Off The Record: బీజేపీ ఎమ్మెల్సీగా రంగంలోకి దిగేది ఎవరు!
Off The Record: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది. రేసులో ప్రముఖ నేతల పేర్లు.
Off The Record: బీజేపీ ఎమ్మెల్సీగా రంగంలోకి దిగేది ఎవరు!
Off The Record: తెలంగాణలో త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసి అధికార పీఠంలో కూర్చునేందుకు ఈ విజయం బూస్ట్‌లా పని చేస్తుందన్న భావనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు.
అందులోభాగంగానే.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తోపాటు ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలపైనా బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ బలాన్ని పెంచుకోవడం, పట్టభద్రుల వర్గంలో మరింత పట్టు సాధించడం లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోందన్న చర్చ నడుస్తోంది.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను సేకరించి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు ప్రతిపాదనలు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారిక ప్రకటనకు ముందే పలు పేర్లు ప్రచారంలోకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విషయంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేరు బలంగా వినిపిస్తోంది. 2014లో ఇదే స్థానం నుంచి గెలుపొందిన ఆయనకు పట్టభద్రుల వర్గంలో పరిచయాలు, పార్టీ కేడర్‌తో అనుబంధం, గత ఎన్నికల అనుభవం కలిసివస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
త్రీమెన్ కమిటీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలోనూ అధిక శాతం నాయకులు రాంచందర్ రావు పేరునే సూచించినట్లు చర్చ సాగుతోంది. దీంతో ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లేనన్న ప్రచారం ఊపందుకుంది.
అయితే టికెట్ రేసులో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, ఎన్వీ సుభాష్, అమర్నాథ్ వంటి నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా..? లేక అనుభవానికే హైకమాండ్ పెద్దపీట వేస్తుందా..? అన్న చర్చ కొనసాగుతోంది.
ఇక ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వద్ద పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్ పేరు అకస్మాత్తుగా తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
పీఆర్టీయూ నేతలు బీజేపీ అగ్రనేతలను కలిసి భిక్షం గౌడ్‌కు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. ఈ నెలాఖరులో ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం ఉంది.
ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల్లో ఉన్న ప్రభావం, విస్తృత నెట్వర్క్, పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఆయనకు ప్లస్ పాయింట్లుగా మారవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో బీజేపీ ఈ దిశగా ఆలోచిస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది.
అయితే ఇదే స్థానం నుంచి కాసం వెంకటేశ్వర్లు, పుల్లారావు యాదవ్, ప్రకాశ్ రెడ్డి పేర్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. దీంతో పార్టీలో సీనియర్లకు అవకాశం ఇస్తారా..? లేక విస్తృత వర్గాల మద్దతు కోసం కొత్త ప్రయోగం చేస్తారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక్కడే అసలు రాజకీయ సమీకరణాలు మొదలవుతున్నాయి. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన నేతలు టికెట్ ఆశిస్తున్న వేళ.. బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే కేడర్‌లో ఎలాంటి స్పందన ఉంటుంది..? మరోవైపు గెలుపే లక్ష్యంగా కొత్త వర్గాలను ఆకర్షించాలని చూస్తే పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతోంది..?
టికెట్ అనేది కేవలం ఒక అభ్యర్థి ఎంపిక మాత్రమే కాదు. అది పార్టీ అంతర్గత సమీకరణాలు, కార్యకర్తల మనోభావాలు, ఎన్నికల వ్యూహాలు అన్నింటినీ ప్రభావితం చేసే అంశం. అందుకే ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్ తుది నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరి.. ఈ ఇద్దరి పేర్లే ఫైనల్ అవుతాయో.. బీజేపీ అధిష్టానం మనసులో మరెవరి పేర్లు ఉన్నాయో.. చూడాలి.




