Off The Record: ఫీజు రీయంబర్స్‌మెంట్ పై బీజేపీ పోరుబాట
Off The Record: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై బీజేపీ 'విద్యార్థి భరోసా' యాత్ర చేపట్టింది.
Off The Record: ఫీజు రీయంబర్స్‌మెంట్ పై బీజేపీ పోరుబాట
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో కమలం పార్టీ మరో పోరు బాటకు ఉవ్విళ్లూరుతోంది. రైతు గోస- బీజేపీ భరోసా తర్వాత ఇప్పుడు ఫీజు పోరు- విద్యార్థికి బీజేపీ భరోసా పేరుతో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఎంచుకుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్‌తో పాటు పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, అలాగే పార్టీ సంస్థాగత బలోపేతం, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలపై అన్నింటిపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నేతలు నిర్ణయించారట. రైతు గోస పోరుబాటతో రైతుల్లో పట్టు పెంచుకున్న బీజేపీ... ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
ప్రధానంగా రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలనే లక్ష్యంతో రంగంలో దిగింది బీజేపీ. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలపై పోరుకు సిద్ధమైంది. దాదాపు 12 వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వ తీరు.. అవరోధంగా మారుతోందని మండిపడుతున్నారు. ఫీజు బకాయిలతో అనేక మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక.. పై చదువులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఉద్యోగాలు వచ్చినా... కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లాల వారీగా ఎమ్మెల్యే, ఎంపీ,ఎమ్మెల్సీ బృందాలు నేరుగా విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకుని వారి నుంచి ఫిర్యాదులు, అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టబోతోంది.
ముందుగా వినతి పత్రాలు, వివరాల సేకరణ... తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమానికి సమరశంఖం పూరించేందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ముందు మాట... తర్వాత నడక బాట... చివరికి పోరాటం" అన్న ఫార్ములాతో కమలనాథులు అడుగులు వేసేందుకు కంకణం కట్టుకున్నారట. యువత కదిలితే రాజకీయాలు కదులుతాయి అన్న లైన్ లో యువత, విద్యార్థుల ఓటు బ్యాంకుపై కాషాయ పార్టీ ప్రత్యేక వ్యూహంతో దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
మరోవైపు రైతుల అంశాన్ని కూడా వదిలేయబోమని స్పష్టం చేస్తోంది బీజేపీ. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని... రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. రైతు సమస్యలు ఒకవైపు... విద్యార్థుల సమస్యలు మరోవైపు... రెండు రాజకీయ అస్త్రాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే వ్యూహం బీజేపీ అమలు చేస్తోందనే చర్చ జోరందుకుంది. ఒక్క బాణంతో రెండు పిట్టలు" అన్నట్టుగా దేశానికి వెన్నెముక రైతు, దేశ భావిభారత పౌరులైన విద్యార్థి,యువత సమస్యలను ఎంచుకుని ముందుకు వెళ్లాలని కాషాయ పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. పార్టీ మరింతగా బలపడాలంటే.. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా వెళ్లాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో.. జెన్-జీ పాలిటిక్స్ ఊపందుకుంటున్నాయి. ప్రధాని మోడీ సైతం.. యువత ఆలోచనలకు తగ్గట్టుగా నేతల ప్రణాళికలు ఉండాలని గతంలో పలుమార్లు సూచించారు. దీంతో రాష్ట్రంలో యువత, నిరుద్యోగులను ఆకర్షించేందుకు కమలదళం పావులు కదుపుతోంది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో.. సర్కార్ వైఖరిని ఎండగట్టి.. విద్యావంతులు, విద్యార్థుల మద్దతు కూడగట్టాలని చూస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై బీజేపీ చేపట్టబోయే "విద్యార్థి భరోసా యాత్ర" కేవలం ఉద్యమమేనా..? లేక 2028 ఎన్నికల దిశగా వేసిన రాజకీయ అడుగులకు సంకేతమా..? జిల్లాల్లో విద్యార్థుల నుంచి సేకరించబోయే వినతిపత్రాల్లో ఏముంటుంది..? బీజేపీ ప్రకటించబోయే తదుపరి కార్యాచరణ ఎంత దూకుడుగా ఉంటుంది..? ఫీజు పోరుబాటతో విద్యార్థులకు మేలు జరుగుతుందా ? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది...? విద్యార్థి భరోసా యాత్ర బీజేపీకి ఏ మేరకు లాభం చేకూరుతుందో.. చూడాలి మరి.




