Off The Record: బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్లు దక్కించుకునేది ఎవరో!

Off The Record: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ, రెండు స్థానాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీల ద్వారా అభిప్రాయ సేకరణను పూర్తి చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Oct 2026 9:13 AM IST
Off The Record
X

Off The Record: బీజేపీలో ఎమ్మెల్సీ టికెట్లు దక్కించుకునేది ఎవరో!

Off The Record: ఎన్నిక ఏదైనా.. అభ్యర్థి ఎంపికే సగం విజయం! అందుకే తెలంగాణ బీజేపీ పెద్దలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవడం లేదు. రెండు స్థానాలు.. రెండు స్క్రీనింగ్ కమిటీలు.. గెలుపే లక్ష్యంగా కసరత్తు! హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌తోపాటు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ ప్రత్యేక కమిటీలను రంగంలోకి దించింది.

హైదరాబాద్‌ సిటీ పార్టీ ఆఫీసులో రంగారెడ్డి -మహబుబ్ నగర్- హైదరాబాద్ సీటుకు సంబంధించి అభిప్రాయ సేకరణ పూర్తయింది. చింతల రామచంద్రారెడ్డి, వెంకటరమణి, కళ్యాణ్ నాయక్‌లతో కూడిన త్రీమెన్ కమిటీ.. పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు సహా సుమారు 70 మంది నాయకుల అభిప్రాయాలను సేకరించిందట. ఎవరికి ప్రజల్లో పట్టు ఉంది..?

ఎవరికి పట్టభద్రులతో సత్సంబంధాలు ఉన్నాయి..? ఎవరు పార్టీని విజయతీరాలకు చేర్చగలరు..? ఇలాంటి అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. టికెట్ ఒక్కటే.. ఆశావహులు అనేకం! చివరకు అదృష్టం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.

హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి రాజకీయ చర్చ అంతా ఇప్పుడు ఒకే పేరు చుట్టూ తిరుగుతోందట. అదే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. నిన్న అభిప్రాయ సేకరణలో దాదాపు 90 శాతం మంది నేతలు ఆయన పేరును ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పట్టభద్రుల్లో ఆయనకున్న పరిచయాలు, గతంలో పనిచేసిన అనుభవం కలిసొస్తాయని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే, ఈ స్థానంపై ఇతర నేతలు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. నేతల అభిప్రాయ సేకరణలో హైదరాబాద్ నేతలు గౌతమ్ రావును.. రంగారెడ్డి జిల్లా నేతలు వీరేందర్ గౌడ్ ను.. మహబూబ్‌నగర్ జిల్లా నేతలు, డీకే అరుణ ముఖ్య అనుచరుడు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పేర్లను కొందరు ప్రతిపాదించగా.. వీరితోపాటుగా మరికొందరు నేతలు సైతం ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, ఆల్ సెల్స్ కన్వీనర్ సారంగుల అమర్‌నాథ్, సీనియర్ నేత మల్లారెడ్డి పేర్లను సైతం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరి, ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. అభిప్రాయ సేకరణలో మెజారిటీ నేతల మద్దతుకే టికెట్ ఖరారైనట్టేనా..? లేక సామాజిక సమీకరణాలు, ఎన్నికల వ్యూహాలు, గెలుపు అవకాశాలను కూడా అధిష్టానం బేరీజు వేస్తుందా..? రాజకీయాల్లో లెక్కలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బలమైన పేరు ముందున్నా.. ఫైనల్ సీన్‌లో ఎవరి పేరు ఉంటుందో చెప్పలేం.

ఇక వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విషయానికి వస్తే.. ఇక్కడ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు కొనసాగుతున్నప్పటికీ పార్టీలో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గోలి మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు, భరత్‌లతో కూడిన త్రీమెన్ కమిటీ.. మూడు జిల్లాల్లో పర్యటించి పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించింది.

ఈ స్థానానికి సంబంధించి ప్రస్తుతం కర్ణాటక సహ ప్రభారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాసం వెంకటేశ్వర్లు పేరు ప్రధానంగా వినిపిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఓయూ ఉద్యమ నేపథ్యం ఉన్న యువనేత పుల్లారావు యాదవ్, సీనియర్ నేత ప్రకాశ్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఒక పేరు బలంగా వినిపిస్తోందని పోటీ ముగిసిపోయినట్లు కాదు.. పట్టభద్రుల సమస్యలపై అవగాహన, క్షేత్రస్థాయిలో పరిచయాలు, పార్టీ కేడర్‌ను కలుపుకుపోయే సామర్థ్యం..

ఇలా అనేక అంశాలు అభ్యర్థి ఎంపికలో కీలకం కానున్నాయట. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత, నిరుద్యోగుల సమస్యలు, విద్యావంతుల ఆకాంక్షలు.. జాబ్ కాలేండర్ ఇవన్నీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలే! ఎందుకంటే, పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ జెండా ఒక్కటే సరిపోదు. గ్రాడ్యుయేట్ ఓటరు నమ్మకం కూడా కావాలి. పేరు ఎంత పెద్దదైనా.. ప్రజలతో సంబంధం లేకపోతే గెలుపు అంత ఈజీ కాదన్న వాదన లేకపోలేదు.

ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలక ఘట్టం ముందుంది. రెండు స్క్రీనింగ్ కమిటీలు సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ప్రతిపాదిత పేర్లను పార్టీ ఢిల్లీ నాయకత్వానికి పంపిన తర్వాత.. తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లో ఉండనుంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే అధికారిక అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే దసరా పండుగకు ముందే అభ్యర్థుల ప్రకటన వెలువడవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ పేర్లన్నీ పరిశీలనలో ఉన్నవిగానే చూడాలి.

మరోవైపు, కాంగ్రెస్ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. అభ్యర్థి ఖరారయ్యాకే అసలు పోరు మొదలవుతుంది. పట్టభద్రులను ఆకట్టుకోవడం, ఓటర్లను సమీకరించడం, ప్రచారాన్ని గ్రామాలు, పట్టణాలకు విస్తరించడం.. ఇలా కమలదళం ముందు సవాళ్లు చాలానే ఉన్నాయి. టికెట్ ఇవ్వడం ఒక లెక్క.. ఆ టికెట్‌తో గెలవడం మరో లెక్క! అభ్యర్థి ఎంపికలో వేసే ఒక్క తప్పటడుగు.. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదట.

మొత్తానికి.. స్క్రీనింగ్ కమిటీల నివేదికలు సిద్ధం.. ప్రతిపాదిత పేర్లు అధిష్టానం ముందుకు! ఇక అందరి చూపూ ఢిల్లీ వైపే.. చివరి నిమిషంలో ఎవరి పేరు ఖరారు కానుంది..? ఎవరికి అదృష్టం కలిసిరానుంది..? ఎవరి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు టర్నింగ్ పాయింట్ కానున్నాయి..? ఇప్పటివరకు వినిపించినవి పేర్లే.. కానీ అధిష్టానం ప్రకటించబోయేది ఒక్కో స్థానానికి ఒక్కరినే..! ఆ ఇద్దరు ఎవరన్నది తేలాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి!


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్