Off The Record: ఖమ్మం జిల్లాలో తగ్గిన కమలం జోరు?
Off The Record: ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఎందుకీ కష్టాలు? బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే పార్టీ దెబ్బతింటోందా?
Off The Record: ఖమ్మం జిల్లాలో తగ్గిన కమలం జోరు?
Off The Record: ఖమ్మం జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కేరాఫ్‌గా ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్, టిడిపి, వైసిపి, బీఆర్‌యస్ పార్టీలు కొంత కాలం ప్రభావం చూపాయి. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. గత ఎన్నికలో ఒక్క స్థానంలో బీఆర్ఎస్, మరో స్థానంలో మిత్రపక్షం సీపీఐ మినహా మిగతా సీట్లను హస్తం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఐతే ఖమ్మం గుమ్మంలో సత్తా చాటాలని కాషాయ దళం ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఉత్తర తెలంగాణలో గణనీయంగా, దక్షిణ తెలంగాణలో కొంతమేర ప్రాభల్యం చూపిస్తున్న బీజేపీ.. ఖమ్మం జిల్లా విషయానికి వచ్చే సరికి మాత్రం డీలా పడిపోతుంది. ఖమ్మంలో కమలం పార్టీకి కనీసం పట్టు దక్కకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఖమ్మం జిల్లాలో బీజేపీకి నాయకత్వం లోపం ప్రధాన సమస్యగా మారిందట. జిల్లా కమిటీలో పదవుల రాజకీయం తప్ప పార్టీ బలోపేతం కోసం పనిచేసే నాయకుడే కరువయ్యారనే టాక్ వినబడుతుంది. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో స్టేజ్ మీద నాయకుల హడావుడి.. స్టేజ్ కింద కార్యకర్తల కరువుతో తూతూ మంత్రంగా నెట్టకొస్తున్నారట. అధిష్టానం నుండి వచ్చే నాయకుల క్షేత్రస్థాయి పర్యటనలో 20 మంది కంటే ఎక్కువ క్యాడర్ కనిపించట్లేదంటే అతిశయోక్తి కాదేమో అనేలా పరిస్థితి నెలకొన్నదట. కులాల కుమ్ములాటలు, ప్రతి కార్యక్రమంలో వాదోపవాదాలు చేసుకోవడం నాయకులకు పరిపాటిగా మారిందని క్యాడర్ లో గుసగుసలు వినపడుతున్నాయి.
సఖ్యత లేని లీడర్ల తీరు, పార్టీలో సర్వం తామే అన్నట్లు కొందరి వ్యవహారాలు, చుట్టపు చూపుల వచ్చిపోయే నాయకుల వైఖరి పార్టీ ఎదుగుదలకు, కేడర్‌కు ఇబ్బందిగా మారిందట. కొందరు నాయకులు సోషల్ మీడియాలో హడావుడి తప్ప జిల్లాలో పట్టుకోసం కనీస ప్రయత్నం లేదనేది స్పష‌్టంగా కనబడుతుందట..
మండల స్థాయి కమిటీలలో ఉన్న వారికి కూడా దిశానిర్దేశం లేక.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు పార్టీ పరిస్థితి మారిందట. క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కేడర్‌కు సరైన మార్గనిర్దేశం కరువైందట. జిల్లాలో పొంగులేటి సుధాకర్ రెడ్డి కొంతమేర ప్రభావం చూపుతున్నా.. జిల్లా కమిటీలో నిస్తేజం కారణంగా పార్టీ బలోపేతం అవ్వట్లేదనే టాక్ నడుస్తోంది. కమ్మ, రెడ్డి, యాదవ, బ్రాహ్మణ, వైశ్య, గౌడ్, ఎస్సి వర్గాలు ఇలా కులాల వారిగా నాయకులు చీలిపోయి ఏ కులం నాయకుడు వస్తే ఆ కులం వారి హడావుడి తప్ప జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఎటువంటి పని జరగట్లేదని సీనియర్ నేతలు అంతర్మథనంలో ఉన్నారు.
మరోవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో కొంత మేర బిజెపి ప్రభావం చూపినా.. దాన్ని అనుకూలంగా మలచుకునే విషయంలో జిల్లా కమిటీ బొక్కబోర్లా పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రావు ఓటమి తరువాత జిల్లా పార్టీకి దూరంగా ఉండటం జిల్లా కమిటీ నిర్ణయమే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బిజెపిలో చేరినా ఆయన సేవలు వినియోగించుకునే నాధుడే లేడని స్థానిక కార్యకర్తలు మదనపడుతున్నారట. కేంద్ర మంత్రుల స్థాయిలో పని చేసిన నాయకుల్నే పట్టించుకోకుంటే ఇక తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని స్థానిక నాయకుల్లో నిస్తేజం ఆవహించిందట. ఇలా జిల్లా వ్యాప్తంగా బిజెపి బలోపేతం కోసం కృషి చేయాల్సిన నాయకులు రెస్ట్ మోడ్ లో ఉండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట.
మరి జిల్లాలో కమలం పార్టీ ఎదుగుదల అంశంపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సినదే.




