Off The Record: తెలంగాణ బీజేపీకి అధిష్టానం ప్రాధాన్యత తగ్గించిందా!

Off The Record: నితిన్ నబీన్ నేతృత్వంలోని కొత్త బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు దక్కని ప్రాతినిధ్యం. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Aug 2026 7:06 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ బీజేపీకి అధిష్టానం ప్రాధాన్యత తగ్గించిందా!

Off The Record: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు.. 16 మంది జాతీయ కార్యదర్శులతో కొత్త టీమ్‌ను సిద్ధం చేశారు. కానీ.. ఈ జాబితాలో తెలంగాణ పేరు మాత్రం కనిపించలేదు. ఒక్క నాయకుడికి కూడా జాతీయ పదవి దక్కలేదు. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో జేపీ నడ్డా టీమ్‌లో తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎంపీ లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎంపీ డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే మరో నేతకు కూడా జాతీయ స్థాయిలో అవకాశం దక్కింది.

కానీ ఇప్పుడు సీన్ మారింది. గతంలో ముగ్గురు ఉన్న చోట ఈసారి జీరో..! మూడు పదవుల నుంచి సున్నాకు..! ఇది యాదృచ్ఛికమా..? లేక కమలం పార్టీ వేసిన బిగ్ స్కెచ్ఛా.? అన్న మీమాంస రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాజకీయాల్లో పదవి అంటే కేవలం కుర్చీ కాదు. అది పార్టీలో ప్రాధాన్యానికి కొలమానం. అందుకే తెలంగాణ నేతల పేర్లు జాతీయ జాబితాలో కనిపించకపోవడం తెలంగాణ కాషాయ శిబిరంలో తీవ్ర స్థాయిలో నిరాశకు దారితీసిందట.

ఇక జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో 13 మందికి అవకాశం ఇచ్చారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, రామ్ మాధవ్, బైజయంత్ పాండా వంటి నేతలకు చోటు దక్కింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. అంటే.. దక్షిణాదిలోని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇచ్చిన అధిష్ఠానం.. తెలంగాణ విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటించింది అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిందట‌.

ఇక్కడే అసలు ట్విస్ట్. పదవి ఇవ్వలేదంటే నేతలను పక్కన పెట్టినట్టేనా..? అలా అనుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తెలంగాణలోనే అసలు ఫోకస్ పెట్టాల్సిన అవసరం పార్టీకి ఉందన్నది అధిష్ఠానం లెక్కగా కనిపిస్తోంది. ఢిల్లీ పదవి కంటే.. తెలంగాణ గల్లీ రాజకీయమే ముఖ్యమని భావించినందుకే సీనియర్ నేతలను నేరుగా రాష్ట్ర రాజకీయాల్లోకి దింపే అవకాశం ఉంటుందట.

తెలంగాణలో అధికారం లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలే అసలు ఫైనల్. లోక్‌సభలో వచ్చిన ఊపును రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావాలని, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో పార్టీని విస్తరించాలని.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టాలని చూస్తోదంట. అందుకే ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్, రఘునందన్ రావు వంటి సీనియర్ల అనుభవాన్ని రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకోవాలనే ఆలోచన ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

లోక్‌సభలో గళం వినిపించడమే కాదు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యర్థులపై దూకుడుగా దాడి చేసే ఈ నేతలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు వస్తాయని వారి అనుచరులు ఆశించారు. కానీ లిస్ట్ చూస్తే నో ఛాన్స్. దీంతో నిరాశే మిగిలింది. అయితే దీన్ని రాజకీయంగా మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉందనే చర్చ లేకపోలేదు. ఈ నేతలంతా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో మా‌స్ ఫాలోయింగ్ రాజకీయ ప్రభావం ఉన్న నేతలు. అయితే వీళ్లను ఒక్కచోట కూర్చోబెట్టడం కాదు.. తెలంగాణ అంతా తిప్పి పార్టీని బలోపేతం చేయడమే ప్లాన్. అదే జరిగితే.. జాతీయ పదవి రాకపోవడం షాక్ కాదు. కొత్త టాస్క్ కావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో

ఢిల్లీ కుర్చీ కన్నాతెలంగాణ గల్లీ ముఖ్యం అన్నట్టుగా అధిష్ఠానం లెక్కలు వేసిందా అన్న ప్రశ్న సైతం ఇప్పుడు ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఖాళీకి ఓ లెక్క ఉంటుంది. ప్రతి పదవి వెనుక ఓ వ్యూహం ఉంటుంది.

ఇక బీజేపీ ఆర్గనైజేషన్ వ్యవహారాల్లో కీలకమైన బీఎల్ సంతోష్‌కు మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ బాధ్యతలు కొనసాగించారు. అంటే.. సంస్థాగత వ్యవహారాలపై తన పట్టును కొనసాగించేందుకు బీజేపీ హైకమాండ్ సంతోష్‌కే మరోసారి అవకాశం ఇచ్చింది. దీంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే ఈ పదవిలో ఆయన కొనసాగడం. ఆర్గనైజేషన్‌పై జాతీయ నాయకత్వం తన పాత టీమ్‌పైనే నమ్మకం ఉంచినట్టు స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టైంది.

మరోవైపు స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్ తదితరులకు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం దక్కింది. అంటే.. అనుభవం, సంస్థాగత బలం, ఎన్నికల వ్యూహం.. ఈ మూడింటినీ కలిపి కొత్త టీమ్‌ను నితిన్ నబీన్ సిద్ధం చేసినట్టు స్పష్టమవుతోంది.

అయితే తెలంగాణ విషయంలో మాత్రం ప్రశ్న ఒక్కటే..తెలంగాణకు పదవి ఎందుకు లేదు..? మరో కోణంలో చూస్తే ఒకరిద్దరు తెలంగాణ నేతలకు మాత్రమే జాతీయ పదవులు ఇస్తే మిగిలిన సీనియర్లలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందన్న అంచనా కూడా ఉండొచ్చు. అందుకే అందరికీ ఢిల్లీ పదవులు ఇవ్వకుండా అందరినీ తెలంగాణ రాజకీయాలకే కట్టిపడేయాలన్న వ్యూహం కావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఎవరికీ పదవి ఇవ్వలేదు కాబట్టి ఎవరికీ తగ్గింపు లేదు. రేపు రాష్ట్రంలో ఎవరు ఎంత పనిచేస్తారన్నదే అసలు పరీక్ష అన్నట్టుగా అధిష్ఠానం వ్యవహరించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో బీజేపీ లక్ష్యం ఇప్పుడు కేవలం ఓట్లు పెంచుకోవడం కాదు పార్టీని అధికార పోరులో ప్రధాన శక్తిగా నిలబెట్టడమే. అందుకే ఢిల్లీ పదవుల కంటే హైదరాబాద్‌ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గల్లీల్లో రాజకీయ పోరాటమే ముఖ్యమని హైకమాండ్ భావిస్తే.. సీనియర్లకు రాష్ట్ర స్థాయిలో మరిన్ని బాధ్యతలు రావచ్చు. “పోస్టు లేదు.. పని ఉంది. కుర్చీ లేదు.. టార్గెట్ ఉంది” అన్నట్టుగా పరిస్థితి మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక డీకే అరుణ విషయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉందా..? అందుకే ఆమెను పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతల నుంచి తప్పించిందా..? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపో,మాపో కేంద్ర మంత్రి వర్గంలో మార్పు చేర్పులు ఉంటాయన్న ప్రచార నేపథ్యంలోనే జాతీయ కమిటీలో ఎవరికి చోటు దక్కలేదనే టాక్ సైతం నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి మహిళా కోటాలో డీకె అరుణ, బీసీ కోటాలో అరవింద్ లేక ఈటల రాజేందర్ లను లేదంటే ఎస్టీ కోటా నుంచి ఎంపీ నగేష్ కు మంత్రి ఉండొచ్చన్న రాజకీయ ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి.

అయితే దీనిపై అధికారికంగా ఇటు పార్టీలో గానీ అటు అధికార వర్గాల్లో ఎలాంటి స్పష్టత లేని పరిస్థితి దీంతో రాజకీయంగా మరింతా ఆసక్తి రేపుతోంది. కానీ రాజకీయాల్లో పొగ కనిపిస్తే ఎక్కడో మంట ఉండొచ్చన్నట్టుగా ఈ చర్చ మాత్రం కాషాయ శిబిరంలో జోరుగా సాగుతోంది.

మొత్తానికి తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా జాతీయ కమిటీలో చోటు దక్కకపోవడం రాజకీయంగా మాత్రం చిన్న విషయం కాదు. “కుర్చీ కంటే కదనరంగమే ముఖ్యం” అన్నట్టు పరిస్థితులు దాపురించాయి.. అయితే.. రాజకీయాల్లో ఏదీ ఊరికే జరగదు. పిక్చర్ ఇంకా బాకీ ఉంది..! ఇక ముందు ఏం జరగబోతోంది..?

కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కుతుందా..? రాష్ట్ర నేతలకు కొత్త బాధ్యతలు వస్తాయా..? లేక రాబోయే ఎన్నికల కోసం సీనియర్లందరినీ తెలంగాణ గడ్డపైనే రంగంలోకి దింపుతారా..? పదవుల జాబితాలో తెలంగాణకు జీరో..! కానీ.. రాజకీయ టార్గెట్‌లో తెలంగాణకు హీరో రోల్ ఇస్తారా..? ఇదే ఇప్పుడు అసలు సస్పెన్స్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story