Off The Record: భైంసాలో బీజేపీ ఎంఐఎం మధ్య పొత్తు ఉన్నట్టా లేనట్టా

Off The Record: భైంసా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 May 2026 6:33 AM IST
Off The Record
X

Off The Record: భైంసాలో బీజేపీ ఎంఐఎం మధ్య పొత్తు ఉన్నట్టా లేనట్టా

Off The Record: భైంసా. తెలంగాణలో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఒకలాంటి రాజకీయం నడిస్తే.. ఇక్కడ మరో రకమైన రాజకీయం నడుస్తుంటుంది. ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నా.. బీజేపీ, ఎంఐఎం మధ్యే అసలు ఫైట్. తాజాగా భైంసాలో కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈ రెండు పార్టీల మధ‌్య.. పొలిటికల్ నిప్పును రాజేసింది. కమలం, పతంగి లీడర్ల మధ్య మాటల యుద్ధం గుడిలో ఒట్లు.. సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఎంఐఎంకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఓకే చెప్పారని పతంగి పార్టీ నేత అంటే.. అదేం లేదు అవన్నీ అబద్ధపు ప్రచారాలంటూ కాషాయ లీడర్ ఖండించడం కొత్త చర్చకు దారి తీసింది.

ముధోల్ నియోజకవర్గంలోని రాజకీయాలు భైంసా మున్సిపల్ చుట్టే తిరుగుతున్నాయి. భైంసా మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో ఎంఐఎంకు బీజేపీ మద్దతిస్తుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని, తానూ చెప్పేది అబద్దమైతే ఎమ్మెల్యే పటేల్ తడిబట్టలతో హనుమాన్ ఆలయం చుట్టుతిరగాలని ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ సవాల్ విసురుతుండగా, ప్రతి సవాలుగా నీ నీచ రాజకీయాలు ఇక చెల్లవని, తనను విమర్శించే స్థాయి నీకు లేదంటూ ఇకనైనా మాట్లాడేముందు జాగ్రత్తగా మాట్లాడలని రామారావు పటేల్ ఘాటుగా స్పందిస్తున్నారు.

బైంసా మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఒకరోజు ముందు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కమిషనర్ తీరుకు నిరసనగా మున్సిపల్ చైర్మన్ దత్తిత్రితో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్ తాలోడు శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యలయం ఆవరణలో మూడు రోజుల పాటు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు ఎమ్మెల్యే రామారావు పటేల్ స్వయంగా వచ్చి మద్దతు తెలిపారు...కమిషనర్.. ఎంఐఎం పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారంటూ విమర్శించారు. ఇదే విషయంపై మున్సిపల్ పాలకవర్గంలోని కొంతమంది ఎన్నికకు సంబందించి హైకోర్టును ఆశ్రయించగా, ఎన్నికను ఈ నెల 19న నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఇదిలా ఉంటే బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్‌తో..ఎంఐఎం నేత జాబీర్ ఆహ్మద్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త రాజకీయ చర్చకు దారి తీశాయి. కో-ఆప్షన్ ఎన్నిక విషయంలో..ఎంఐఎంకు మద్దతు ఇస్తామని స్వయంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ తనతో ఫోన్లో సంభాషణలు జరిపారని, ఇందుకు సంబందించి అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయని ఎంఐఎం నేత జాబీర్ ఆహ్మద్ పేర్కొన్నారు. తాను చెప్పేది అబద్దమైతే తడిబట్టలతో ఎమ్మెల్యే పటేల్ హనుమాన్ ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేయాలని చాలెంజ్ చేశారు జాబీర్ ఆహ్మద్. గతంలో పటేల్‌కు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ తానే ఇప్పించానని అంటున్నారు జాబీర్.

ఎంఐఎం నేత స్టేట్‌మెంట్‌పై ధీటుగా స్పందించారు రామరావు పటేల్. అబద్ధపు మాటలతో 15 సంవత్సరాల పాటు బైంసా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన జాబీర్ ఆహ్మద్ కుటంబం ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజా క్షేత్రంలో ఓడిపోయి జాబిర్ అహ్మద్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ కౌంటర్ ఎటాక్ చేశారు. ఇలాంటి అబద్ధపు మాటలను ప్రజలు నమ్మరని, ముందుగా నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కోఆప్షన్ ఎన్నికల్లో మా బిజెపి కౌన్సిలర్ ను తప్పుదోవ పట్టించి, గెలవాలని చూశారని ఇదేనా మీ రాజనీతి అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రామారావ్ పటేల్. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమన్నారు. రాక్షస పాలనను అంతమొందిచడానికి మున్సిపల్ ఎన్నికల్లో పతంగి పార్టీని చిత్తు చేశామని, నీ మాయ మాటలు, గారడి మాటలకు కాలం చెల్లిందని,.తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పంచే స్థాయి నీది కాదని స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే.

మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక వేళ.. ఈ ఇద్దరు నేతల మాటల యుద్దం చర్చనీయంశంగా మారింది. వాస్తవానికి 2018లో కాంగ్రెస్ తరఫున రామారావ్ పటేల్ బరిలోకి దిగిన సందర్భంలో ఎంఐఎం మద్దుతు కోరుకున్నారు. అప్పుడు బి.ఆర్.ఎస్-ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీగా ఉండి ఎన్నికల బరిలో కలిసి పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే.. అప్పటి మున్సిపల్ చైర్మన్ ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ తో ఫోన్లో మాట్లాడిన సంభాషణ లీక్ కావడం అప్పట్లో పెద్ద ప్రకంపణలు సృష్టించాయి. ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తున్న ఎంఐఎం సపోర్ట్ ను రహస్యంగా రామారావ్ పటేల్ కోరడం నాటి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కో-ఆఫ్షన్ ఎన్నిక అకస్మత్తుగా రద్దవ్వడంతో మళ్లీ ఈ ఇద్దరి నేతల మద్య మాటల యుద్దం చర్చనీయంశంగా మారింది. నువ్వెంత అంటే నువ్వేంత అన్నట్లుగా ప్రకటనలు ఇవ్వడంతో పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి కోఆప్షన్ ఎన్నికలో ఎవరు ఎవరికి మద్దతిస్తారు..అసలు ఏ జరగబోతోందో అంటు భైంసాలో ఓ రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story