Off The Record: తగ్గేదేలే అంటున్న బీజేపీ మరి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు?
Off The Record: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఓటర్ల నమోదు, వ్యూహాలపై కమల దళం కసరత్తు వేగవంతం చేసింది.
Off The Record: తగ్గేదేలే అంటున్న బీజేపీ మరి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు?
Off The Record: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా.. యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్.. నల్గొండ-వరంగల్-ఖమ్మం.. ఈ రెండు గ్రాడ్యుయేట్ స్థానాలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
గతంలో కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కొమురయ్య, అంజిరెడ్డి రూపంలో వరుస విజయాలు సాధించిన కమలనాథులు.. అదే ఊపును ఇప్పుడు కూడా కొనసాగించాలని చూస్తున్నారట. అందుకే ఈసారి అడుగు ముందే వేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట.
ఇటీవల తెలంగాణ పార్టీ ఇన్‌ఛార్జిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన సునీల్ భన్సల్.. సహ ఇన్‌ఛార్జీలు అభయ్ పాటిల్, రేఖా శర్మలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటం అప్పుడు బీజేపీకి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు లెక్క మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉంది.
బీఆర్ఎస్ కూడా రేసులోకి వస్తోంది. దీంతో మూడు పార్టీల ముచ్చట. ఇందుకోసం బీజేపీ ముందుగా ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టిందట. అర్హత ఉన్న ప్రతీ పట్టభద్రుడిని గుర్తించడం.. ఓటు నమోదు చేయించడం.. ఆ తర్వాత వారిని పార్టీతో అనుసంధానం చేయడం.. ఇలా బూత్ స్థాయి వరకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఎన్నికల రోజున ఓటు అడగడం ఒక ఎత్తయితే.. ఓటు పడేలా ముందుగానే ఇంటి తలుపు తట్టడం మరో ఎత్తు. ఇదే ఫార్ములాతో కమలనాథులు రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ సమరంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ కీలక నియామకాలు చేపట్టింది. ఎన్నిక వస్తే అభ్యర్థి ఒక్కరే కనిపిస్తాడు. కానీ గెలుపు వెనుక మాత్రం వందల మంది పనిచేస్తారు.. అందుకే ముందుగానే ఎన్నికల ఇన్‌ఛార్జీలను రంగంలోకి దించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్యను నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను ఇన్‌ఛార్జీలుగా నియమించేసింది.
అంతేకాదు.. జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగిస్తూ క్షేత్రస్థాయి కసరత్తును వేగవంతం చేస్తోంది. ఇక టికెట్ పంచాయితీ షురూ అయింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం కోసం డీకే అరుణ ముఖ్య అనుచరుడు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, విద్యావంతుడు, మంచి వాగ్దాటి ఉన్న సారంగుల అమర్‌నాథ్.. సీనియర్ నేత మల్లారెడ్డి.. వంటి పేర్లు వినిపిస్తున్నాయట. అంతేకాదు..
చివరి బంతి వరకు మ్యాచ్ ఉంటుందన్నట్టుగా.. చివరి నిమిషంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేరును ఫైనల్ చేసే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోందట. ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక సహ ఇన్‌ఛార్జి కాసం వెంకటేశ్వర్లు.. ఓయూ ఉద్యమ నేపథ్యం ఉన్న యువనేత పుల్లారావు యాదవ్, సీనియర్ నేత ప్రకాశ్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, బండారు కవితారెడ్డి వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయట.
అయితే ఎవరి పేరు వినిపిస్తుందన్నది కాదు. ఎవరి వెనుక ఓటర్ల బలం ఉంది..? ఎవరి వెంట కేడర్ నడుస్తుంది..? ఎవరు గెలుపు తీరానికి పడవను చేర్చగలరు..? ఇదే ఇప్పుడు కమలనాథుల ముందున్న అసలు ప్రశ్న. అందుకే బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం అక్టోబర్ మొదటి వారంలో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం పోటీ ఒకవైపు.. గెలుపు కోసం వ్యూహం మరోవైపు.. చూస్తుంటే కమలం పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ మామూలు టికెట్ కాదు.. ప్రెస్టీజ్ టికెట్‌గా మారిపోయినట్టే కనిపిస్తోంది.
అభ్యర్థి ఎవరైనా.. అసలు టార్గెట్ మాత్రం పట్టభద్రుల ఓటు బ్యాంకే ఫైనల్. అందుకే బీజేపీ తన ప్రచార అస్త్రాలకు పదును పెడుతోందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. ఇవన్నీ ప్రధాన అజెండాగా పట్టభద్రుల ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలను కూడా ప్రస్తావిస్తూ..
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటినీ టార్గెట్ చేసే డబుల్ అటాక్‌కు సిద్ధమవుతోందట. ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలు.. యువతకు అందుతున్న అవకాశాలను కూడా గ్రాడ్యుయేట్లకు వివరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా తేలిగ్గా తీసుకోకూడదు. ఒక్క పట్టభద్రుడినీ వదలకూడదు అన్నట్టుగా పార్టీలు మైక్రో లెవల్ ప్లానింగ్‌కు దిగుతున్నాయట.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. ప్రతి మండలానికి ప్రత్యేక బాధ్యతలు.. ప్రతీ బూత్‌కు కేడర్.. ప్రతి పట్టభద్రుడి వరకు చేరేలా వ్యూహం. అంటే.. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అసలు ఎన్నికల యుద్ధం మొదలైపోయిందన్నమాట. ఇక అభ్యర్థి ఎంపికలో మాత్రం బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.
చరిష్మా గల పేరు ఉందా..? పార్టీకి పరిచయం ఉందా..? కేడర్ బలం ఉందా..? పట్టభద్రుల్లో గుర్తింపు ఉందా..? అన్నింటికంటే ముఖ్యంగా.. బ్యాలెట్ బాక్స్ దగ్గర బలాన్ని చూపించగలరా..? ఈ లెక్కలన్నీ వేసిన తర్వాతే తుది అభ్యర్థులను ఖరారు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. మూడు ప్రధాన రాజకీయ శక్తులు.. టికెట్ కోసం బీజేపీలో హాట్ ఫైట్.. ఓటర్ల నమోదులో ఆధిపత్యం కోసం పోటీ.. ఇక అభ్యర్థి ఎంపికలో బీజేపీ వేసే ఒక్క అడుగు.. మొత్తం ఎన్నికల సమీకరణాలనే మార్చేస్తుందా..?
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ముందడుగు వేసింది. బీఆర్ఎస్ తన వ్యూహంతో సిద్ధమవుతోంది. బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపికను ఇంకా సస్పెన్స్‌లో ఉంచింది. చివరికి కమలం ఎవరిని బరిలోకి దింపుతుంది..? పాత విజయాల ఫార్ములానే నమ్ముకుంటుందా..? లేక ఈసారి కొత్త ప్రయోగంతో గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.




