Off The Record: ఒక్కటైన తెలంగాణ బీజేపీ ఎంపీలు.. వ్యూహం సిద్ధమా!
Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. విభేదాలను పక్కనపెట్టి 'వన్ టీమ్ - వన్ టార్గెట్' తో నేతలు ముందుకెళ్తున్నారు.
Off The Record: ఒక్కటైన తెలంగాణ బీజేపీ ఎంపీలు.. వ్యూహం సిద్ధమా!
Off The Record: తెలంగాణలో అధికార పీఠమే టార్గెట్! దానికి ముందు ఇంటిని చక్కదిద్దాలి...తర్వాత ప్రత్యర్థి కోటపై దాడి చేయాలన్న రాజకీయ చాణక్యంతో అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది..తెలంగాణ బీజేపీలో చాలాకాలంగా వినిపిస్తున్న మాట.. ఇగోలు, వర్గాలు, అంతర్గత విభేదాలు. ఎవరి దారి వారిదే.. ఎవరి మాట వారిదే.. అన్నట్టుగా గ్రూపులు నడిచాయనే ప్రచారం పెద్ద ఎత్తున మొన్నటి వరకు సాగింది.. కానీ ఇప్పుడు హైకమాండ్ మాత్రం ఒకటే మాట చెబుతోందట.. “వ్యక్తిగత రాజకీయాలు బంద్.. పార్టీ లైన్‌లోనే అందరూ నడవాలి!” ఇటీవల తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం పెంచేందుకు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగి ఆపరేషన్ సయోధ్య పేరుతో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య రాజీ సయోధ్య చేశారు... ఇదే కొనసాగింపుగా నేతలంతా బండి, కిషన్ రెడ్డి ఇంట్లో వరుస సమావేశాలు నిర్వహించారనే టాక్ నడుస్తోంది..నేతల మధ్య ఉన్న గ్యాప్ లను తగ్గించడం.. అందరినీ ఒకే దారిలో నడిపించడం.. పార్టీ ప్రయోజనమే ముందుగా చూడాలని చెప్పడం వంటి చర్యలు చేపట్టారు. అదే సమయంలో
జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో తెలంగాణ నేతల సమావేశంలోనూ ఇదే విషయాన్ని తేల్చిపడేశారట...అసెంబ్లీ ఎన్నికలను యుద్ధంలా తీసుకోండి... ఇప్పటి నుంచే పని మొదలుపెట్టండి.. గ్రూపులు వద్దు...ఇగోలు వద్దు...సోషల్ మీడియా వార్ వద్దు...కేడర్‌ను ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్లాలని నేతలకు సూటిగా నిర్మొహమాటంగా హితోపదేశం చేశారటా...అందుకే ఢిల్లీ వేదికగా ఈ వరుస భేటీలు అనేక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయటా...
తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ అడుగులు వేస్తోంది. ఒక్క నాయకుడి బలం సరిపోదు.. ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,రాష్ట్ర నాయకత్వం.. జిల్లా నాయకత్వం.. క్షేత్రస్థాయిలో కేడర్.. అందరూ ఒకే దిశగా కదలాలనే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. అందుకే ఢిల్లీ నుంచే వన్ టీమ్.. వన్ టార్గెట్ ఫార్ములాను అమలు చేయాలని చూస్తున్నారటా... ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటం... మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం..ఇంకోవైపు పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం.. వచ్చే ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేయడం.... అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్ పోరుగా తీసుకుని పనిచేయాలని అధిష్టానం రాష్ట్ర కీలక నేతలకు, ఎంపీ, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలకు పెద్ద టార్గెట్ ఇచ్చేశారటా... అంటే.. సెమీ ఫైనల్‌లో సత్తా చూపిస్తే.. ఫైనల్‌లో ఫలితం కొట్టేయొచ్చన్న లెక్కా..?“ట్రైలర్‌లోనే దమ్ము చూపించాలి.. అప్పుడే సినిమా హిట్ అవుతుంది!” అన్నట్టుగా బీజేపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నట్టుగా ఫోటో ఫ్రేమ్ చూస్తే అర్థమవుతుంది....
మరో ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే..! ఢిల్లీలోని బండి సంజయ్ ఇంట్లో భోజనానికి నేతలంతా ఎందుకు వెళ్లారు? కిషన్ రెడ్డి ఇంట్లో డిన్నర్ మీట్ ఎందుకు జరిగింది? ఆహ్వానం ఎవరిది? ఎంపీలే స్వయంగా వెళ్లారా? లేక హైకమాండ్ ఆదేశాలతో అందరూ ఒకచోట చేరారా? అధికార కాంగ్రెస్‌ను ఎలా ఎదుర్కోవాలి? ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఎలా చెక్ పెట్టాలి? గ్రేటర్‌లో ఎలా జెండా ఎగరేయాలి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేడర్‌ను ఎలా మోహరించాలి? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఎలా గ్రౌండ్ సిద్ధం చేయాలి? ఇలాంటి అంశాలపై నేతలు చర్చించినట్టు సమాచారం. ఇప్పటివరకు ‘నేను.. నా నియోజకవర్గం.. నా రాజకీయ భవిష్యత్తు’ అన్న లెక్కలకంటే... అంతిమంగా తెలంగాణ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేలా నేతలంతా కాలుకు బలపం కట్టుకుని తిరగాలన్నది హైకమాండ్ సంకేతంగా కనిపిస్తోంది. అంటే... ఇది లంచ్ కాదు... లాంచింగ్ ప్యాడ్! ఇది డిన్నర్ కాదు..పొలిటికల్ డిన్నర్ ప్లాన్..అందుకే ఢిల్లీలో నేతల ఫోటో ఫ్రేమ్ చూశాక... బీజేపీ కేడర్‌లో ఎనలేని జోష్ పెంచిందట. ఎందుకంటే ఫోటో ఒక్కటే అయినా...దాన్ని వెనుక పొలిటికల్ మెసేజ్ మాత్రం బలంగా ఉందట. అవును "మేం కలిసున్నాం...మేం కలిసి పోరాడతాం...అధికార పీఠం కోసం కలిసి అడుగులో అడుగేస్తాం... అనే సంకేతం ఇచ్చినట్టైంది...




