సొంత ఇలాకా తుక్కుగూడలో కనీసం ఆయనకు చెప్పకుండానే అధ్యక్షుడి ఎంపిక జరిగిందట. ఇటు ఇబ్రహీంపట్నంలోనూ రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాషకు కూడా ఇదే తరహాలో సొంత నియోజకవర్గంలో ప్రోగ్రాం జరుగుతున్నా.. జిల్లా అధ్యక్షుడి నుంచి కనీసం సమాచారం లేదట. దీంతో రాష్ట్ర స్థాయి నేతలంటే కొందరు జిల్లా అధ్యక్షులకు, జిల్లా స్థాయి నాయకులకు చులకనగా మారిందనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఆయా జిల్లాల్లో ఒంటెత్తుపోకడలకు వెళ్లడంతోనే జిల్లా పార్టీ కొందరు అధ్యక్షులతో సమస్యలు వస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
ఇక ఈ పరిస్థితిపై రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. కొందరు జిల్లా అధ్యక్షుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతోందట. ఇప్పటికే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిని బలవంతంగా రాజీనామా చేయించిన ఘటన.. మిగతా జిల్లాలకు స్పష్టమైన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టే అయిందంటున్నారు. అయినా కూడా చాలా చోట్ల జిల్లా అధ్యక్షుల తీరు మారడం లేదట. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కొందరు చూసీచూడనట్లు పార్టీ లైన్‌కు విరుద్దంగా పనిచేశారనే గుసగుసలు అప్పట్లో వినిపించాయి. మెట్‌పల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్స్‌కు సరైన సమయంలో విప్ జారీ చేయకపోవడం కారణంగానే ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, దీనికి కారణం జిల్లా అధ్యక్షుడేనని ఆరోపిస్తూ మిగతా కౌన్సిలర్లు అందరూ అధ్యక్షుడి ఇంటి మీద దాడి చేయడం అప్పట్లో పెను దుమారమే రేపింది. ఇంకొందరు పక్క పార్టీ నేతలతో లోపాయికారి ఒప్పందంతో కుమ్మక్కయ్యారనే ప్రచారం అప్పట్లో సాగింది. ఇక అధిష్టానం పంపించిన డబ్బు క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు చేరకపోవడానికి సైతం కొందరు జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిల చేతివాటం కారణమట. ఈ క్రమంలో ఓడిన అభ్యర్థులు నేరుగా రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసిన ఘటనలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. ఇలా ప్రతి దాంట్లో కొందరు జిల్లా అధ్యక్షుల పనితీరు పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా అవుతుందంటూ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోందట.
రాష్ట్ర నాయకత్వం గ్రౌండ్ రిపోర్ట్స్ అడిగితే.. వాస్తవ పరిస్థితులు చెప్పకుండా అన్నీ బాగానే ఉన్నాయి..అన్నట్టుగా గాలి లెక్కలు చెబుతున్నారని రాష్ట్ర నాయకత్వం ఆగ్రహంతో ఊగిపోతుందంట. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు బలహీనంగానే జరుగుతున్నాయట. ముఖ్యంగా పెద్ద కార్యక్రమాలు, ముఖ్య నాయకుల పర్యటనల సమయంలో జిల్లా అధ్యక్షులు జనసమీకరణ సరిగ్గా చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీని పట్టుకుని ఉగ్రవాది అంటూ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం సరిగ్గా చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. అలాగే నారీశక్తి వందన్ బిల్లును ఓడించిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిస్తే అనుకున్న స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేయలేదని, కొందరు అధ్యక్షులు తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారట. ఇవన్నీ ఇలా ఉంటే.. ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారిగా తెలంగాణకు మోదీ వస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు, జనసమీకరణ మీద కసరత్తు చేస్తుంటే.. కొందరు జిల్లా అధ్యక్షులు అయితే అసలు తమకేమీ పట్టనట్టు జన సమీకరణపై కదలడం లేదట. మేడ్చల్ లాంటి కీలక జిల్లాకు అధ్యక్షుడిని నియమించలేక తలలు పట్టుకోవడం, అలాగే వికారాబాద్ జిల్లాకు అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై నెలల తరబడిగా కసరత్తు కొనసాగిస్తూనే ఉన్నారట. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న విధానాలు, కార్యక్రమాలపై అధిష్టానం ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోందట..
ఇక ఈ పరిస్థితిని చూసి విసిగిపోయిన రాష్ట్ర నాయకత్వం.. ఇప్పుడు కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోందని సమాచారం. తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు, చేర్పులు ఉంటాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. పార్టీ లైన్ క్రాస్ చేసిన జిల్లా అధ్యక్షులపై కఠిన చర్యలు తీసుకునేందుకు నివేదిక రెడీ అయిపోయిందట. ముఖ్యంగా ఇటీవల ఎన్నికల సంఘం చేపడుతున్న SIRపై సరైన అవగాహన కార్యక్రమాలు చేయడంలో విఫలమయ్యారట. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయడంలో జిల్లా అధ్యక్షుల పాత్ర క్రియాశీలకంగా లేదట. ఇటీవల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లాంటి అంశాల్లో పనితీరు బాగా లేని వారిని పార్టీ నాయకత్వం టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాంచందర్ రావు అల్టిమేటం ఇచ్చారని సమాచారం. పని చేస్తారా? లేక తప్పుకుంటారా? అని చెప్పేంత వరకు పరిస్థితి తెచ్చుకున్నారట. దీంతో చాలా మంది జిల్లా అధ్యక్షులు, కొందరు నాయకులు ఇప్పుడు ఏమీ జరగబోతోందనే భయాందోళనలో పడ్డారట. అదే విధంగా వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అలాగే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మూడు మేయర్ పీఠాలే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతోంది. దీంతో ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం దిశగా అధిష్టానం పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోందట తెలంగాణ బీజేపీ నాయకత్వం..
మొత్తానికి.. తెలంగాణ బీజేపీలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఈ మార్పులు.. త్వరలోనే పెద్ద సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షులు తమ పదవులను కాపాడుకుంటారా? లేక రాష్ట్ర నాయకత్వం తీసుకునే కఠిన నిర్ణయాలకు బలి అవుతారా? కమలం పార్టీలో జరగబోయే ఈ పోస్ట్‌మార్టం భయం ఎవర్నీ వెంటాడుతోంది..? ఇంతటితో ఆ జిల్లా అధ్యక్షుల తీరులో మార్పు వస్తుందా..? లేక అదే తంతు కొనసాగిస్తారా? అన్నది చూడాలి మరీ.




