Burning Topic: బెంగాల్ పై బీజేపీ ఫోకస్ ..మమతా బెనర్జీ వ్యూహమేంటి ..?

Burning Topic: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీని ఢీకొట్టేందుకు బీజేపీ సిద్ధం చేస్తున్న సరికొత్త వ్యూహాలేంటి? టీఎంసీ ప్రభుత్వంలోని అవినీతి ఆరోపణలు బీజేపీకి కలిసి రానున్నాయా?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 April 2026 8:00 AM IST
Burning Topic
X

Burning Topic: బెంగాల్ పై బీజేపీ ఫోకస్ ..మమతా బెనర్జీ వ్యూహమేంటి ..?

Burning Topic: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు యావద్దేశాన్ని ఆకర్శిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అధికార టీఎంసీ, ప్రధాన విపక్షం బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. ఈ రాష్ట్రంలో గత 15 ఏళ్లగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టకుంది బీజేపీ. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూకుడుకు ముకుతాడేసి ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా విజయఢంకా మోగించాలని సర్వశక్తులూ కూడాగడుతున్నారు కమలనాథులు. 2021 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి 77 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ, ఈసారి ఎలాగైనా అధికారం సాథించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. వీరితో పాటు బీజేపీ అగ్రనాయకులు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మోదీ కరిష్మా రాష్ట్రంలో ఈసారి అధికారం కట్టబెట్టడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది.

బెంగాల్‌లో ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనేక వ్యూహాలను రచిస్తోంది బీజేపీ. ఈ రాష్ట్రంలో పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు లేకపోయినా. మమతా బెనర్జీ పాలనా వైఫల్యాలు తమకు కలిసొస్తాయని ఆ పార్టీ ఆశ. శారదా చిట్‌ఫండ్, టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్, రేషన్ పంపిణీలో అక్రమాలు తృణమూల్ సర్కారుకు చెడ్డ పేరు తెచ్చాయి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మూతపడటం, యువతకు ఉపాధి కల్పించడంలో వైఫల్యం వల్ల బెంగాల్ నుండి వలసలు పెరిగాయని విమర్శకులు అంటున్నారు. మమత ప్రభుత్వం బంగ్లాదేశీల చొరబాట్లను ప్రోత్సహిస్తోందని, ఓటు బ్యాంకు సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, మహిళలపై నేరాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ఆరోపణ. రాజకీయ కక్ష సాధింపులు, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు సర్వసాధారణమైపోయాయి. వీటన్నింటినీ అస్త్రాలుగా వాడుకుంటోంది బీజేపీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల వరుసగా బెంగాల్‌లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం భయాందోళనలకు గురవుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే టీఎంసీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత కల్పిస్తామని, రాజకీయ హింసలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలను బీజేపీ అడ్డుకోదు. మేం అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే పశ్చిమ బెంగాల్‌లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తాం’ అని ప్రకటించారు. బెంగాల్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మోదీ

బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప్ పత్ర’ తృణమూల్ కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు గండికొట్టేలా రూపొందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో మహిళలు, యువతను ఆకర్షించడంతో పాటు, బెంగాలీ సంస్కృతిని కాపాడే హామీ ఇచ్చారు. బెంగాల్‌లో అక్రమ చొరబాట్లను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన బీజేపీ.. వారిని గుర్తించి, దేశం నుంచి పంపేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువస్తామని, అలాగే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌లను అరికట్టేందుకు కఠిన చట్టాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన కమలనాథులు.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 5 లక్షల మంది యువతకు చెరో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నామని తెలిపారు.

మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ నజరానాలు ప్రకటించింది బీజేపీ. టీఎంసీ ప్రభుత్వం ఇస్తున్న ‘లక్ష్మీర్ భండార్’ సాయం కంటే దాదాపు రెట్టింపుగా ప్రతి మహిళకు నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, 75 లక్షల మందిని ‘లఖ్‌పతి దీదీ’లుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది.బెంగాలీ ఆత్మగౌరవాన్ని కాపాడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వందేమాతరం మ్యూజియం, ఠాగూర్‌ కల్చరల్ సెంటర్ల ఏర్పాటుతో పాటు అన్ని శక్తిపీఠాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ.. తాజ్‌పూర్, కుల్పిలో ఆధునిక డీప్-సీ పోర్టులను నిర్మిస్తామని బీజేపీ తెలిపింది. సుందర్‌బన్స్ నుండి డార్జిలింగ్ వరకు నేరుగా జాతీయ రహదారితో పాటు, ఉత్తర బెంగాల్‌లో నాలుగు కొత్త నగరాల నిర్మాణాన్ని తమ ‘సంకల్ప్ పత్ర’లో ప్రముఖంగా పొందుపరిచింది.

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దక్షిణ బెంగాల్ అత్యంత కీలకమైనది. ఇది బెంగాలీ పునరుజ్జీవనోద్యమానికి కేంద్రం. కోల్‌కతా, హౌరా లాంటి నగరాలు రాజకీయ చైతన్యానికి నిలయాలు. ఉత్తర బెంగాల్‌తో పోలిస్తే ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. 2011 గణాంకాల ప్రకారం దక్షిణ బెంగాల్ జనాభా 7.4 కోట్లకు పైమాటే. కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణ మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే గత దశాబ్దాలుగా సాగుతున్న పట్టణీకరణకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, శాటిలైట్ నగరాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దక్షిణ బెంగాల్‌లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 153 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. కోల్‌కతా, హౌరా తదితర జిల్లాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఈ ప్రాంతం మీద తృణమూల్ ఆధిపత్యానికి గండికొట్టి పట్టు సాధిచాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది

దక్షిణ బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటర్లు అత్యంత కీలకమైన అంశం. ముర్షిదాబాద్‌లో అత్యధికంగా 66.27 శాతం ముస్లిం జనాభా ఉంది. బీర్భూమ్, దక్షిణ 24 పరగణాలు, నాడియా, హౌరా జిల్లాల్లో కూడా వీరి ప్రభావం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంక్ మమతా బెనర్జీ వెంటే నిలిచింది. ముర్షిదాబాద్‌లోని 22 సీట్లకు గానూ గతంలో టీఎంసీ 20 గెలుచుకుంది. బెంగాల్‌లో సంతాల్‌లు, ముండాలు సంప్రదాయబద్ధంగా టీఎంసీకి మద్దతు ఇస్తుండగా, మహతో సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. మరోవైపు, పశ్చిమ 'రార్' ప్రాంతంలోని పురూలియా, బాంకురా, ఝార్గ్రామ్ వంటి జిల్లాల్లో గిరిజన జనాభా అధికం. ఇక్కడ బీజేపీ తన పట్టును పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ముర్షిదాబాద్ లాంటి సరిహద్దు జిల్లాల్లో బంగ్లాదేశ్ నుంచి చొరబాట్ల కారణంగా ఏర్పడ సమస్యలను బీజేపీ హైలైట్ చేస్తోంది. అక్కడ పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్ వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story